రెండొంతుల ఓటర్ల తీర్పే ప్రజాస్వామ్యమా?

 తాజాగా18వ లోక్ సభ సార్వత్రిక ఎన్నికల ఘట్టం ముగిసింది. ఫలితాలు కూడా వచ్చాయి. అదేవిధంగా ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు.. 7 విడతల పోలింగ్​లో  ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో 64.20 కోట్ల మంది ఓటు వేశారని, ఇది 65.79 శాతంగా నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం కూడా పేర్కొంది. అదే ఎన్నికల సంఘం.. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో సుమారు 97 కోట్లకుపైగా ఓటర్లు ఉన్నారని, షెడ్యూల్ విడుదలకు ముందు చెప్పింది.  కాగా.. తొలి దశలో ‌‌‌‌ పోలింగ్ 66.14 శాతంగా నమోదైతే.. ఏడో దశలో 63.88 శాతంగా వచ్చింది. దీన్ని బట్టి చూస్తే..ఈసారి ఎన్నికల్లో దాదాపు 35 కోట్ల మందికి పైగా ఓటు వేయలేదు.  

గత ఎన్నికల కంటే తగ్గిన ఓటింగ్​ శాతం

మొత్తం ఓటర్లలో రెండొంతులు పోలైన ఓట్లతోనే  ప్రజా తీర్పు వెల్లడైంది. ప్రజాస్వామ్యంలో పాలకుల పనితీరుకు కొలమానం ఓటర్ల తీర్పే. ఎన్నికలు ఏవైనా  ప్రజా తీర్పు రెండొంతులు దాటడంలేదు. 2019 లోక్‌‌‌‌ సభ ఎన్నికల్లోనూ దాదాపు 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు, పోలింగ్ 67.4 శాతంగా నమోదైందని కేంద్ర ఎన్నికల కమిషన్ లెక్కల ద్వారా తెలుస్తోంది. 

ఇప్పటివరకు జరిగిన అన్ని లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైనది కూడా 2019లోనే.  ఈసారి లోక్​సభ ఎన్నికల్లో  ఓటర్లు పెరిగారు. ఓటింగ్ శాతం మాత్రం గతంకంటే తగ్గింది. ఇందుకు కారణమేంటి..?  కారకులెవరు..? ఓటర్లా?  ఎన్నికల కమిషనా ? రాజకీయ పార్టీలా? అనే వాటికి సమాధానాలు వెతకడం కూడా కష్టమే!

ఈసీ బాధ్యత ఎంత..?

ఓటు హక్కు ప్రాధాన్యంపై ఈసీ ఎంతో హడావుడి చేస్తుంది. కర్షకుల నుంచి సెలబ్రెటీల దాకా ఓటు హక్కు ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. అయినా.. ఓటర్లను ఆకట్టుకోలేకపోతోంది. పోలింగ్ కేంద్రానికి వందశాతం ఓటర్లను రప్పించలేకపోతోంది. సంపూర్ణ ఓటింగ్ నమోదు చేయించలేకపోతోంది. నానాటికి ఓటింగ్ శాతం తగ్గుతోందంటే లోపం ఎక్కడుంది? 

బ్రిటిష్ మోడల్ అయినా..కానీ.. 

మనదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బ్రిటిష్ వెస్ట్‌‌‌‌ మినిస్టర్ మోడల్‌‌‌‌ గా రూపొందినదే. అదే  బ్రిటన్‌‌‌‌లో ఒక్కరోజే ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రి ఓట్ల లెక్కింపు చేపట్టి, మరుసటి రోజు ఉదయానికి.. లేదంటే సాయంత్రానికల్లా ఫలితాలు వెల్లడిస్తారు. అమెరికా కూడా ఇవే ఫాలో అవుతుంది. ఇక మనదేశంలోనైతే విడతల వారీగా ఎన్నికల తంతు నిర్వహిస్తారు. ఈసారి లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్19న తొలి దశతో  మొదలై .. జూన్ 1న ఏడో దశ పోలింగ్ తో ప్రక్రియ ముగిసింది. అంటే.. 44 రోజుల పాటు ఎన్నికల తంతు కొనసాగింది. 

ఇలా ఎందుకంటే.. భద్రతా కారణాలు, జనాభా రీత్యా నిర్వహించాల్సి వస్తుందని, కేంద్ర ఎన్నికల సంఘం  చెబుతున్న మాట. కానీ ఎన్నికల సంఘం మాత్రం ఎన్నికల నిర్వహణను త్వరగా పూర్తి చేయడంలేదనే ఆరోపణలు లేకపోలేదు. ఆసేతు హిమాచలం దాకా స్మార్ట్ ఫోన్ లో యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా ఓటు వేసేందుకు ఈసీ తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో 3 ఏండ్ల కిందట పైలెట్ ప్రాజెక్ట్ గా చేపట్టింది.  కానీ.. ఈసీ ఆ దిశగా చర్యలు మాత్రం తీసుకోవడంలేదు.

మరిన్ని కారణాలూ ఉన్నాయి

ఓటరు జాబితాల్లో తప్పులు. ఉన్న  ఓటర్ల తీసివేత. పోలింగ్​ బూత్​కు వచ్చాక ఓటు తీసేయబడ్డదని తెలుసుకొని పోయే వారూ మనకు కనిపిస్తుంటారు.  చనిపోయిన ఓటరు పేరు తొలగించరు. జీవించి ఉన్న ఓటరు తొలగించి ఉంటుంది. అంతా ఆన్​లైన్​ నమోదు నడుస్తోంది. అంతే! పట్టణాల్లో  రెంటుకు ఉండే జనాభా సుమారు 30 శాతంపైనే. ఇల్లు మారిన వారి పేరు అలాగే ఉంటుంది. కొత్త ఇంటిలో ఓటు నమోదు చేసుకోరు.  ఇంటింటికి తిరిగి ఓటర్లను  నమోదు చేసే ఎన్నికల కమిషన్​ కార్యక్రమమే  రెండు దశాబ్దాలుగా కనిపించడం లేదనే చెప్పాలి. 

ఆ విధంగా ఓటరు జాబితాలే తప్పులతడకగా మారడం కూడా ఓటింగ్​ శాతం తగ్గడానికి ప్రధాన కారణమని చెప్పాలి.  స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ కేంద్ర ఎన్నికల కమిషన్. ఎన్నికలు ఏవైనా సజావుగా, నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించడం దీని ప్రధాన విధి. ప్రజల్లో ఓటు వేసే బద్దకం ఎంతో కానీ, ఆన్​లైన్​ నమోదు తప్ప ఇంటింటి ఓటరు నమోదు ఎందుకు  జరగడం లేదో ఈసీ చెప్పాలి.

ఓటేయని బద్ధకస్తులు?

ఓటును వజ్రాయుధంగా.. తిరుగులేని అస్త్రంగానూ నినదిస్తుంటారు.  ఓటర్లనే పార్టీలు ప్రసన్నం చేసుకుంటాయి. వారిచ్చే తీర్పు కోసమే ఉత్కంఠతో ఎదురుచూస్తుంటాయి. నాణానికి మరోవైపు చూస్తే.. ఓటు హక్కును ఒక సామాజిక బాధ్యతగా.. ప్రజాస్వామ్యం ఫరిఢవిల్లడానికి స్ఫూర్తిగా చాలామంది ఓటర్లు తీసుకోవడంలేదు. కేవలం పోలింగ్‌‌‌‌ రోజున ఓటు వేయడం కంటే.. హాలిడేగా ఎంజాయ్ చేద్దామనే చూస్తుంటారు కొందరు. గ్రామీణ ఓటర్ల కంటే.. పట్టణ, యువ ఓటర్లే ఓటు వేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదని సర్వేలుచెపుతున్నాయి. 

ఓటు హక్కుపై నిరాసక్తత ఎందుకు?  ఓటర్లకు ఏమైంది?   అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఓటరును పోలింగ్ బూత్ దాకా తీసుకొచ్చి ఓటు వేయించడం ఎన్నికల సంఘానికి ఒక పెద్ద ప్రహసనంగా తయారైంది. గ్రామీణ ఓటర్లలో ఓటు చైతన్యం ఎక్కువగా ఉంటే.. మరోవైపు ఓటు ఏం వేస్తాంలే అనే బద్ధకం పట్టణ ఓటర్లలో ఉంది. భవిష్యత్ లో ఇలాగే కొనసాగితే  నిర్బంధ ఓటు హక్కు అమలుకు దారి తీయొచ్చు. 

ఇప్పటికే..ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, మెక్సికో, ఇటలీ వంటి 30 పైగా  దేశాలు నిర్బంధ ఓటు హక్కును అమలు చేస్తున్నాయి. మనదేశంలో పోలింగ్ రోజు సెలవు ఇచ్చినా కూడా ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. ఆ రోజును ఎంజాయ్ చేస్తుంటారు. అదే అమెరికాలోనైతే.. పోలింగ్ రోజు సెలవు కూడా ఇవ్వరు. 

 వేల్పుల సురేష్
సీనియర్ జర్నలిస్టు