పల్లెలపై డెంగ్యూ పంజా.. నిరుడి కంటే 50% అధికంగా కేసులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డెంగ్యూ డేంజర్​ బెల్​ మోగిస్తున్నది. రోజురోజుకూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. జనాలు జ్వరాలతో దవాఖాన్ల బాట పడుతున్నారు. నిరుడి కంటే ఈసారి సుమారు 50 శాతం ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఈసారి డెంగ్యూ సోకిన వారిలో రోగ తీవ్రత తక్కువగానే ఉందని డాక్టర్లు చెబుతున్నప్పటికీ, నిత్యం ఏదో ఒక చోట డెంగ్యూ మరణాలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. 

 

నిత్యం ఏదో చోట మరణాలు

రాష్ట్రంలో డెంగ్యూ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.  నిరుటి కంటే ఈసారి సుమారు 50 శాతం ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి.  నిత్యం ఏదో ఒక చోట డెంగ్యూ మరణాలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. జ్వరాలతో దవాఖాన్లలో వేల మంది అడ్మిట్ అవుతున్నారు. ఒక్క జులై నెలలోనే 2,69,475 మంది జ్వరంతో బాధపడుతూ దవాఖాన్లకు వచ్చారు. 

ఇందులో కేవలం 14,470 మందికి  డెంగ్యూ టెస్టులు చేయగా, 1,617 మందికి డెంగ్యూ పాజిటివ్ వచ్చినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. నిరుడు జులైలో 937 కేసులు నమోదయ్యాయి.

డెంగ్యూతో గర్భిణి మృతి

మూడ్రోజుల క్రితం హనుమకొండ జిల్లా గట్లకానిపర్తి గ్రామానికి చెందిన గర్భిణి డెంగ్యూతో చనిపోగా, శనివారం ములుగు జిల్లా జాకారం గ్రామానికి చెందిన మరో గర్భిణి అక్షిత (26) ప్రాణాలు కోల్పోయింది. ఆమెతో పాటు కడుపులో ఉన్న బిడ్డ కూడా కన్నుమూసింది. అలాగే, హనుమకొండలో మహిళ కడుపులో ఉన్న కవలలు కూడా చనిపోయారు. 

వరుస ఘటనలు..

సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలానికి చెందిన ఓ మహిళ వారంపాటు జ్వరంతో ఇబ్బంది పడి, ఈ నెల 1న ప్రాణాలు విడిచింది. గత నెల 29న మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలోని సూరారం గ్రామానికి చెందిన ఇంటర్​ విద్యార్థి డెంగ్యూకు బలయ్యాడు. కరీంనగర్​ రూరల్​మండలం దుర్శేడ్​కు చెందిన ఇరుకుల్ల అనిల్​మూడ్రోజులుగా డెంగ్యూతో బాధపడుతున్నాడు. 

కరీంనగర్​లోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్​లో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.  అయితే, అధికారులు మాత్రం జ్వరాలతో ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్కరు కూడా చనిపోలేదని కేంద్రానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ సర్కార్ హయాంలోనూ అధికారులు ఇలాగే మరణాలను నమోదు చేయకుండా, డెంగ్యూ తీవ్రతను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా అదే  చేస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు. 

భారీగా పెరిగిన కేసులు

జ్వరాలతో దవాఖాన్లలో వేల మంది అడ్మిట్ అవుతున్నారు. ఒక్క జులైలోనే 2,69,475 మంది జ్వరంతో బాధపడుతూ దవాఖాన్లకు వచ్చారు. ఇందులో 46 వేల మందికి జ్వర తీవ్రత ఎక్కువగా ఉండడంతో, ఇన్‌‌‌‌పేషెంట్లుగా చేరారు. జులైలో 14,470 మందికి డెంగ్యూ టెస్టులు చేయగా, 1,617 మందికి పాజిటివ్ వచ్చినట్టు లెక్కలు చెబుతున్నాయి. 

ఇక గతేడాది జనవరి నుంచి జులై వరకు 2,817 కేసులు నమోదైతే, ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 3,531 కేసులు నమోదు కావడం గమనార్హం. అధికారిక లెక్కల కంటే పది రెట్లు ఎక్కువగానే కేసులు ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో డిసీజ్ సర్వైలెన్స్‌‌‌‌, రిపోర్టింగ్ వ్యవస్థ సరిగా లేదని, దీంతో డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల లెక్కలు సరిగా నమోదు చేయడం లేదని డాక్టర్లు ఆరోపిస్తున్నారు.

పిల్లలపై పంజా

డెంగ్యూ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటున్నది. నిలోఫర్​ హాస్పిటల్‌‌‌‌లో నిత్యం 1,200 మంది అవుట్ పేషెంట్లు వస్తుండగా, ఇందులో సగం ఫీవర్ కేసులే ఉంటున్నాయి. జ్వరం లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, వారికి మాత్రమే డెంగ్యూ టెస్టులు చేయిస్తున్నారు. సగటున 6  డెంగ్యూ కేసులు ఒక్క నిలోఫర్‌‌‌‌‌‌‌‌లోనే నమోదవుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి

వర్షాకాలం జాగ్రత్తలు తీసుకుంటే సీజనల్​ ఫీవర్స్​ దరిచేరకుండా చూడొచ్చు. ఇంటిని క్లీన్​ గా ఉంచుకోవడంతో పాటు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఏడిస్ ​​దోమ పగటి పూట కుట్టే అవకాశం ఉంది కాబట్టి కిటికీలు మూసి ఉంచాలి. పిల్లలను బయటకు పంపేటప్పుడు దోమలు కుట్టకుండా పొడవాటి దుస్తులు వేయాలి. - డాక్టర్ రవి కుమార్, పీడియాట్రిషన్, నిలోఫర్​ హాస్పిటల్