ఏ మొఖం పెట్టుకుని ప్రజల్లోకి వస్తవ్ కేసీఆర్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • కేసీఆర్​పై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్
  • రుణమాఫీ గాలికొదిలేసినందుకే.. గాలికి కొట్టుకుపోయారు 
  • బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులకు టైమ్​కు జీతాలు కూడా ఇయ్యలే
  • జీతాలిస్తూనే రుణమాఫీ చేసిన ఘనత మాది 
  • తెలంగాణను విద్యుత్ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దుతం 
  • కరెంట్ కొనడం కాదు.. ఇతర రాష్ట్రాలకు అమ్ముతం
  • రామగుండంలో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటన 
  • హామీలన్నీ నెరవేరుస్తున్నం: శ్రీధర్ బాబు, పొన్నం    
  • పవర్ ప్లాంట్​తో 2 వేల మందికి ఉపాధి: గడ్డం వంశీకృష్ణ  

గోదావరిఖని, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తుంటే.. హామీలపై ప్రశ్నించడానికి ప్రజల్లోకి వెళతానంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కార్యాచరణ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘‘రెండు సార్లు అధికారంలో ఉన్న మీరు రుణమాఫీ చేస్తామంటూ రెండు సార్లూ రైతులను గాలికి వదిలేశారు. అందుకే మీ పార్టీ గాలికి కొట్టుకుపోయింది. మేం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రూ.2 లక్షల రుణమాఫీ కోసం బ్యాంకుల్లో రూ. 18 వేల కోట్లు జమ చేశాం. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకుని ప్రజల్లోకి వస్తావ్?” అని ఆయన ఫైర్ అయ్యారు. 

శనివారం రామగుండం నియోజకవర్గంలో మంత్రులు డి.శ్రీధర్​బాబు, పొన్నం ప్రభాకర్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ టి.జీవన్​రెడ్డి, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, ఎంఎస్ రాజ్ ఠాకూర్, విజయ రమణారావు, గడ్డం వినోద్, ప్రేమ్​సాగర్​రావు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్​రావుతో కలిసి డిప్యూటీ సీఎం విస్తృతంగా పర్యటించారు. 

మొదట రామగుండంలో మూసివేసిన జెన్​కో ప్లాంట్​ను పరిశీలించారు. అనంతరం గోదావరిఖనిలో సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ల పనులు, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సింగరేణి మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్ పనులను కూడా పరిశీలించారు. 

బీఆర్ఎస్ పాలనలో చేసిందేమీ లేదు.. 

 పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని డిప్యూటీ సీఎం విమర్శించారు. శనివారం గోదావరిఖనిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘మేం మీలాగా ఇంట్లో పడుకోలేదు. ప్రతి రోజు ప్రజలను కలుస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నాం” అని కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ‘‘మీరు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదు. మేం నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తున్నాం. జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించాం. యువత, నిరుద్యోగుల ఉపాధి కోసం స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు పెడుతున్నాం. 

సింగరేణి కార్మికులకు రూ. కోటి ఇన్సూరెన్స్ కల్పించాం. ఇవన్నీ వద్దని చెప్పడానికి ప్రజల్లోకి వస్తావా?” అని ఎద్దేవా చేశారు. ఉద్యోగులకు ఫస్ట్ తారీఖున జీతాలివ్వలేని స్థితిలో వారుంటే.. ఫస్టుకే జీతాలు ఇస్తూ, రుణమాఫీ కూడా చేసిన ఘనత తమదన్నారు. ఎవరికైనా రుణమాఫీ ఆగిపోతే వ్యవసాయ అధికారులను కలవాలని, సమస్య పరిష్కారమవుతుందని సూచించారు.

కరెంట్ కొనడం కాదు.. అమ్ముతం

తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని భట్టి విక్రమార్క చెప్పారు. కరెంట్ కొనడం కాదు.. ఇతర రాష్ట్రాలకు అమ్ముతామన్నారు. రాష్ట్రంలో 2031 నాటికి గరిష్టంగా 27,059 మెగావాట్లు, 2034 నాటికి 31,809 మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్ ఉంటుందని, ఆ మేరకు అవసరమైన ప్రణాళికలు చేపడుతున్నామని తెలిపారు. థర్మల్, సోలార్, హైడల్, పంప్డ్​ స్టోరేజ్, ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసి.. తెలంగాణను విద్యుత్ సర్ ప్లస్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. రామగుండంలో మూసివేసిన జెన్ కో ప్లాంట్ స్థలంలో 800 మెగా వాట్ల సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్​ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రకటించారు. 

ఈ ప్రాజెక్టును జెన్ కో, సింగరేణి సంయుక్తంగా నిర్మిస్తాయన్నారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారమే ఆమోదం తెలిపారని వెల్లడించారు. అనంతరం 211 మహిళా సంఘాలకు రూ.23 కోట్ల 35 లక్షల 50 వేల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను డిప్యూటీ సీఎం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సింగరేణి సీఎండీ ఎన్.బలరాం, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, మినిమమ్ వేజ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ బి.జనక్​ ప్రసాద్, ఏఐటీయూసీ ప్రెసిడెంట్ వి.సీతారామయ్య, తదితరులు పాల్గొన్నారు. కాగా, రామగుండం నుంచి చెన్నూరు పర్యటనకు భట్టి వెళ్లాల్సి ఉండగా, ఆ కార్యక్రమం రద్దు చేసుకున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో భారీ వర్షాలు, వాగులు పొంగుతున్న నేపథ్యంలో పరిస్థితిని పరిశీలించేందుకు అక్కడికి బయలుదేరారు. 

రామగుండంలో పండుగ రోజు:  ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్​ 

రామగుండంలో శనివారం పండుగ రోజులా ఉందని, నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష అయిన 800 మెగావాట్ల సింగరేణి, జెన్​కో పవర్ ప్లాంట్ ఏర్పాటు కానుండటం సంతోషకరమని ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్ అన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో ఉపాధి లేక ఇక్కడి ప్రజలు వలస పోతున్నారని, నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఎమ్మెల్యే కోరిన మేరకు పాలకుర్తి లిఫ్ట్, రిజర్వాయర్​నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రామగుండంలో అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని కోరారు.  

హామీలన్నీ నెరవేరుస్తున్నం: శ్రీధర్​బాబు, పొన్నం   

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నదని మంత్రులు డి. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శనివారం గోదావరిఖనిలో జరిగిన బహిరంగసభలో వారు మాట్లాడారు. పాదయాత్రలో భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ మేరకు సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికోసం రామగుండం ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించారని మెచ్చుకున్నారు. పదేండ్లలో గోదావరిఖనిలో తెలంగాణ అమరుల స్థూపం తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. ఓపెన్ కాస్ట్ తో ఈ ప్రాంతాన్ని బొందల గడ్డగా మార్చారని ఫైర్ అయ్యారు. 

నాడు కాకా వెంకటస్వామి, శ్రీపాదరావు.. నేడు భట్టి విక్రమార్క, శ్రీధర్​బాబు ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. గోదావరిఖని బస్ డిపోకు అదనంగా 20 బస్సులు కేటాయిస్తామని, పెద్దపల్లిలో బస్ డిపో ఏర్పాటు చేస్తామన్నారు. రామగుండంలో నెల రోజుల్లోపు రూరల్​ టెక్నాలజీ సెంటర్ అనే సాఫ్ట్​వేర్​ కంపెనీ 100 మందితో ప్రారంభమవుతుందని, ఏడాదిలోగా 1000 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో కూడా ఇలాంటి కంపెనీ ఏర్పాటు కానుందని తెలిపారు. గోదావరిఖనిలో సింగరేణి ఖాళీ స్థలాన్ని సేకరించి 3,500 ఇండ్లు నిర్మించి ఇస్తామని మంత్రులు ప్రకటించారు. 

విద్యుత్ ప్లాంటుకు పూర్తి సహకారం: గడ్డం వంశీకృష్ణ 

రామగుండంలో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ నిర్మాణంతో కనీసం 2 వేల మంది స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం తన వంతుగా సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పారు. రామగుండం, గోదావరిఖనిలో జరిగిన మీటింగ్​లలో ఆయన పాల్గొని మాట్లాడారు. 

రామగుండంలో మూసివేసిన జెన్​కో ప్లాంట్ స్థానంలో సూపర్ క్రిటికల్ ప్లాంట్ ఏర్పాటు సంతోషకరమన్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నూతన రైల్వే లైన్ ఏర్పాటు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కార్యక్రమాలు చేపడతామన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేలా పథకాలు రూపొందిస్తామని తెలిపారు. సింగరేణి సంస్థను దివంగత నేత కాకా వెంకటస్వామి కాపాడారని గుర్తు చేశారు. ఈ సంస్థలో మరిన్ని ఉద్యోగాలు పెరగాలని ఆకాంక్షించారు. సింగరేణిలో పనిచేసిన చాలా మంది కార్మికులకు పెన్షన్ రివైజ్డ్ చేసి పెంచాలని, ఇది అమలు అయ్యేలా చూస్తామని చెప్పారు.