యాదగిరిగుట్టలో భక్తజన సందడి

  • కార్తీకమాస భక్తులతో కిక్కిరిసిన యాదగిరిగుట్ట
  • ఒక్కరోజే 1,648 మంది దంపతుల వ్రతాలు 
  • ఆలయానికి  రూ.79.70 లక్షల ఆదాయం

యాదగిరిగుట్ట, వెలుగు : శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తులతో పోటెత్తింది. కార్తీకమాసానికి తోడు సెలవురోజు కావడంతో ఆదివారం కార్తీక పూజలు చేసి మొక్కులు చెల్లించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హైదరాబాద్ తో పాటు  రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి రావడంతో ఆలయంలో రద్దీ నెలకొంది. కార్తీక దీపారాధన, సత్యనారాయణస్వామి వ్రతాలు చేశారు. భక్తుల రద్దీతో స్వామివారి దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలో నిల్చున్నారు.  ధర్మదర్శనానికి 4, స్పెషల్ దర్శనానికి గంటన్నర సమయం పట్టిందని పలువురు భక్తులు తెలిపారు. 

శివాలయం, కార్తీక దీపారాధన, వ్రత మండపాలు సందడిగా కనిపించాయి. కొండపైన ప్రధానాలయం, శివాలయం, విష్ణుపుష్కరిణి.. కొండ కింద వ్రత మండపాలు, లక్ష్మీపుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన కార్తీక దీపారాధన స్టాళ్లలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఒక్కరోజే 1,648 మంది దంపతులు సత్యనారాయణస్వామి వ్రత పూజలు చేయగా.. ఆలయానికి రూ.13,18,400 రాబడి వచ్చింది. 

పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా రూ.79,70,843 ఆదాయం సమకూరిం ది. ప్రసాద విక్రయం ద్వారా రూ.26,32,710, కొండపైకి వాహనాల ఎంట్రీతో రూ.8 లక్షలు, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.3,21,750, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.6,14,700, వీఐపీ దర్శన టికెట్ల ద్వారా రూ.14,11,950 ఇన్ కమ్ వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు