ధనుర్మాసం: తిరుప్పావై 18వ రోజు పాశురం.. ఓ నీలాదేవి ... కోళ్లు కూయుచున్నాయి..  తలుపు గడియ తెరువుము..!

భగవానుని అమ్మవారిద్వారా ఆశ్రయించుట మహాకౌశలము. అట్టి కౌశలము కలవారగుటచేతనే భగవద్రామానుజులు  శ్రీమన్నారాయణుని శరణము పొందుటకు ముందుగా అమ్మవారిని తమ శరణాగతి గద్యమున శరణము నొందిరి. 

    ఉన్దు మదకళిత్త నోడాద తోళ్ వలియన్ 
    నన్దగోపాలన్ మరుమగళే... నప్పిన్నాయ్!
    కన్దమ్ కమళుమ్ కుళలీ.... కడై తిఱవాయ్
    వన్దెజ్గమ్ కోళియళైత్తగాణ్; మాదవి 
    ప్పన్దల్ మేల్ పల్ కాల్ కుయిలినజ్గళ్ కూవినగాణ్
    పన్దార్ విరలి... ఉన్ మైత్తునన్ పేర్ పాడ
    చ్చెన్దామరైక్కైయాల్ శీరార్ వళైయొలిప్ప 
    వన్దు తిఱవాయ్ మగిళ్ న్దు ఏలో రెమ్బావాయ్!!


భావం :  ఏనుగులతో పోరాడగలిగిన వాడును, మదము స్రవించుచున్న ఏనుగువంటి బలముకలవాడును, యుద్ధములో శతృవులను చూచి వెనుకకు జంకని భుజబలము కలవాడును అయిన నందగోపుని కోడలా ... సుగంధము వెదజల్లుచున్న కేశపాశముగల ఓ నీలాదేవి ... తలుపు గడియ తెరువుము. కోళ్ళు అంతట చేరి అరచుచున్నవి. మాధవీలత పాకిన పందిరిమీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోకిలలు కూయుచున్నవి. కావున తెల్లవారినది.... చూడుము. బంతి చేతిలో పట్టుకొనినదానా ...  మా బావ గుణములను కీర్తించుటకు వచ్చితిమి... నీవు సంతోషముతో లేచి నడచివచ్చి... ఎర్రతామర పూవును బోలిన నీచేతితో.... అందమైన చేతి కంకణములు గల్లుమని ధ్వని చేయునట్లు తలుపు తెరువుము.

 నంద గోపులు మొదలుగా బలరాముని వరకు మేల్కొలిపి తలుపులు తీయమని ప్రార్ధించినను వారు తెరువక పోవుటచేత... మదజలము స్రవించుచున్న ఏనుగువంటి బలము కలవాడై శత్రువులకు భయపడని భుజములుగల నందగోపుని యొక్క కోడలా... ఓ నప్పిన్న పిరాట్టీ... పరిమళిస్తున్న కేశ సంపద కలదానా...తలుపు తెరువుమమ్మా... కోళ్లు వచ్చి కూయుచున్నవి.  జాజి పందిళ్ల మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటి మాటికి కూయుచున్నవి సుమా... నీవు, నీ భర్తయును సరసనల్లాపములాడు సందర్భములలో నీకు ఓటమి గలిగినచో మేము నీ పక్షమునేయుందుము.దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడెదములే.... కావున అందమైన నీ చేతులకున్న ఆ భూషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడచి వచ్చి ఎర్ర తామరలవంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరువుమమ్మా...' అని గోపాంగనలు నీళాదేవి నీ పాశురంలో మేల్కొల్పుచున్నారు.

లోకంలో పురుషుడిలో నామ రూపాలు లేని జీవవర్గానికి నామ రూపాలు ఇచ్చేది స్త్రీ, అందుకే ఆవిడ వల్ల ఆ వ్యక్తి సంతానవంతుడు అవుతాడు. అప్పుడు వాడు ఒక పూర్ణుడు అయ్యాడని అనొచ్చు. అదే జగత్ కారణమైన భగవంతునిలో ఉండే జీవరాశినంతా పైకి వెలువరించి, పైకి ఈవేళ మనం చూసేట్టుగా తీర్చి దిద్దేది లక్ష్మీదేవి.

గోపికలు కృష్ణుని పొంది అనుభవింపవలెను అనెడి ఆవేశంతో కృష్ణపరమాత్మ అగుపడగానే తము అనుభవింపవచ్చునని ఆశపడి మేలుకొలిపిరి. కృష్ణుడు మేల్కోలేదు, ప్రక్కనే ఉన్న బలరాముని మేల్కొలిపిరి, ఐనను కృష్ణుడు మేల్కోలేకపోవుటచే .... నీలాదేవిని ఆశ్రయించవలెనని ఆమెను ఈ పాశురమున మేలుకొలుపుచున్నారు.  

అమ్మవారికి పురుషకారము అని వ్యవహారము. ఆమె మధ్యవర్తిని. జీవులకు కావలసిన ఫలములను సమృద్ధిగా ఇచ్చునట్లు సర్వేశ్వరుని మార్చునది.కావున ఆమెను 'పురుషకారము' అందురు. జీవులు తమ పాపములకు తామే నిష్కృతి ఒనర్చుకొని పరమాత్మను చేరలేరు. ఆమెను ఆశ్రయింపని వారు పరమాత్మను పొందలేరని గుర్తించి నీలాదేవిని గోపికలు మేలుకొలుపుచున్నారు. 

శ్రీ నందగోపులను, శ్రీ యశోదాదేవిని, శ్రీకృష్ణుని, శ్రీ బలరాముని క్రమముగా గోపికలు మేల్కొల్పి తమ వ్రతమును సాంగోపాంగముగ పూర్తియగునట్లు చేయుడని వేడిరి.ఐననూ లేవకుండుట జూచి తమకు పురుషకార భూతురాలైన నప్పిన్నపిరాట్టిని (నీళాదేవిని) నందగోపుని కోడలును మేల్కొలుపు చున్నారు.