భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారాముడికి హైదరాబాద్‌కు చెందిన పిన్నమనేని బాల మురళీకృష్ణ, శాంతి దంపతులు రత్నాంగి కవచాలను బహుకరించారు. 51 వేల రత్నాలతో రూ.40 లక్షల వ్యయంతో వీటిని చేయించారు. ఈ కవచాలను శనివారం ఈవో రమాదేవి, ప్రధానార్చకులు అమరవాది విజయరాఘవన్, రామ స్వరూపాచార్యుల చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా కవచాలకు యాగశాలలో ప్రత్యేక హోమం, సంప్రోక్షణ పూర్తి చేశారు. అనంతరం ఈవో రమాదేవి మాట్లాడుతూ.. భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామికి రత్నాంగి సేవను నిర్వహిస్తామని తెలిపారు. ఆదివారం స్వామి వారికి అభిషేకం నిర్వహించిన తర్వాత, మూలవరులకు రత్నాంగి అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పిస్తామని చెప్పారు.