ఆక్రమణలపై చర్యలు తీసుకుంటాం

  • 2050 దృష్టిలో పెట్టుకుని మాస్టర్​ప్లాన్ రూపొందిస్తున్నాం
  • పెండింగ్ బిల్లులు, అదనంగా మరో రూ.100 కోట్లు ఇయ్యాలే..
  • మామూనూర్ ఎయిర్​పోర్ట్ పునర్నిర్మించాలే.. 
  • మంత్రి కొండా సురేఖ, మేయర్ గుండు సుధారాణి, కౌన్సిల్ సభ్యుల తీర్మానం

వరంగల్​/వరంగల్ సిటీ, వెలుగు: గ్రేటర్ వరంగల్​లోని చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకుని, వాటిని అభివృద్ధి చేస్తామని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మంగళవారం బల్దియాలో మేయర్​గుండు సుధారాణి అధ్యక్షతన జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించారు. సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్​రెడ్డి, నాగరాజు, రేవూరి ప్రకాశ్​రెడ్డి పాల్గొనగా, సురేఖ ఎక్స్​అఫిషియో మెంబర్​గా ప్రతిజ్ఞ చేశారు.

సమావేశంలో మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్​కు ధీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా 2050 వరకు జనాభా, అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాస్టర్​ప్లాన్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఫార్మా సిటీ, ఐటీ సర్వీసెస్, మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఎకో టూరిజం, ఎడ్యుకేషనల్ ఇన్సిట్యూషన్స్, స్టేడియం, ఎయిర్ పోర్టు, లాజిస్టిక్స్ పార్కు, టూరిజం వంటి అంశాలు ఉండేలా  మాస్టర్​ప్లాన్​ తయారు చేస్తున్నట్లు చెప్పారు.

ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు యుద్ధ ప్రతిపాదికన చేపడుతున్నామన్నారు. సిటీలో చేసిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు మంజూరు చేయడానికితోడు అదనంగా మరో రూ.100 కోట్లు కేటాయించాలని, మామూనూర్ ఎయిర్​పోర్ట్​ పునర్నిర్మించాలని, ప్రాపర్టీ సెల్ఫ్ అసెస్మెంట్ కింద ఇంటి యజమానులకు 25 రెట్లు అధికంగా నమోదైన టాక్స్​ను మాఫీ చేయాలని మంత్రితో పాటు కౌన్సిల్ సభ్యులు తీర్మానం చేశారు.

డీపీఆర్ సిద్ధం చేస్తున్నాం 

వరంగల్ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ కేబుల్స్, అండర్ గ్రౌండ్ వరద నీటి కాలువలు, అండర్ గ్రౌండ్ తాగు నీటి సరఫరా ప్రాజెక్టులు, ఎస్టీపీలను అమలు చేసేందుకు నిపుణులతో డీపీఆర్​సిద్ధం చేస్తున్నట్లు మేయర్ సుధారాణి తెలిపారు. హనుమకొండలో కీలకమైన నయీంనగర్ నాలా విస్తరణ, రిటైనింగ్​వాల్, బ్రిడ్జి నిర్మాణాలను ఆరు నెలల్లోనే పూర్తి చేయడం అభినందనీయమన్నారు. ఈ పనులతో పాలకవర్గానికి మంచి పేరు లభించిందన్నారు. ప్రణాళిక బద్ధంగా నాలాలు, అంతర్గత డ్రైనేజీల్లో పూడికతీత పనులతో వరద నీరు సాఫీగా వెళ్లి పలు కాలనీలకు ముంపు ప్రమాదం తప్పిందన్నారు. 


ఇదే స్ఫూర్తితో మిగిలిన బ్రిడ్జిలు పూర్తి చేస్తామన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నగరం, కేరళలోని తిరువనంతపురం, కొచ్చిన్ నగరాలలో స్మార్ట్ సిటీ పనుల అభివృద్ధిని అధ్యయనం చేయడానికి పాలకవర్గం, అధికారులతో స్టడీ టూర్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ సీఎం వరంగల్​ పర్యటనలో నగరానికి మరిన్ని నిధులు తీసుకువచ్చేలా చొరవ చూపుతామన్నారు. ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ విలీన గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ బల్దియాలో శానిటేషన్ సమస్యను అధిగమించడానికి 250 మంది కార్మికులను నియమించడానికి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాఖడే, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

బీఆర్​ఎస్​ కార్పొరేటర్ల ఆందోళన.. 

గ్రేటర్ కార్పొరేషన్ సమావేశం ప్రారంభానికి ముందు మేయర్ వైఖరిని నిరసిస్తూ, బీఆర్​ఎస్​ కార్పొరేటర్లు కౌన్సిల్ హాల్ వద్ద ఆందోళనకు దిగారు. డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అన్ని డివిజన్లకు సమాన న్యాయం చేయాలని నినాదాలు చేసి కౌన్సిల్ పోడియం వద్ద బైఠాయించారు. సమస్యలపై చర్చించుకుందామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వారిని సముదాయించదంతో కూల్ అయ్యారు.