నిజామాబాద్ లో విజృంభిస్తున్న డెంగ్యూ

  • నిజామాబాద్ లో 34, కామారెడ్డిలో  12 కేసులు
  • వైరల్​ జ్వరాలతో జనం బేజారు
  • జ్వర పీడితులతో  కిక్కిరిస్తున్న గవర్నమెంట్​, ప్రైవేట్​ హాస్పిటిల్స్​

నిజామాబాద్​/ కామారెడ్డి , వెలుగు:  ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో డెంగ్యూతో పాటు  వైరల్​ జ్వరాలు విజృంభిస్తున్నాయి. వర్షాలు, వాతావరణ మార్పులు, పల్లె, పట్టణాల్లో పారిశుద్ధ్య లోపంతో ప్రజలు జ్వరాలు బారిన పడుతున్నారు.   గత ఏడాదికి మించి నమోదవుతున్న డెంగ్యూ కేసుల నియంత్రణపై అధికారులు ఫోకస్ పెట్టడం లేదు. ప్రజల భాగస్వామ్యంతో చేపట్టాల్సిన 'ఫ్రైడే డ్రైడే' నిర్లక్ష్యానికి గురవుతోంది.

  • ఈ నెలలో పెరిగిన కేసులు

నిజామాబాద్ లో జూన్​ ఒక్క నెల లోనే 18 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి.  దీంతో మెడికల్​ అండ్​ హెల్త్​ డిపార్ట్ మెంట్ అధికారులు డెంగ్యూ, వైరల్​  కేసులు నమోదవుతున్న ఏరియాల్లో స్పెషల్​ శానిటేషన్​ ప్రోగ్రామ్స్ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినా ఈ నెలలో ఇప్పటి వరకు 34 డెంగ్యూ, 269 వైరల్​ ఫీవర్​ కేసులు నిజామాబాద్​లోనమోదు కాగా జ్వర పీడితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కామారెడ్డిలో కేవలం పది రోజుల్లో 12 డెంగ్యూ పాజిటివ్​ కేసులు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలోని గవర్నమెంట్​ హాస్పిటల్స్​లో ప్రతి రోజూ  ఓపీ ఐదు వేలు దాటుతోంది.  ఇందూర్​లో డెంగ్యూ నిర్దారణ కోసం 12 వందల శాంపిళ్లు టెస్ట్​ చేశారు. జీజీహెచ్​, కామారెడ్డి సర్కారు దవాఖానాల్లో  ఫీవర్​ ట్రీట్​మెంట్​ కోసం సెపరేట్​ వార్డు కేటాయించగా, ప్రైవేట్​ హాస్పిటల్స్​లో చేరిన వారి సంఖ్య మూడింతలుంది. ఎలీజా టెస్ట్​తో సర్కారు హాస్పిటల్స్​లో డెంగ్యూ కన్ఫర్మ్​ అవుతూ పద్ధతి ప్రకారం ట్రీట్​మెంట్​ జరుగుతుండగా  ప్రైవేటులో ఎన్​ఎస్​-1 కిట్​ను బేస్​ చేసుకొని ప్లేట్​లెట్స్​ పడిపోతున్నాయని బిజినెస్ కు తెర తీశారు.

  • అలసత్వం వీడాలె

మురుగు కాలువల క్లీనింగ్​, తాగునీటి నల్లాల వద్ద నీరు నిలువకుండా చూడడంతో పాటు దోమల మందు పిచికారీ చేయాలి. వారంలో ఒక రోజు ఇంటి పరిసరాలలో నిల్వ నీటి తోడేయడానికి డ్రైడేను కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. దోమల లార్వా వ్యాప్తిని అరికట్టే గంబుసియా చేపలు, ఆయిల్ బాల్స్ మురుగునీటిలో వదలం వల్ల ప్రయోజనం ఉంటుంది. గోరువెచ్చిన నీరు తాగడం, నిల్వ చేసిన ఆహారం కాకుండా ఎప్పటికప్పుడు వండిన వేడి ఆహారాన్ని తినడం తదితర అంశాలపై ప్రజల కోసం అవగాహన కార్యక్రమాలు గ్రౌండ్​ లెవల్​లో నిర్వహించాలి. 

  • రెండేళ్లకోసారి పెరుగుతోంది 


గత ఏడాది కంటే జిల్లాలో డెంగ్యూ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. ప్రతి రెండేండ్లకోసారి ఈవ్యాధి వ్యాప్తి కొంత ఎక్కువ ఉంటుంది. దోమలు, శానిటేషన్​ లోపం, ఇంటి చుట్టూ రోజుల తరబడి వర్షం నీటి నిల్వ దోమలకు అవాసాలుగా మారుతుంది. ఆఫీసర్లతో పాటు ప్రజలు అవగాహనతో ఉంటేనే డెంగ్యూ బారి నుంచి తప్పించుకోవచ్చు.


- డాక్టర్​ తుకారాం రాథోడ్​, 
ఇన్​ఛార్జ్​ డీఎంహెచ్​వో