గురుకులాలను సెట్ చేస్తం : డిప్యూటీ సీఎం భట్టి

  • గత సర్కార్ నిర్లక్ష్యంతోనే గురుకులాల్లో విషాద ఘటనలు
  • విద్యార్థులకు మెరుగైన సౌలతులు కల్పిస్తం
  • స్టూడెంట్లకు హెల్త్ కార్డ్.. ప్రతినెలా డాక్టర్లతో చెకప్ 
  • ప్రతి స్కూల్​లో కుక్కకాటు, పాముకాటు మందులు అందుబాటులో ఉంచుతం 
  • గురుకులాలకు పక్కా భవనాల నిర్మాణం 
  • త్వరలో డైట్ చార్జీలు పెంచుతామని వెల్లడి 
  • జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ గురుకులాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం 
  • వసతుల కల్పనకు రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటన 
  • చనిపోయిన విద్యార్థుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఔట్​సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని హామీ 

మెట్​పల్లి, వెలుగు: రాష్ట్రంలోని గురుకులాలన్నింటినీ ప్రక్షాళన చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విద్యార్థులకు మెరుగైన సౌలతులు కల్పిస్తామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాలకు పక్కా భవనాల కోసం ఫండ్స్​ఇవ్వకపోవడం, మౌలిక వసతులు కల్పించకపోవడంతోనే గురుకులాల్లో విషాద ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలను డిప్యూటీ సీఎం భట్టి సందర్శించారు. 

ఈ గురుకులంలో ఇటీవల ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పదంగా చనిపోగా, మరో నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి భట్టి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చనిపోయిన విద్యార్థులు గణాదిత్య, అనిరుధ్ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. 
బాధిత కుటుంబాలను ఆదుకుంటం.. పెద్దాపూర్ లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని భట్టి చెప్పారు. 

‘‘గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించేందుకు బడ్జెట్ లో రూ.5 వేల కోట్లు కేటాయించాం. గురుకులాల్లో మెరుగైన వసతులు కల్పించి విద్యార్థులను కాపాడుకుంటాం. విద్యార్థులు పాముకాటు, కుక్కకాటుకు గురయ్యే  ప్రమాదం ఉన్నందున.. ప్రతి గురుకుల పాఠశాలలో యాంటీ వీనమ్, యాంటీ రేబిస్​వాక్సిన్​​తో పాటు అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుతాం. గతంలో కాంగ్రెస్ పాలనలో హాస్టల్స్ లో చదివే విద్యార్థులకు హెల్త్ కార్డ్స్ ఉండేవి. ప్రతి నెల డాక్టర్లు వచ్చి విద్యార్థులకు చెక్ చేసి, ఆరోగ్య వివరాలను ఆ కార్డులో  నమోదు చేసేవారు. 

ప్రతి హాస్టల్​లో పారా మెడికల్ స్టాఫ్ ఉండేవారు. మళ్లీ ఆ విధానాన్ని తీసుకొస్తాం” అని భట్టి ప్రకటించారు. చనిపోయిన స్టూడెంట్ల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారంతో పాటు ప్రతి కుటుంబంలో ఒకరికి  గురుకుల సొసైటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ఇల్లు లేకుంటే, ఇందిరమ్మ స్కీమ్​లో భాగంగా రూ.5 లక్షలు కూడా ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నెలలో ఒకరోజు విద్యార్థులతో కలిసి

భోజనం చేయాలి.. 

బీఆర్ఎస్​ హయాంలో గత ఆరేండ్లలో గురుకులాల్లో వసతుల కల్పన కోసం రూ.179 కోట్లు మాత్రమే కేటాయించారని భట్టి చెప్పారు. ‘‘12 ఎకరాల్లో ఉన్న పెద్దాపూర్ గురుకులంలో భవనాల నిర్మాణం కోసం 2020–--21లో నిధులు మంజూరు చేసినా, పైసా విడుదల చేయలేదు. ఫండ్స్​లేక కాంట్రాక్టర్ కొత్త బిల్డింగ్ నిర్మాణ పనులను అర్ధాంతరంగా ఆపేశాడు. ఇలా అసంపూర్తిగా ఉన్న భవనాలను వెంటనే పూర్తి చేస్తాం. 

ఇందుకు అవసరమైన ఫండ్స్​రిలీజ్​చేస్తాం” అని తెలిపారు. ఈ గురుకులం మొత్తం శుభ్రం చేయడానికి, టాయిలెట్స్, ఇతర సౌకర్యాల కోసం రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా డార్మిటరీ, డైనింగ్ హాల్స్, భవన నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించిన వెంటనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మించాలని కలెక్టర్​ను ఆదేశించారు. 

‘‘మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెలలో ఒకరోజు తమ పరిధిలోని గురుకుల పాఠశాలను సందర్శించి.. విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని కేబినెట్ మీటింగ్ లో  నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు కూడా నెలలో ఒకరోజు గురుకుల పాఠశాల్లో  భోజనం చేసి.. విద్యార్థుల  సమస్యలను అక్కడికక్కడే  పరిష్కరించాలి” అని సూచించారు. 

డైట్ చార్జీల పెంపుపై కమిటీ.. 

పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా డైట్ చార్జీలు పెంచాల్సి ఉందని, దీనిపై త్వరలోనే అధికారులతో కమిటీ వేస్తామని భట్టి తెలిపారు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా డైట్ చార్జీలు పెంచుతామని చెప్పారు. ‘‘గురుకుల పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి మంచం, బెడ్, బెడ్ షీట్ ను ప్రభుత్వ సమకూర్చుతుంది. ఇందుకోసం ప్రతిపాదనలు పంపితే నిధులు విడుదల చేస్తాం. 

ప్రతి గురుకులంలో అత్యవసర ఔషధాలు, పారా మెడికల్ స్టాఫ్, కుక్కకాటు, పాముకాటుకు సంబంధించిన మందులను అందుబాటులో ఉండే విధంగా చూడాలి. శుభ్రత పాటిస్తూ నాణ్యమైన ఆహారాన్ని అందించాలి. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు సరిపడా టాయిలెట్స్, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలు ఉండే విధంగా చూసుకోవాలి” అని గురుకులాల సెక్రటరీని ఆదేశించారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా గురుకుల పాఠశాలల్లో చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు తొలగించి.. పండ్లు, ఔషధ మొక్కలు నాటించాలని సూచించారు. 

గురుకులాల్లో పనిచేసే వార్డెన్స్, టీచర్స్, పారామెడికల్ సిబ్బంది రాత్రి సమయాల్లో విద్యార్థులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ లు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సత్యం, సంజయ్, కాంగ్రెస్ నేత జువ్వాడి నర్సింగరావు, కలెక్టర్ సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.