ప్రజాప్రతినిధుల పెండింగ్ బిల్లులు త్వరలో విడుదల

  • డిప్యూటీ సీఎం భట్టి  

ఖమ్మం, వెలుగు: రూ.10 లక్షల లోపు పెండింగ్ లో ఉన్న ప్రజాప్రతినిధుల బిల్లులు త్వరలో విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీల లాంటి ప్రజాప్రతినిధులు గతేడాది డిసెంబర్ 7 నాటికి చేసిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు సుమారు రూ.1,300 కోట్ల వరకు ఉన్నాయని తెలిపారు. ఇందులో రూ.10 లక్షలు లోపు బకాయిల విలువ సుమారు రూ.400 కోట్ల వరకు ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. 

సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పడుతున్న ఇబ్బందులను సీఎం రేవంత్ రెడ్డితో పాటు తాను గమనించి రూ.10 లక్షల లోపు బకాయిలను త్వరలో విడుదల చేయాలని ఆలోచన చేస్తున్నట్టు వెల్లడించారు. గత ప్రభుత్వ పెద్దలు స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులతో పనులు చేయించి బిల్లులు పెండింగ్ లో పెట్టారని, వారిని వీధులపాలు చేశారని విమర్శించారు.

ప్రజాప్రతినిధుల ఇబ్బందులకు కారణమైన బీఆర్ఎస్ నేతలు పెండింగ్ బిల్లుల కోసం రోడ్లపైకి వస్తాం, ధర్నాలు చేస్తామని ప్రకటనలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధుల పెండింగ్ బిల్లుల గురించి బీఆర్ఎస్ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అన్నారు.