ప్రభుత్వాన్నికూల్చేందుకు బీఆర్ఎస్ కుట్ర : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • అధికారం కోసం ప్రజలను రెచ్చగొట్టుడే బీఆర్​ఎస్​ పని
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్
  • ఎట్ల కూల్చాలి, కుర్చీలో ఎట్ల కూర్చోవాలన్నదే కేసీఆర్​, కేటీఆర్​ ఆలోచన
  • ప్రతిపక్ష పాత్ర పోషించరు.. ప్రజలకు సేవ చేయరు
  • సిటీకి దూరంగా ఫార్మా కస్టర్లు విస్తరించాలని నాడు ప్రతిపక్షంగా కోరినం
  • అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే దీని ఉద్దేశమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్​ఎస్​ కుట్రలు చేస్తున్నదని, అధికారం కోసం అమాయక ప్రజలను రెచ్చగొట్టడమే బీఆర్​ఎస్​ నేతల పని అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్​ అయ్యారు. “ఎంత సేపటికీ  ప్రభుత్వాన్ని ఎట్ల కూల్చాలి.. కుర్చీలో ఎట్ల కూర్చోవాలన్న కుట్రలు తప్ప.. ప్రజలకు ఏదైనా చేయాలనే ఆలోచన ఎప్పుడైనా వారికి వచ్చిందా..?” అని కేసీఆర్, కేటీఆర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెహ్రూ జయంతి సందర్భంగా గురువారం గాంధీభవన్​లో పీసీసీ చీఫ్ మహేశ్​గౌడ్​తో కలిసి నెహ్రూ చిత్ర పటానికి భట్టి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్​ అని, ప్రతిపక్ష పార్టీలను కూడా గౌరవించే పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. ‘‘ప్రతిపక్ష నేతగా మీ పాత్రను పోషించాలి కదా..? ప్రతిపక్ష నేత హోదాలో  ఏదైనా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారా..?” అని కేసీఆర్​ను ప్రశ్నించారు.ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున ఏవైనా పిటిషన్లను తీసుకొని సెక్రటేరియెట్​కు  రావాలని, ఆ పనిచేయకుండా ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. తాము  కక్షపూరిత రాజకీయాలకు వ్యతిరేకమని ఆయన చెప్పారు. 

అభివృద్ధి అంతా ఒకే చోట ఉంటే ఎట్ల?

ఫార్మా క్లస్టర్ల విస్తరణను బీఆర్ఎస్ వ్యతిరేకించడం బుద్ధి తక్కువ పని భట్టి అన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే.. హైదరాబాద్ చుట్టు పక్కల ఫార్మా కంపెనీలు విస్తరిస్తే కాలుష్యంతో నగర ప్రజలు అల్లకల్లోలమవుతారని నాటి ప్రభుత్వానికి గుర్తు చేశామని ఆయన తెలిపారు. ఫార్మా కంపెనీలను హైదరాబాద్ చుట్టు పక్కల కాకుండా సిటీకి దూరంగా ఏర్పాటు చేస్తే సిటీకి సమాంతరంగా ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయనేది తమ ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. 

అధికార వికేంద్రీకరణను తాము కోరుకుంటున్నామని, అభివృద్ధి అంతా ఒకే చోట ఉంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. అందుకే తాము అధికారంలోకి రాగానే ఫార్మా క్లస్టర్లను విస్తరించే పనిలో ఉన్నామని, అందులో భాగంగానే లగచర్లలో ఒకటి ఏర్పాటు చేయాలని అనుకున్నామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చింది.. మీరు చెప్పినట్లు చేయడానికి కాదు కదా అని బీఆర్​ఎస్​పై మండిపడ్డారు. ప్రజల కోసం తాము పనిచేస్తామని అన్నారు.  

ఇచ్చిన హామీలు నెరవేర్చుడు వైఫల్యమా?

ప్రభుత్వం విఫలమైందంటూ కేటీఆర్​ ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారని భట్టి విక్రమార్క అన్నారు. ‘‘ప్రభుత్వ వైఫల్యం అంటే ఏమిటో కేటీఆర్​ చెప్పాలి. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్  ప్రకటించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడమే ప్రభుత్వ వైఫల్యమా? రూ. 5 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి, పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం ప్రభుత్వ వైఫల్యమా? దేశ చరిత్రలోనే ఎప్పుడు, ఎవరూ చేయని రీతిలో కేవలం 15 రోజుల్లో  రూ.18 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేయడం ప్రభుత్వ వైఫల్యమా?” అని నిలదీశారు.

 ‘‘నీలాగా లక్ష రూపాయల రుణమాఫీని నాలుగు విడతలుగా ఇస్తానని చెప్పం. అది కూడా మొదటి ఐదేండ్లు మాత్రమే ఇచ్చి, ఆ తర్వాతి ఐదేండ్లు ఇవ్వనే లేదు కాదా? అలా మేం చేయలేదు. ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేసినం” అని ఆయన తెలిపారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ. 10 వేలు ఇస్తామని గత ప్రభుత్వం చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, అలాంటి బీఆర్​ఎస్​ పార్టీ  ఇప్పుడు ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. మా ప్రభుత్వం రాగానే పంట నష్టం వెంటనే చెల్లించామని భట్టి చెప్పారు. ‘‘మీరు రైతుల పంటకు ఇన్సూరెన్స్ చేయకుండా వారికి నష్టం కలిగిస్తే.. మేం అధికారంలోకి రాగానే వెంటనే క్రాప్ ఇన్సూరెన్స్ చేయించాం.  సింగరేణి కార్మికులకు రూ. ఒక కోటి ఇన్సూరెన్స్ చేయించం. ప్రజల కోసం పనిచేయడం ప్రభుత్వ వైఫల్యమా?” అని కేటీఆర్​పై మండిపడ్డారు.  

మోదీ గనుక మొదటి ప్రధానిగా ఉంటే దేశం ఎక్కడో వెనుకబడేది 

‘‘సైంటిఫిక్ అవగాహన లేని, మూఢవిశ్వాసాలతో బతికే మోదీ వంటి వారు మన దేశానికి మొదటి ప్రధానిగా ఉండి ఉంటే ఈ దేశం మూఢవిశ్వాసాలతో ఎక్కడో వెనుకబడి ఉండేది” అని భట్టి అన్నారు. నాడు ప్రధానిగా నెహ్రూ వేసిన పునాదుల ఫలాలు నేడు మనమందరం అనుభవిస్తున్నామని చెప్పారు. ‘‘నెహ్రూ ఈ దేశపు తొలి ప్రధాని కావడం మన అందరి అదృష్టం. 

ఈ దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్లు పెద్ద ఎత్తున నెలకొల్పడంతోనే అభివృద్ధి జరుగుతున్నది. చంద్రమండలం, మార్స్ పైకి రకరకాల శాటిలైట్స్ పంపి సమాచార వ్యవస్థలో పోటీకి కారణం నాటి నెహ్రూ నిర్ణయాలే. విద్యా విధానం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు ప్రభుత్వ రంగంలోనే ఉండాలన్న ఆలోచన నెహ్రు నిర్ణయమే” అని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు. 

పేదలకు స్కీమ్స్​పెంచేందుకే కులగణన

రాష్ట్రంలోని పేద ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలను పెంచేందుకే సమగ్ర కులగణన సర్వే చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ‘‘కుల గణన చేస్తామని మాట ఇచ్చాం.. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటను ఆచరించి చూపిస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధికి కులగణన ఎంతగానో ఉపయోగపడుతుంది. కులగణనతో దేశానికి  తెలంగాణ రోల్ మోడల్ గా నిలుస్తుంది” అని ఆయన తెలిపారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొనే కులగణన  ప్రశ్నలను తయారు చేశామని, కులగణన అనేది ఒక విప్లవాత్మకమైన నిర్ణయమని పేర్కొన్నారు.  

రాజ్యాధికారం కావాల్సినప్పుడల్లా పేద, అమాయక ప్రజలను రెచ్చగొట్టి, వారి భవిష్యత్తును ఫణంగా పెట్టడం బీఆర్​ఎస్​ నైజం. కేటీఆర్ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. ప్రభుత్వ వైఫల్యం అంటే ఏమిటో ఆయన చెప్పాలి? ప్రజలకు మంచి చేయడమే మా ప్రజా ప్రభుత్వ వైఫల్యమా?

భట్టి విక్రమార్క