విద్యాశాఖలో అక్రమ డిప్యుటేషన్లు!

  • భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో వివాదస్పదమవుతున్న అధికారుల తీరు


భద్రాచలం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని విద్యాశాఖలో అక్రమ డిప్యుటేషన్లు వివాదస్పదంగా మారాయి.  అధికారుల తీరుపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆధారాలతో సహా ఉపాధ్యాయ సంఘాలు అధికారుల తీరును తూర్పారపడుతున్నాయి. రకరకాల ఒత్తిళ్ల వల్లే డిప్యుటేషన్లు చేయాల్సి వచ్చిందని, ఆఫీసర్లు చెబుతున్నారు. వెంటనే తప్పులు సరిదిద్దకపోతే ఆందోళనలు చేపడుతామని సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. 

ఎక్కడెక్కడ ఏ పరిస్థితి.. ఏం చేయాలి? 

ములకలపల్లి మండలం ఎంపీయూపీఎస్​ సీతాయగూడెం పాఠశాల స్కూల్ అసిస్టెంట్​(సోషల్​) వేకెన్సీని ఖాళీల లిస్టులో చూపించలేదు. కానీ డీఎస్సీ 2024 కౌన్సిలింగ్​లో స్కూల్​ అసిస్టెంట్ నియామకం చేపట్టారు. పోస్టును రద్దు చేసి వేరే పాఠశాలకు సర్దుబాటు చేయాలి.

చండ్రుగొండ మండలం యూపీఎస్​ బెండాలపాడు ఆరో తరగతిలో 27, ఏడో  తరగతిలో 11, ఎనిమిదో తరగతిలో 13 మంది పిల్లలు ఉన్నారు. గణితం, హిందీ పోస్టులను అక్కడ కేటాయించాలి.పాల్వంచ మండలం జడ్పీహెచ్​ఎస్​ బొల్లోరిగూడెంలో 600 పైగా విద్యార్థులు ఉన్నారు. ఆ పాఠశాలకు స్కూల్​అసిస్టెంట్ సోషల్ ​పోస్టు ఇవ్వాలి.

పాత కొత్తగూడెం గర్ల్స్ హైస్కూల్​ లో  254 మంది పిల్లలుండగా ఒక్కరే ఇంగ్లీష్ టీచర్​ ఉన్నారు. ఇక్కడ ఒకరికి డిప్యుటేషన్​ ఇవ్వాలి. 

ములకలపల్లి మండలం సీతాయిగూడెం ఎంపీయూపీఎస్ ​లో 46 మంది పిల్లలున్నారు. ఇద్దరు టీచర్లు పనిచేస్తున్నారు. ఆ స్కూల్​కు అవసరం లేకపోయినా డీఎస్సీ 2024 కౌన్సిలింగ్​లో ఒక ఎస్జీటీ పోస్టును అదనంగా కేటాయించారు.

జిల్లాలో డీఎస్సీ 2024 కౌన్సిలింగ్​లో స్కూల్​ అసిస్టెంట్ తెలుగు, హిందీ టీచర్లను నియమించిన సందర్భంలో పినపాక మండలం యూపీఎస్​ చేగర్శల, జడ్పీహెచ్​ఎస్​ ఏడూళ్లబయ్యారం, జడ్పీహెచ్​ఎస్​ దుమ్ముగూడెం, జడ్పీహెచ్ఎస్​ నారాయణపురంలో ఎగనెస్ట్ పోస్టులో పనిచేస్తున్న హిందీ, తెలుగు ఎల్పీ-2 ఉన్నారు. అయినా సరే ఆ పాఠశాలలకు సీనియర్​ అసిస్టెంట్ హిందీ, తెలుగు టీచర్లకు కౌన్సిలింగ్​లో కేటాయించారు. లీవ్​ పోస్టులో ఉన్న ఎల్పీలకు వేరే చోట కేటాయించాలి. రెగ్యులర్​ పోస్టులలో పాఠశాలలు కేటాయించిన స్కూల్​ అసిస్టెంట్లను కొనసాగించాలి.

లక్ష్మీదేవిపల్లి మండలంలో వేకెన్సీ లిస్టులో లక్ష్మీదేవిపల్లి ఉర్దూ పాఠశాలలో ఎస్జీటీని చూపి పీఎస్ కారుకొండ రామవరం పాఠశాలకు పోస్టింగ్​ ఇచ్చారు. ఇది కూడా ఉద్దేశపూర్వకంగా చేశారని ఉపాధ్యాయ సంఘాల లీడర్లు ఆరోపిస్తున్నారు.  

అక్టోబర్​ 30న పినపాక మండలం యూపీఎస్​ ఉప్సాకలో 14 మంది పిల్లలున్నారు. ఇక్కడి నుంచి స్కూల్​అసిస్టెంట్​(గణితం)ను యూపీఎస్ వికలాంగుల కాలనీ పాల్వంచ మండలానికి పంపారు. అశ్వాపురం మండలం యూపీఎస్​ అమ్మగారిపల్లె నుంచి స్కూల్​ అసిస్టెంట్​ (సోషల్​)ను యూపీఎస్​ గుట్టగూడెం దమ్మపేట మండలానికి డిప్యుటేషన్​ పై పంపారు. జడ్పీహెచ్​ఎస్​ అశ్వాపురంలో మొత్తం 287 మంది స్టూడెంట్లు ఉన్నారు. రెండు పోస్టులు హిందీ పండిట్లు ఇక్కడ అవసరం ఉంది. కానీ భద్రాచలం నన్నపనేని మోహన్​ ఉన్నత పాఠశాలకు డిప్యుటేషన్​ పై ఒక హిందీ పండిట్ ను పంపించారు. ఈ అక్రమ డిప్యుటేషన్లు రద్దు చేయాలి.

నిబంధనలను తుంగలో తొక్కి ఖాళీల ప్రదర్శన సమయంలో కొంత మందికి లాభం చేయడానికి ప్రయత్నం చేసిన ఏపీవోను విధుల నుంచి తప్పించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్​ చేస్తున్నాయి. 
గుండాల మండలం నుంచి హిందీ పండిట్​ను జూలూరుపాడు మండలంలోని పాపకొల్లు పాఠశాలకు డిప్యుటేషన్​ చేశారు. రేషనలైజేషన్ ​రూల్ ​ప్రకారం అయితే అదే మండలంలో లేదా పక్క మండలంలో టీచర్లను సర్దుబాటు చేయాలి. కానీ దూరంగా ఉన్న గుండాల నుంచి సర్దుబాటు చేశారు. డిప్యుటేషన్​ వెంటనే రద్దు చేయాలి. 

యూపీఎస్​శేఖర్​బంజరలో 23 మంది పిల్లలు ఉన్నారు. వారికి పండిట్స్, స్కూల్​అసిస్టెంట్లు ఎవరూ లేరు. వారికి వెంటనే టీచర్​ను కేటాయించాలి.

యూపీఎస్​ గాంధీనగర్​లో 19 మంది పిల్లలు ఉన్నారు. పండిట్స్ లేనందున డిప్యుటేషన్​పై నియమించాలి.

యూపీఎస్​ ఆర్​సీ బంజరలో ఆరు, ఏడు తరగతుల్లో 23 మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ స్కూల్​ అసిస్టెంట్​ను ఇవ్వాలి. 

ఎల్ఎఫ్ఎల్ ​ప్రమోషన్లలో కరకగూడెం వచ్చిన వారిని పాల్వంచ మండలం ప్రశాంతినగర్​కు డిప్యుటేషన్ ఇచ్చారు. ఈ డిప్యుటేషన్​ను రద్దు చేయాలి.

పాల్వంచ మండలం పాత పాల్వంచ ఉన్నత పాఠశాలలో 270 మంది పిల్లలు ఉన్నారు. తెలుగు బోధించే వారు లేరు. పదో తరగతి మూడు సెక్షన్లు ఉన్నాయి. డిప్యుటేషన్​పై తెలుగు పండిట్​ను కేటాయించాలి.

ఎంఆర్​సీలలో అనధికారికంగా ఎండీఎం బిల్లుల పేరుతో టీచర్స్ పనిచేస్తున్నారు. వారందరినీ పాఠశాలలకు పంపాలి.

డీఎస్సీ 2024 ఉపాధ్యాయులు జాయిన్​ అయిన ఆ పాఠశాలలో ఉన్న డిప్యుటేషన్​ చేసిన టీచర్స్ ను పాత పాఠశాలలకు పంపాలి.

ఆందోళనలకు దిగుతాం

అక్రమ డిప్యుటేషన్లను రద్దు చేయాలి. లేకపోతే ఆందోళనలకు దిగుతాం. విద్యార్థులకు హాని కల్గించేలా విద్యాశాఖాధికారుల తీరు ఉంది. అక్రమాలను వెంటనే అరికట్టాలి. - బి.రాజు, యూటీఎఫ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

సరిగానే చేపట్టాం

అవసరం మేరకు టీచర్లను డిప్యూటేషన్ చేశాం. ఎటువంటి అక్రమాలు జరగలేదు. - వెంకటేశ్వరచారి, డీఈవో, భద్రాద్రి కొత్తగూడెం.