బజార్​హత్నూర్ మండలంలో .. పిప్పిరికి భట్టి విక్రమార్క భరోసా..

  • రూ.20.03 కోట్లతో అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన
  • రూ.45 కోట్లతో పిప్పిరి లిఫ్ట్ ఇరిగేషన్
  • ఆదర్శ గ్రామంగా మారుస్తామని హామీ
  • పెద్దఎత్తున తరలివచ్చిన రైతులు, మహిళలు

బజార్​హత్నూర్, వెలుగు :బజార్​హత్నూర్ మండలంలోని పిప్పిరిని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. తాను పీపుల్స్ మార్చ్ ప్రారంభించిన ఈ నేలను అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నానన్నారు. గ్రామానికి కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ వరాల జల్లు కురిపించారు. బజార్​హత్నూర్​ మండలం పిప్పిరి గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ.20.5 కోట్ల అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు.

 ఎస్టీఎస్డీఎఫ్ నిధులు రూ.15 కోట్లతో రోడ్లు, రూ.2 కోట్లతో నేరడిగొండ మండలంలోని వాంకిడి విద్యుత్ సబ్ స్టేషన్, పిప్పిరి గ్రామావృద్ధికి రూ.3.5 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టారు.  వీటితో పాటు రూ. 45 కోట్లతో పిప్పిరి లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేస్తామని, నేరడిగొండ మండలంలోని తేజాపూర్, బుగ్గారం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ గ్రామ ప్రజల ఆశీర్వాదంతోనే తాను డిప్యూటీ సీఎంను అయ్యానని, పాదయాత్రలో తనతో నడిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. సభకు పెద్ద ఎత్తున మహిళలు, రైతులు హాజరయ్యారు. 

మహిళా స్టాళ్ల సందర్శన 

సభాస్థలం వద్ద ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్​ను డిప్యూటీ సీఎం సందర్శించి మార్కెటింగ్, వస్తువుల ఉత్పత్తి గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. వెదురు వస్తువులు, జూట్ బ్యాగ్, ఇత్తడి వస్తువులు, గృహ అలంకరణ వస్తువులు, అగర్​బత్తుల తయారీతోపాటు, న్యాచురల్ తేనె ఉత్పత్తి, సేంద్రీయ చిరు ధాన్యాల ఉత్పత్తి గురించి అడిగి తెలుసుకున్నారు.

 ఇంటింటా ఇన్నోవెటల్ ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్​ను సందర్శించి విద్యార్థులు తయారు చేసిన ఆవిష్కరణలను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపొందించిన గర్ల్ సేఫ్టీ డివైజ్, ఆటోమేటిక్ కార్ రిజర్వ్ పార్కింగ్, ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ డివైస్ హౌస్, రైన్ వాటర్ హార్వె స్టింగ్, అగ్ని ప్రమాదాల నివారణ, ఏసీ బస్ ఫైర్ అలర్ట్, సంప్రదాయ విద్యుత్ తయారీ విధానం గురించి విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలను మెచ్చుకున్నారు. సభలో ఎస్సీ కార్పొరేష‌న్‌, ట్రైకార్‌, ఐటీడీఏల ద్వారా మంజూరైన బ్యాంకు లింకేజీ చెక్కుల‌ను మహిళలకు పంపిణీ చేశారు.  

సమస్యలు పరిష్కరించండి

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. అడేగాం, పిప్పిరి మధ్య రోడ్డు పూర్తిగా పాడైపోయిందని, రోడ్డుకు భూ సేకరణ చేపట్టి రిపేర్లు చేయాలన్నారు. సీసీ రోడ్లు, డ్రైన్లు,సెంట్రల్ లైటింగ్ కోసం రూ.5 కోట్లు మంజూరు చేయాలని కోరారు. బజార్ హత్నుర్ మండలంలోని మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామాలకు రోడ్ల సదుపాయం కల్పించాలన్నారు. మొర్కండి నుంచి బరంపూర్​కు మంజూరైన రోడ్డుకు అటవీ శాఖ అనుమతులు లేక పనులు ఆగిపోయాయని, చొరవ తీసుకోని సమస్య పరిష్కరించాలన్నారు. 

బోథ్ మండల కేంద్రాన్ని రెవిన్యూ డివిజన్​గా ఏర్పాటు చేయాలని  కోరారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి పిప్పిరిని  దత్తత తీసుకోవడం సంతోషకరమన్నారు. ఖానాపూర్​లో పోడు పట్టాల సమస్యలు పరిష్కరించాలని, మారుమూల గ్రామాలకు రోడ్డు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఉట్నూర్ ఎక్స్ రోడ్డు నుంచి ఆసిఫా బాద్ వరకు,  గుడిహత్నూర్ నుంచి మంచిర్యాల వరకు ఫోర్ లైన్ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు.

భట్టికి స్వాగతం పలికిన కలెక్టర్, ఎమ్మెల్యేలు

భ‌ట్టి విక్రమార్క మధ్యాహ్నం 12.15 గంటలకు  పిప్పిరికి చేరుకున్నారు. ఆయన వెంట మాజీ ఎంపీ మధు యాష్కీ ఉన్నారు. వారికి కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు బొజ్జు పటేల్, ప్రేమ్​సాగర్​రావు, పాయల్ శంకర్, అనిల్ జాదవ్, కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక్ తిరుపతి, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ కుష్బూ గుప్తా తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. బొకేలు అందజేశారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం చేశారు.