కేంద్ర రాష్ట్రాల వివాదాలు

భారతదేశ ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మన రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగాన్ని ఏక కేంద్ర, సమాఖ్య లక్షణాల కలిపి రూపొందించారు. సిద్ధాంతపరంగా, సూత్రబద్దంగా సమంజసంగా భావించినప్పటికీ ఆచరణలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. స్వాతంత్ర్యానంతరం అంటే 1947 నుంచి 1967 వరకు మన దేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు, సమస్యలు తలెత్తలేదు.

దీనికిగల ప్రధాన కారణం కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, అదేవిధంగా 1964 వరకు మన దేశ పరిపాలన మొత్తాన్ని నెహ్రూ ఏకచ్ఛత్రాధిపత్యంతో పరిపాలన నిర్వహించడం, 1967లో జరిగిన నాలుగో సాధారణ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎనిమిది రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడం, అదేవిధంగా రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కావాలనే డిమాండు చేయడం వల్ల కేంద్రానికి, రాష్ట్రాలకూ మధ్యలో వివాదాలు, సమస్యలు తలెత్తాయి. 

పరిపాలనా సంబంధాల్లో కూడా కేంద్రీకృత ధోరణి ఉంది. 256, 257 అధికరణల ప్రకారం రాష్ట్రాలకు పరిపాలనా ఆదేశాలను కేంద్రం జారీ చేయవచ్చు. రాష్ట్రాల్లో కీలక పాత్ర పోషించే గవర్నర్​లను కేంద్రమే నియమిస్తుంది. 356 అధికరణ రాష్ట్ర ప్రభుత్వాల పాలిట మరణ శాసనం లాంటిదని అంబేద్కర్​ వర్ణించారు. అంతర్రాష్ట్ర, జాతీయ జలవనలరు సంఘలపై ఆధిపత్యం కేంద్రానిదే. దేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య పరిపాలనా సంబంధాలను మున్సిపల్​ సంబంధంగా వర్ణిస్తారు. ఆర్థికంగా రాష్ట్రాలు తరచూ కేంద్రంపైనే ఆధారపడాల్సి వస్తున్నది. నాలుగో ఆర్థిక సంఘం సూచనలను కేంద్రం పట్టించుకోలేదు.

కేంద్ర ఆర్థిక వనరుల్లో 35 శాతం రాష్ట్రాలకు కేటాయించాలని 12వ ఫైనాన్స్​ కమిషన్​ సూచించింది. రాష్ట్రాలకు 29 శాతం, కేంద్రానికి 71 శాతం నిధులు కేటాయించాలని 80వ రాజ్యాంగ సవరణ పేర్కొన్నది. ఆదాయ పన్నును కేంద్రమే విధించి వసూలు చేసి కేంద్ర, రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తునన్నా ఆదాయపన్నుపై వేసే సెస్​లో రాష్ట్రాలకు వాటా లేదు. 282, 275 ఆర్టికల్స్​ ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు సమకూర్చే ఆర్థిక వనరులు, సహాయక గ్రాంట్లలో కేంద్రానికి విచక్షణాధికారాలు ఉన్నాయి.

ఆరు దశాబ్దాలుగా కేంద్ర, రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు వచ్చాయి. 1967 తర్వాత రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన అనేక ప్రతిపక్ష, ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కావాలనే డిమాండు చేస్తున్నాయి. గవర్నర్ వ్యవస్థ అనేక వివాదాలకు దారితీస్తున్నది. 356 అధికరణాన్ని కేంద్రం 100 సార్లకుపైగా దుర్వినియోగం చేసినట్లు రాజ్యాంగ పున: సమీక్ష కమిషన్ పేర్కొన్నది. జాతీయ రాజకీయాలు శాసించే స్థాయికి ప్రాంతీయ పార్టీలు చేరుకున్నాయి. 

అధికారాల కేంద్రీకరణ

వాస్తవ సమాఖ్యను అనుసరించే దేశాల్లో రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కేటాయించి కేంద్రానికి పరిమిత అధికారాలు మాత్రమే కేటాయించగా మన దేశంలో కేంద్రానికి ఎక్కువ అధికారాలను కేటాయించడంతోపాటు రాష్ట్రాలకు తక్కువ అధికారాలను కేటాయించారు. అంతేకాకుండా ఉమ్మడి జాబితాపై పరోక్షంగా కేంద్రానికి అధికారాలు ఉండటం, అవశిష్ట అధికారాలు కేంద్రానికి కేటాయించిన కారణంగా మన దేశంలో బలమైన కేంద్రీకృత ధోరణి ఉంది. రాష్ట్రాలు తమకు తగిన అధికారాలు కేటాయించాలని డిమాండ్​ చేయడంతో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్యలో వివాదాలు ప్రారంభమయ్యాయని పేర్కొనవచ్చు. 

రాజకీయ కారణాలు

కేంద్రంలో ఒక పార్టీ, కూటమి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండటం వల్ల రాజకీయపరమైన విభేదాలు కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై కూడా ప్రభావాన్ని చూపాయి. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు రాజకీయ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సమస్యలు పెరిగాయి. 

ఆర్థిక కారణాలు

కేంద్రం ఆదాయ వనరులు ఎక్కువగా ఉండటం రాష్ట్రాలు నెరవేర్చాల్సిన బాధ్యతలు, విధులు అధికంగా ఉన్నాయి. అందువల్ల రాష్ట్రాలు ఎక్కువ ఆర్థిక వనరులు కావాలని కోరడం, కేంద్రం వాటిని ఇవ్వడానికి నిరాకరించడంతో కేంద్ర, రాష్ట్రాల మధ్యలో వివాదాలు ప్రారంభమయ్యాయని పేర్కొనవచ్చు. రాష్ట్రాలు తమ పాలనా విధుల నిర్వహణలో తరచూ కేంద్రంపై ఆధారపడాల్సి ఉండటం వల్ల సంతానం తదితర రాజ్యాంగ విశ్లేషకులు రాష్ట్రాల పరిస్థితిని ఉదాత్తమైన మున్సిపాలిటీల స్థితికి పడిపోయిందని విమర్శించారు. 

కేంద్రం తరచూ జోక్యం చేసుకోవడం

కేంద్రంలో అధికారంలోని ప్రభుత్వాలు రాష్ట్రాల పాలనా విషయాల్లో తరచూ ఆధిపత్యం చెలాయించడం , జోక్యం చేసుకోవడం రాష్ట్రాల హక్కులు, అధికారాలకు భంగం కలిగిస్తుననాయి. 

పెరుగుతున్న సంకుచిత ధోరణులు

ఈశాన్య రాష్ట్రాలు, జమ్ముకశ్మీర్​ తదితర రాష్ట్రాల్లో పెరుగుతున్న వేర్పాటువాద, సంకుచిత ధోరణులూ కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలకు 
కారణమవుతోంది.

రాజ్యాంగ, రాజ్యాంగేతర సంస్థల ప్రభావం

భారతదేశ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికతోపాటు రాష్ట్రాల ప్రణాళికలనూ కేంద్రంలోని కేంద్రీకృతమైన ప్రణాళికా సంఘమే రూపకల్పన చేస్తున్నది. అదేవిధంగా కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆదాయ వనరులను పంపిణీ చేసే కేంద్ర ఫైనాన్స్​ కమిషన్ ను కూడా కేంద్రమే నియమిస్తుంది.

356 అధికరణ దుర్వినియోగం

రాష్ట్రాలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందినప్పుడు కేంద్రం 356 అధికరణాన్ని అనుసరించి ఆ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధిస్తుంది. కేంద్రంలో అధికారంలోని పార్టీలు, ఇతర పార్టీలు అధికారంలోని రాష్ట్ర ప్రభుత్వాలను తరచూ రద్దు చేస్తూ అధికార దుర్వినియోగం చేస్తారు. 2002లో రాజ్యాంగ పున: సమీక్ష కమిషన్​ నివేదికలో మన దేశంలో 100 సార్లకు పైగా ఈ అధికరణను దుర్వినియోగ పరిచారని పేర్కొంది. 

గవర్నర్ వ్యవస్థ

భారత్​లోని రాష్ట్రాల్లో రాజ్యాంగాధిపతులుగా గవర్నర్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రాల వల్ల మొత్తం గవర్నర్​ పేరు కొనసాగుతుంది. గవర్నర్లను రాష్ట్రపతి నియమిస్తారు. తొలగిస్తారు. కేంద్రమే వారిని బదిలీ చేస్తుంది. అందువల్ల గవర్నర్లు రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు. 
రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తిభారత్​లో వాస్తవిక సమాఖ్యను అమలు చేయాలంటే రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కల్పించడంతోపాటు రాష్ట్రాల విషయాల్లో తరచూ కేంద్రం జోక్యం చేసుకోకుండా వాటికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. 2000లో జమ్ముకశ్మీర్​ శాసనసభ ఆ రాష్ట్రానికి సంపూర్ణ ప్రతిపత్తి కల్పించాలని అంటే ప్రత్యేక ప్రతిపత్తికి పరిమితం కాకుండా పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించాలని తీర్మానించింది. 

ప్రాంతీయ పార్టీలు

భిన్నత్వం గల మన దేశంలో జాతీయ రాజకీయాలను కూడా ప్రాంతీయ పార్టీలు శాసిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ ప్రయోజనాల కోసం జాతి ప్రయోజనాలను పణంగా పెడు తూ సంకుచితంగా ఆలోచిస్తున్నాయి.