ప్లానింగ్ లోపం.. ప్రజలకు శాపం..​!

  • నేషనల్ హైవే--563 నిర్మాణంలో డిజైనింగ్ లోపాలు
  • గ్రామాలున్న చోట అండర్ పాస్, అప్రోచ్ రోడ్లు లేక ఇబ్బందులు
  • గ్రామాలు, పొలాలు రెండు ముక్కలై జనాలకు అవస్థలు
  • పట్టించుకోని ఆఫీసర్లు, పాలకులు

హనుమకొండ/ ఎల్కతుర్తి, వెలుగు: జగిత్యాల నుంచి వరంగల్ వరకు నిర్మిస్తున్న నేషనల్ హైవే-563 ఫోర్ లైన్ డిజైనింగ్ లోపం ప్రజలకు శాపంగా మారింది. హైవే వెంట ఉన్న గ్రామాలను దృష్టిలో పెట్టుకోకుండా రోడ్డు నిర్మాణం చేపట్టడం, ఊళ్లున్న చోట కూడా అప్రోచ్ రోడ్లో, అండర్ పాస్ బ్రిడ్జిలో ఏర్పాటు చేయకపోవడంతో చాలాచోట్ల గ్రామాలు రెండు ముక్కలయ్యాయి. సర్వీస్ రోడ్లను కూడా విస్మరించడంతోపాటు అటువైపు వెళ్లే ప్రజలు, వాహనాలు కిలోమీటర్ల దూరం ప్రయాణించి యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

 భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో ఇప్పటికే ఎల్కతుర్తి మండలంలోని వల్లభాపూర్, వీరనారాయణపూర్, దండేపల్లి గ్రామాల ప్రజలు మూడు నెలలుగా ఉద్యమం చేస్తుండగా, మరికొన్ని గ్రామాల ప్రజలు పోరాటానికి సిద్ధమవుతున్నారు. 

ఊళ్లను పట్టించుకోకుండానే నిర్మాణం..

నేషనల్ హైవే-563లోని జగిత్యాల నుంచి కరీంనగర్ మీదుగా వరంగల్ వరకున్న దాదాపు 127 కిలోమీటర్ల రహదారిని ఫోర్ లైన్ గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఇందులో కరీంనగర్​-వరంగల్ సెక్షన్ లోని 68 కిలోమీటర్ల జాతీయ రహదారి పనులకు సుమారు రూ.2,147 కోట్లతో శ్రీకారం చుట్టింది. దిలీప్ బిల్డ్​కాన్ లిమిటెడ్ అనే సంస్థ నిర్మాణ పనులు దక్కించుకోగా, 2025 వరకు వర్క్స్ కంప్లీట్ చేసేందుకు టార్గెట్ నిర్దేశించారు.

నిర్మాణ పనుల్లో భాగంగా కరీంనగర్​-వరంగల్ సెక్షన్ లో మానకొండూరు, తాడికల్, హుజూరాబాద్, ఎల్కతుర్తి, హసన్​పర్తి.. ఇలా ఐదు చోట్ల బైపాస్​లు, 9 మేజర్​ బ్రిడ్జిలు, 20 మైనర్​ బ్రిడ్జిలు, రెండు ఆర్వోబీలు, మరో 28 చోట్ల వివిధ అండర్ పాస్ లు నిర్మించాల్సి ఉంది. 

కానీ, కొన్ని గ్రామాల మధ్య నుంచి రోడ్డు అలైన్ మెంట్ ఉండగా,  ఆఫీసర్లు ఆయా ఊళ్ల గురించి కనీస ఆలోచన లేకుండా వ్యవహరించారనే విమర్శలున్నాయి. అండర్​పాస్​లు, అప్రోచ్​రోడ్లు లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు మూడు కిలోమీటర్లు దూరం వెళ్లి యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 

అస్తవ్యస్థ పనులతో మరిన్ని తిప్పలు..

నేషనల్ హైవే ఫోర్ లైన్ నిర్మాణానికి ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధి డీబీఎం 12 నుంచి నీళ్లు వెళ్లే కాల్వను పూడ్చేశారు. దీంతో ఆ కాల్వ ఆయకట్టు సుమారు వంద ఎకరాలకు నీళ్లందే పరిస్థితి లేకుండాపోయింది. హసన్​పర్తి మండలంలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలిసింది. 

ఎల్కతుర్తి మండలం సూరారం శివారు గుడిబండపల్లి ఓదెలకుంట మత్తడి మధ్య నుంచి హైవే నిర్మిస్తుండటంతో నీటి ప్రవాహానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రైతుల కోరుతున్నా పట్టించుకునే నాథులే కరువయ్యారు. గుడిబండపల్లి ఓదెలకుంటకు చెలకల నుంచి నీళ్లు వెళ్లే నాలాను చిన్నదిగా నిర్మించడంతో వర్షాలు కురిసినప్పుడల్లా రోడ్డుపైనే నీళ్లు నిలిచి వాహనాలు నీటమునుగుతున్నాయి.

ఎల్కతుర్తి నాగుల చెరువు నుంచి వచ్చే వరద పొలాల ద్వారా కిందికి వెళ్లేది. ఆ ప్రాంతంలో కాకుండా, ఎత్తు ప్రాంతంలో కల్వర్టు నిర్మించడంతో పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇలా ఆఫీసర్లు క్షేత్రస్థాయి పరిస్థితులపై సరైన స్టడీ చేయకుండానే అలైన్​మెంట్ ఇవ్వడంతో సమస్యలు ఏర్పడుతుండగా, పనులు పూర్తికాకముందే తమ సమస్యలకు పరిష్కారం చూపాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన నల్లాల సుదర్శన్ రెడ్డికి ఎన్​హెచ్​-563 వెంట నాలుగెకరాల భూమి ఉంది. కొత్తగా నిర్మిస్తున్న ఈ హైవే ఫోర్ లైన్ రోడ్డు ఈ రైతు భూమిలో నుంచే వెళ్లగా, రోడ్డుకు ఒకవైపు 2.01 ఎకరాలు, మరోవైపు 25 గుంటల పొలం మిగిలింది. దీంతో అటువైపు ఉన్న పొలానికి వెళ్లి పనులు చేసుకోవాలంటే దారి లేకుండా పోయింది.

పక్కనే ఉన్న వల్లభాపూర్ లో కూడా అండర్ పాస్ లేకపోవడంతో దాదాపు మూడు కిలోమీటర్లు తిరిగి అవతలి వైపున్న పొలాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇది కేవలం ఒక్క రైతు సమస్య కాదు, హైవే వెంట ఉన్న వేలాది మంది అన్నదాతలది. గ్రామాలున్న చోట కనీసం అప్రోచ్ రోడ్లకు కూడా అవకాశం లేకుండా రోడ్డు నిర్మిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

ఎన్​హెచ్–563పై హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్లభాపూర్ గ్రామమిది. గ్రామం మధ్య నుంచి ఎన్ హెచ్​-563 పాత రోడ్డు ఉండగా, రాకపోకలు బాగానే సాగి ఊరంతా ఒక్కటిగానే కనిపించేది. ఇప్పుడు ఆ హైవే ఫోర్ లైన్ పనులు చేపట్టి దాదాపు 20 ఫీట్ల ఎత్తు నుంచి కొత్తగా రోడ్డేస్తున్నారు.

రోడ్డుకు రెండు వైపులా ఊరే ఉన్నా, ఇక్కడ అండర్ పాస్ లేకపోవడంతో గ్రామం రెండు ముక్కలైంది. ఇటు నుంచి అటు వెళ్లాలంటే దాదాపు మూడు, నాలుగు కిలోమీటర్లు వెళ్లి యూటర్న్ తీసుకునే పరిస్థితి. దీంతోనే వల్లభాపూర్, వీరనారాయణపూర్, దండేపల్లి తదితర గ్రామాలకు చెందిన ప్రజలు మూడు నెలలుగా అండర్ పాస్ కోసం ఉద్యమిస్తుండగా, కోతులనడుమ గ్రామస్తులు కూడా పోరాటానికి సిద్ధమవుతున్నారు.