రైతు రుణమాఫీపై బీఆర్ఎస్​ మాట్లాడటం సిగ్గుచేటు : మల్లు భట్టి విక్రమార్క

  • కేటీఆర్, హరీశ్​తీరుపై డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహం 
  • ఎర్రపాలెం మండల పరిధిలో రూ.55.8కోట్లతో రోడ్ల పనులకు శంకుస్థాపన
  • మధిర నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని హామీ 
  • జమలాపురం పర్యాటక ప్రాంతంగా డెవలప్​ చేస్తామని భరోసా  

ఎర్రుపాలెం, వెలుగు : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రుణమాఫీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్​రావు మాట్లాడటం సిగ్గుచేటు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రుపాలెం మండల పరిధిలో ఎర్రుపాలెం నుంచిపెగళ్లపాడు, జమలాపురం నుంచి రాజుపాలెం, జమలాపురం నుంచి చండ్రగూడెం, కొత్తపాలెం నుంచి గట్లగౌరారం, మీనవోలు నుంచి బనిగండ్లపాడు, సత్యనారాయణపురం నుంచి ఇంటర్ లింకింగ్  రోడ్లకు రూ.55.8 కోట్లతో బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు.  

అనంతరం ఏర్పాటు చేసిన జమలాపురం సభలో ఆయన మాట్లాడారు. పదేళ్లలో రైతు రుణమాఫీ చేయడానికి ముక్కి ముక్కి నాలుగు దఫాలుగా చేసినా సరిగా రుణాలు మాఫీ చేయలేని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు రుణమాఫీపై మాట్లాడడం సరికాదన్నారు. తాము అధికారం చేపట్టి ఏడాది గడవకుండానే ఏకకాలంలో రైతుకు రూ.2 లక్షలు రుణమాఫీ చేశామని చెప్పారు.

 రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీని భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాలని, రుణమాఫీ పూర్తి చేసి రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రను తిరగరాసిందన్నారు. రాష్ట్ర బడ్జెట్​లో రూ.72 వేల కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించే అవకాశం ఆర్థికమంత్రిగా తనకు దక్కడం గర్వకారణంగా ఉందని చెప్పారు. మధిర ప్రాంత రైతుల సాగునీటి కోసం కట్టలేరు ప్రాజెక్టును స్థిరీకరిస్తామన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద జోన్ 3 గా ఉన్న మధిర, ఎర్రుపాలెం మండలాలను జోన్2 గా మార్చేందుకు రూ.500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 

గత ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను పట్టించుకోకపోయినా తమ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఈ ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలను అందించనుందని తెలిపారు. నిముషం కూడా వృథా కాకుండా ఉపయోగించుకొని పదేళ్లలో వెనుకబడిన రాష్ట్రాన్ని గాడిలోపెట్టి ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ, ఆర్ అండ్ ​బీ ఆఫీసర్లు, కాంగ్రెస్ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.