ఎయిర్ క్వాలిటీ పడిపోతున్నది : 23 జిల్లాల్లో ‘అన్ హెల్దీ’ స్థాయిలో ఏక్యూఐ

  • అత్యధికంగా వరంగల్​లో 143గా రికార్డు 
  • హనుమకొండలో 130, హైదరాబాద్​లో 128
  • బండ్లు, పరిశ్రమలు, నిర్మాణాలు పెరగడమే కారణం

హైదరాబాద్​, వెలుగు : రాష్ట్రంలో గాలి నాణ్యత దెబ్బతింటున్నది. ఒకటి, రెండు సిటీల్లో కాదు.. దాదాపు అన్ని ప్రధాన పట్టణాల్లోనూ ఎయిర్ క్వాలిటీ పడిపోతున్నది. సిటీల పరిధి విస్తరిస్తుండడం, నిర్మాణాలు, వాహనాలు, పరిశ్రమలు పెరిగిపోతుండడం వంటి కారణాలతో వాయు కాలుష్యం ఎక్కువైపోతున్నది. ఫలితంగా గాలిలో కాలుష్య కారకాలైన పార్టిక్యులేట్​మ్యాటర్​(పీఎం) 2.5, పీఎం 10 స్థాయిలు పెరుగుతున్నాయి.

ఓ పది జిల్లాలను మినహాయిస్తే, మిగతా అన్ని జిల్లాల్లోనూ మనం పీల్చే గాలి విషతుల్యమైతున్నట్టు ‘ఆన్​లైన్ ​రియల్​  టైమ్ వెదర్ ​మానిటరింగ్’​ వ్యవస్థల ద్వారా తేటతెల్లమవుతున్నది. ఆ పది జిల్లాల్లోనూ గాలి నాణ్యత ఆశించిన స్థాయిలో ఏమీ లేదని లెక్కలు చెబుతున్నాయి. ఈ కాలుష్యం హైదరాబాద్​సిటీకే పరిమితం కాకుండా ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తున్నది. 

ఆ జిల్లాల్లో 100కు పైనే.. 

రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఎయిర్​క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) వందకు పైగానే నమోదవుతున్నది. వరంగల్, హనుమకొండలో హైదరాబాద్​కు మించి ఏక్యూఐ నమోదవడం ఆందోళన కలిగిస్తున్నది. వరంగల్​లో అత్యధికంగా ఏక్యూఐ 143 ఉండగా, పీఎం 2.5 స్థాయిలు క్యూబిక్ మీటర్ గాలిలో 59 మైక్రోగ్రాముల మేర ఉన్నట్టు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఏడాదిలో ఏక్యూఐ సగటు 120గా ఉండగా, దాదాపు 180 రోజుల పాటు అదే స్థాయిలో ఏక్యూఐ నమోదవుతున్నది.  హనుమకొండలో ఏక్యూఐ 130 ఉండగా, పీఎం 2.5 స్థాయిలు క్యూబిక్ మీటర్​ గాలిలో 48 మైక్రోగ్రాముల మేర ఉన్నాయి.

 ఏడాదిలో ఏక్యూఐ సగటు 116గా, 179 రోజుల పాటు అంతే స్థాయిలో ఏక్యూఐ రికార్డ్​అయింది. ఇక హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్​వంటి జిల్లాల్లోనూ ఏక్యూఐ 110 కన్నా ఎక్కువగానే ఉంటున్నది. హైదరాబాద్​సిటీలో ఏక్యూఐ 128 ఉండగా, పీఎం 2.5 స్థాయిలు 46 గ్రాముల మేర ఉంటున్నాయి. ఏడాదిలో 166 రోజుల పాటు గాలి నాణ్యత అత్యంత తక్కువగా ఉంటున్నట్టు తేలింది. హైదరాబాద్​సిటీ పరిధిలోని సనత్​నగర్​లో 125, రాజేంద్రనగర్​లో 124, మేడ్చల్​లో 120, జీడిమెట్లలో 116, పటాన్​చెరులో 114 మేర ఏక్యూఐ నమోదవుతున్నట్టు తేలింది. 

50 దాటితే చెడు గాలినే ..

సాధారణంగా ఏక్యూఐ స్థాయి 50 దాటిందంటే అది చెడు గాలి అని ఎక్స్​పర్ట్స్​చెబుతున్నారు. పది జిల్లాల్లో ఏక్యూఐ స్థాయి 75 నుంచి 99 మధ్య ఉండగా, మిగతా జిల్లాల్లో 100 నుంచి 149 మధ్య రికార్డవుతున్నది. 50 నుంచి 100 మధ్య ఏక్యూఐ ఉంటే గాలి నాణ్యతను పూర్​క్వాలిటీగా, 100 నుంచి 150 వరకుంటే ‘అన్​హెల్దీ’గా, 150 నుంచి 200 రికార్డయితే అత్యంత అనారోగ్యకరమని, 200 నుంచి 300 మధ్య రికార్డయితే ప్రమాదకరం, 300కు పైన రికార్డయితే అత్యంత ప్రమాదకరంగా చెబుతారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏక్యూఐ అన్​హెల్దీ స్థాయిలో ఉన్నట్టు వెల్లడైంది. 

వృద్ధులు, పిల్లలకు ఇబ్బంది.. 

ఈ గాలి వృద్ధులు,చిన్న పిల్లలకు చేటు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆస్తమా, బ్రాంకైటిస్​వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. హార్ట్​పేషెంట్ల సమస్య మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేగాకుండా ఆ గాలికి సామాన్యులు ఎక్స్​పోజ్​అయినా కళ్ల మంటల వంటివి బాధిస్తాయని చెబుతున్నారు. అదే పనిగా ఆ గాలిని పీలిస్తే సమస్యలు తీవ్రమవుతాయని పేర్కొంటున్నారు. 

కాలుష్యం ఎక్కువున్న సిటీ/టౌన్ ఇవీ.. 

సిటీ/టౌన్    ఎయిర్​ క్వాలిటీ  ఇండెక్స్

వరంగల్             143
హనుమకొండ     130 
హైదరాబాద్       128 
నల్గొండ              119 
కరీంనగర్           116
నిజామాబాద్      115  
భువనగిరి          113 
మిర్యాలగూడ    112 
సూర్యాపేట       112 
జగిత్యాల           111 
పెద్దపల్లి            106