ప్రభుత్వం మారినా..తీరని పార్ట్ టైం లెక్చరర్ల వెతలు

తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాలలో  వివిధ కారణాల వలన ఖాళీగా ఉన్న 1977 బోధనా సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడం వలన అటు బోధనపైన, ఇటు పరిశోధన పైన ప్రభావం పడుతోంది. వివిధ విశ్వవిద్యాలయాలు దశాబ్దాలుగా బోధనా సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడం వలన కాంట్రాక్ట్,  పార్ట్ టైం ప్రాతిపదికన అర్హత కలిగిన అధ్యాపకులను విశ్వవిద్యాలయాలే నియామకం చేసుకుంటున్నాయి.  


తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో  దాదాపు 1,445 మంది అధ్యాపకులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన,  678 మంది అధ్యాపకులు పార్ట్ టైం ప్రాతిపదికన పనిచేస్తున్నారు. 678 మంది పార్ట్ టైం అధ్యాపకులలో 255 మంది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, 216 మంది కాకతీయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. అయితే విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వందలాదిమంది పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలను పరిష్కరించడానికి  విశ్వవిద్యాలయ అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు చేపట్టకపోవడం వలన తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. అత్యున్నత విద్యాసంస్థల్లో అత్యున్నత విద్యార్హతలు కలిగి వెట్టిచాకిరి చేసే ఒక బాండెడ్ లేబర్ గా పార్ట్ టైం అధ్యాపకుల జీవితాలు మారుతున్నాయి.  ప్రభుత్వాలు, అధికారులు  వారి పట్ల పట్టింపు లేనట్లుగానే వ్యవహరిస్తున్నారు.

దశాబ్దపు అంధకారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు విశ్వవిద్యాలయాలలో ఫుల్ వర్క్ లోడ్ తో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులను కాంట్రాక్టు అధ్యాపకులుగా అప్​గ్రేడ్​ చేయటం వలన.. కొంత ఉద్యోగ భద్రతతో పాటు ప్రతినెల ఒక నిర్దిష్ట  వేతనం లభించేది. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి ముందస్తు ప్రభుత్వ అనుమతి లేకుండా కొత్త నియామకాలు చేపట్టరాదనే సర్క్యులర్ ని విడుదల చేసింది. ఆ సర్క్యులర్ పార్ట్ టైం అధ్యాపకులకు గొడ్డలిపెట్టుగా మారిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యులర్ ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ అధికారులు విశ్వవిద్యాలయ అధికారులు పార్ట్ టైం అధ్యాపకుల పట్ల వివక్ష చూపుతూనే ఉన్నారు. ఒక దశాబ్ద కాలంగా పార్ట్ టైం అధ్యాపకులు ఎలాంటి ప్రయోజనం పొందకుండానే పనిచేస్తున్నారు. 2017లో  విశ్వవిద్యాలయాలలో 1,061 బోధనా సిబ్బంది భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ, ఆ ఉద్యోగాలను ఈ రోజుకి భర్తీ చేయలేకపోయారు. శాసనసభ ఎన్నికలకు ముందు విశ్వవిద్యాలయాల్లోని బోధనా సిబ్బందిని భర్తీ చేయడానికి కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ (సీఆర్బీ) పెట్టాలని అసెంబ్లీలో బిల్లు పెట్టి తీర్మానం చేసినా గవర్నర్ ఆమోదించకపోవడం వలన బోధనా సిబ్బంది భర్తీ ప్రక్రియ కార్యరూపం దాల్చలేదు. దీంతో విశ్వవిద్యాలయాలలో  1977 పోస్టులు ఖాళీగా అలాగే ఉండిపోయినాయి. 

కొత్త ప్రభుత్వంపై ఆశతో

గత  బీఆర్ఎస్ ప్రభుత్వం విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలను పట్టించుకోకపోగా ఆ ప్రభుత్వ నిర్ణయాలతో  పార్ట్ టైం అధ్యాపకులకు మరింత నష్టం జరిగింది.  విశ్వ విద్యాలయాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పి ఆ ఖాళీలను భర్తీ చేయకపోగా, పనిచేస్తున్న పార్ట్ టైం కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలను కూడా పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ ఎన్నికలకు ముందు తన మేనిఫెస్టోలో విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులకి నెలకి రూ. 50వేల  వేతనం ఇస్తామనే హామీని ఇచ్చింది.  అయితే, రాష్ట్రంలో  కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరువాత పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలను పరిష్కరించడానికి సానుకూలంగా స్పందిస్తున్నా నిబంధనల పేరుతో అధికారులు సమస్యను పరిష్కరించడానికి అడ్డుపడుతుండటంతో పార్ట్ టైం అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారు. 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్య కంటే  పార్ట్ టైం అధ్యాపకుల సమస్య జటిలమైనది కాదు.  కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందజేసింది. దశాబ్దాలుగా శ్రమదోపిడికి గురవుతున్న పార్ట్ టైం అధ్యాపకులను ఆదుకోవడం అవకాశాలు ఇవ్వటం కాంగ్రెస్​ ప్రభుత్వానికి పెద్ద కష్టమేమీ కాదు.  ప్రతి సమస్య పట్ల తక్షణం స్పందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పార్ట్ టైం అధ్యాపకుల సమస్యల పట్ల కూడా తక్షణం స్పందిస్తారని ఆశిద్దాం.  

కష్టాల కడలిలో..

విశ్వవిద్యాలయాలలో  పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల కష్టాలు, బాధలు, సమస్యలు చెబితే కథ అవుతుంది. రాస్తే కావ్యమవుతుంది.  ఉన్నత విద్యావంతులై అన్ని అర్హతలు కలిగి ఉన్నా.. చేసేది మాత్రం పార్ట్ టైం అధ్యాపక వృత్తి. వచ్చేది మాత్రం చాలా తక్కువ వేతనం. అది కూడా ప్రతి నెల రాదు. ఉద్యోగం పార్ట్ టైం అయినా ఫుల్ వర్క్ లోడ్ తో పని చేయాలి.  ఒక అకడమిక్ ఇయర్ లో కేవలం 180 రోజులకు మాత్రమే వేతనం పొందే స్థితి.  చాలీచాలని వేతనాలతో,  ఖాళీలు ఉన్నా రాని అవకాశాలు,  వయసు మీద పడుతున్న ఆందోళన, కుటుంబాలను పోషించలేని నిస్సహాయత, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వలేక పోతున్నామనే నిరాశతో పార్ట్ టైం అధ్యాపకులు  జీవితాలను వెళ్లదీస్తున్నారు. కన్నీళ్లను కనుపాపలు దాటి రానివ్వకుండా కష్టాలు కనపడకుండా వేలాదిమంది విద్యార్థులకు అత్యుత్తమమైన విద్యను అందిస్తున్నారు. విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులు చేసేది పార్ట్ టైం ఉద్యోగం. కానీ, వేతనం పీరియడ్ కి మాత్రమే (వర్కింగ్ అవర్). విద్యాబోధనతో పాటు పరీక్షల మూల్యాంకనం లాంటి అనేక రకాల పనులు చేస్తూ శ్రమ దోపిడీకి గురవుతున్నారు. 

- డాక్టర్ తిరునహరి శేషు,
పార్ట్ టైం అధ్యాపకుల సంఘం సలహాదారుడు,
కాకతీయ యూనివర్సిటీ