సింగరేణితోనే ముడిపడిన జీవితాలు

సింగరేణి  బొగ్గు గని  కార్మికుల జీవితాలు సింగరేణితోనే ముడిపడి ఉన్నాయి. లక్షకు పైగా  కుటుంబాలు నల్లనేలలోనే తమ నివాసం  ఏర్పర్చుకుని జీవిస్తున్నాయి.  గుడి, మసీద్, చర్చ్ ఒకే వాడలో,  ఒకే ప్రాంతంలో  కూతవేటు దూరంలో కనిపిస్తాయి.  మేరా! ఆగాజ్ భీ తూ హై!  అంజామ్ భీ తూ హై! ( ప్రారంభం నీవే! గమ్యం నీవే ) నా నల్ల బంగారు నేల.. నా సింగరేణి. నా  రక్తం, చెమట అంతా నీకే అంకితం.  తుంహీ మేరీ మంజిల్!  ఔర్ జాన్ హై అంటూ సింగరేణిలోని  వేలాది  కార్మిక కుటుంబాలు తమ బతుకుబండిని లాగుతున్నాయి.  సింగరేణి మాకు సర్వస్వం.

సింగరేణి  లేకుంటే మేం ఇక్కడి దాకా వచ్చేవాళ్ళం కాదు.  మా పిల్లలు.. డాక్టర్లు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, మేధావులు, ఉద్యమకారులు, విప్లవకారులు,  ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, టీచర్లు,  సంస్థలో అధికారులు,  సంఘంలో నాయకులుగా ఎదిగారని కార్మికులు పేర్కొంటారు. 

పెరుగుతున్న మద్యం, డ్రగ్స్​ బాధితులు

దశాబ్దాలుగా ఈ ప్రాంతవాసులకు సింగరేణియే  ఆధారం.  ఈ సింగరేణి  కంపెనీని నమ్ముకుని  ఉద్యోగంలో ఉన్నప్పుడు,  పదవీ విరమణ చేసిన తరువాత కూడా నల్లనేల సాక్షిగా  సంస్థ మీద నమ్మకంతో  కార్మికులు బతుకుతున్నారు అంటే అతిశయోక్తి కాదు.  అయితే,  ఇప్పుడు  అక్కడ మద్యం ఏరులై పారుతున్నది.  డ్రగ్స్,  గంజాయి లాంటివి విచ్చలవిడిగా  కనిపిస్తున్నాయి.  మద్యం, డ్రగ్స్ బాధితులు పెరిగారు. కుటుంబాలు ఈ కారణంగా ఆగమాగం అవుతున్నాయి. చాలామంది రోగాల బారిన పడుతున్నారు.-------1989–- 90లో  సింగరేణి  శత వార్షికోత్సవాల సందర్భంగా  సంస్థ విడుదల చేసిన ఒక బ్రోచర్​లోని  ప్రణాళిక ప్రకారం 60 కొత్త బావులు ( బొగ్గు బ్లాక్స్ ) రావాలి. 45 వేలకు పైగా కొత్త ఉద్యోగాలు రావాల్సి ఉన్నది.  

గ్లోబలైజెషన్  కారణంగా సింగరేణి ప్రణాళికలు అన్నీ డస్ట్  బిన్​ పాలయ్యాయి.  రెండుసార్లు సింగరేణి  బీఐఎఫ్ఆర్​లోనికి వెళ్లి  కార్మికులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాలు,  రాష్ట్ర ప్రభుత్వం  కృషితో  బయటపడింది.  కేంద్రం 1100 కోట్లు అప్పు ఇచ్చి 663 కోట్ల వడ్డీ పిండుకున్నది.  అప్పు చెల్లింపు మీద కొంతకాలం సడలింపు ఇచ్చింది.  మొత్తంమీద సిక్కు మార్క్ పడకుండా సింగరేణిని రక్షించుకున్నారు.------

42 వేలకు పడిపోయిన కార్మికుల సంఖ్య

1.16 లక్షలున్న కార్మికుల సంఖ్యను 26 సార్లు గోల్డెన్ హ్యాండ్ షేక్ ఇచ్చి,  వీఆర్ఎస్ ఇచ్చి ఆ సంఖ్యను 65 వేలకు తగ్గించారు.  రిటైర్మెంట్లు పెరిగాయి.  గనుల మూత తదితర కారణాల వల్ల కార్మికుల సంఖ్య 2024 వచ్చేసరికి 42వేలకు పడిపోయింది.   1990లో  17.6  మిలియన్  టన్నులు మాత్రమే ఉన్న ఉత్పత్తి..  సగం కార్మికులు తగ్గినప్పటికి 70 మిలియన్స్​కు  పెరిగింది.   

కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలకు ఏటా 

6 వేల కోట్లకు పైగా వివిధ పన్నులు, రాయల్టీ, డివిడెండ్ల పేరిట చెల్లించడం జరుగుతోంది. అయితే,  దాదాపు పాతికేండ్ల నుంచి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ల నుంచి ఒక్క పైసా కేటాయింపు లేదు.  సంక్షేమం, వాటా బోనస్,  ఏది చేసినా, చెల్లించినా, నూతన ప్రాజెక్టులు ప్రారంభించినా అది సింగరేణి తన  సొంతంగా లేదా  అప్పుచేసి పెట్టాల్సిందే.  సంస్థకు  ప్రభుత్వం నుంచి రావాల్సిన,  బొగ్గు, విద్యుత్  సరఫరా బకాయిలు రూ.30,000 కోట్లు ఉన్నాయి.

సింగరేణి  సీఎండీగా బలరాం వచ్చిన తర్వాత 6 వేల కోట్ల బకాయిలు ఆయన వసూలు చేశారు.  కొత్త బొగ్గు బ్లాకుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.  సంస్థ భవిష్యత్తు, ముఖ్యంగా కార్మిక కుటుంబాలలో సంతోషం కోసం, వారి పిల్లల స్కిల్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తూ నిరంతరం కొత్త కార్యక్రమాలను చేపట్టాలి.  బొగ్గు గని కార్మికుడిని ఆత్మహత్య ఆలోచన నుంచి కాపాడాలి. కౌన్సెలింగ్​ సెంటర్లు నిర్వహించాలి..

- ఎండి. మునీర్,
 సీనియర్ జర్నలిస్ట్