తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు : బాలూనాయక్

  • ఎమ్మెల్యే బాలూనాయక్ 

దేవరకొండ, చింతపల్లి, కొండమల్లెపల్లి, నేరేడుగొమ్ము, వెలుగు : కేసీఆర్ పదేండ్లు రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని దేవరకొండ ఎమ్మెల్యే  బాలూనాయక్ మండిపడ్డారు. మంగళవారం దేవరకొండ మండలం ఇద్దంపల్లి నుంచి ఎర్రగుంటపల్లి వరకు రూ.2.70 కోట్లతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు, అంగన్​వాడీ, లైబ్రరీ భవన నిర్మాణం, చింతపల్లి మండలం ధైర్యపురి తండాలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. 

కొండమల్లెపల్లి మండలం దోనియాలలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు, నేరేడుగొమ్ము మండలం పెద్దమునిగల్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా బాలూనాయక్​మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్నారు. గత పాలకులు అభివృద్ధిని విస్మరించి పదేండ్లు బీఆర్ఎస్ రాష్ట్రాన్ని లూటీ చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు పొద్దున లేస్తే కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్  జమునామాధవరెడ్డి, ముక్కామల్ల వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రేఖాశ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.