పార్టీల ఆఫీసులపై దాడులు హేయం .. ప్రియాంకపై వ్యాఖ్యలకు బీజేపీ క్షమాపణ చెప్పాలి: డిప్యూటీ సీఎం భట్టి

ఎర్రుపాలెం, వెలుగు: పార్టీల ఆఫీసులపై దాడులు హేయమైన చర్యని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం హైదరాబాద్ లో  బీజేపీ ఆఫీసు, గాంధీభవన్ పై జరిగిన దాడులను ఉపేక్షించబోమని అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఎవరు ఎవరిపై దాడులు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. బీజేపీ నేతలు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారన్నారు. ఎంపీ ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని, బీజేపీ జాతీయ నాయకత్వం దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 దేశం కోసం ప్రాణాలిచ్చిన ఇందిర, రాజీవ్ గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక పై అనుచిత వ్యాఖ్యలను దేశంపై ప్రేమ, అభిమానం, స్త్రీల పై గౌరవం ఉన్నవారెవరూ జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. ఆ ఆవేశంతో కొంతమంది యువజన కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీసుపై  దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. రమేశ్ బిదూరీని వెంటనే బీజేపీ నుంచి సస్పెండ్ చేయాల్సిందని భట్టీ పేర్కొన్నారు.