బంగాళాఖాతంలో రెండ్రోజుల్లో తుఫాన్..మన రాష్ట్రంపై ప్రభావం తక్కువే  

  • ఒడిశా, బెంగాల్​పైనే ఎఫెక్ట్ 

హైదరాబాద్, వెలుగు : బంగాళాఖాతంలో రెండ్రోజుల్లో తుఫాన్ ఏర్పడనుంది. సోమవారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. మంగళవారం నాటికి వాయుగుండంగా బలపడింది. అది క్రమంగా గురువారం నాటికి తుఫాన్ గా మారనుంది. శుక్రవారం తీవ్ర తుఫాన్​గా బలపడనుంది. దీనికి వాతావరణ శాఖ ‘దానా’గా పేరు పెట్టింది. అయితే ఈ తుఫాన్ వల్ల తెలంగాణపై ప్రభావం ఉండదని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఒడిశా, పశ్చిమ బెంగాల్​పై తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఏపీలోని కోస్తా జిల్లాల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 24 లేదా 25న తీరం దాటే అవకాశం ఉందని చెప్పింది. ఈ తుఫాన్ ప్రభావం మన రాష్ట్రంలో పెద్దగా ఉండదని, పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయని పేర్కొంది.

గురు, శుక్రవారాల నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడేందుకు అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్​లో రెండ్రోజుల పాటు మబ్బులు పట్టి ఉంటుందని, తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

దానా తుఫాన్​తో 41 రైళ్లు రద్దు

సికింద్రాబాద్, వెలుగు: దానా తుఫాన్ ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో నడిచే 41 రైళ్లను రద్దు చేసింది. ఈ నెల 23, 24, 25, 27 తేదీల్లో సర్వీసులందించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

రద్దు చేసిన రైళ్ల వివరాలను ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం సాయంత్రానికి తుఫాన్ గా మారి ఈ నెల 24న పూరి– బెంగాల్ తీరాన్ని దాటనుందని వాతావరణ శాఖ అధికారులు వేశారు.