వడ్ల ట్రాన్స్​పోర్ట్​ టెండర్లకు..మస్తు డిమాండ్​

  • నాగర్​ కర్నూల్​ జిల్లాలో పెరిగిన పోటీ

నాగర్​కర్నూల్,​ వెలుగు : కొనుగోలు కేంద్రాల నుంచి రైస్​ మిల్లులకు వడ్లు తరలించే ట్రాన్స్​పోర్ట్​ టెండర్లకు డిమాండ్​ పెరిగింది. పెరుగుతున్న డీజిల్, ఇతర ఖర్చులకు ప్రభుత్వం ఇచ్చే రేట్​ సరిపోకపోయినా టెండర్లు దక్కించుకోవడానికి పోటీపడుతున్నారు. ఒకరికొకరు తప్పుకోమని బుజ్జగిస్తున్నారు లేదంటే  భయపెడుతున్నారు. అవసరమైతే టెండర్లు వేయకుండా అడ్డు కుంటున్నారు.ఈ నెల 11న సివిల్​ సప్లై ట్రాన్స్​పోర్ట్​ టెండర్లను కలెక్టరేట్​లో ఓపెన్​ చేయాల్సి ఉండగా, ఒకరు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్ట్​ స్టే విధించింది. ఈ నెల 24న హియరింగ్​ అనంతరం జడ్జిమెంట్​ వస్తుందని సమాచారం. అప్పటి వరకు టెండర్ల ప్రక్రియను చేపట్టవద్దంటూ కోర్టు ఆదేశించింది.

టెండర్లపై కోర్టు స్టే..

నాగర్​ కర్నూల్​ జిల్లాలో వడ్ల కొనుగోలు కోసం 290 వరకు కేంద్రాలు తెరుస్తారు. వ్యవసాయ మార్కెట్​ కమిటీ, పీఏసీఎస్, మెప్మా ద్వారా కొనుగోలు చేసే వడ్లను రైస్​ మిల్లులకు తరలించేందుకు ప్రైవేట్​ ట్రాన్స్​పోర్ట్​ కంపెనీల నుంచి సివిల్​ సప్లై శాఖ టెండర్​ తీసుకుంటుంది. టెండర్లలో పాల్గొనే వారికి సొంతంగా 10 లారీలు,15 కిరాయి లారీలు ఉండాలి. టెండర్​ దక్కితే రూ.10 లక్షలు బ్యాంక్​ గ్యారెంటీ, రూ.20 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్​కింద చెల్లించాలి. జిల్లాలోని నాలుగు డివిజన్లకు కలిపి 100 లారీలు ఉండేలా సివిల్​ సప్లై అధికారులు నిబంధనలు విధించారు. కొనుగోలు కేంద్రం నుంచి 8 కిలోమీటర్ల వరకు రూ.221 చెల్లిస్తారు.

కల్వకుర్తి డివిజన్​లో నాలుగు టెండర్లు, అచ్చంపేట డివిజన్​లో రెండు టెండర్లు, కొల్లాపూర్, నాగర్​ కర్నూల్​ డివిజన్​లో ఒక టెండర్​ చొప్పున దాఖలయ్యాయి. ఈ నెల 9న ఆన్​లైన్​లో టెండర్లు పిలిచిన సివిల్​ సప్లై అధికారులు 11న కలెక్టరేట్​లోని సివిల్​సప్లై డీఎం ఆఫీస్​లో డాక్యుమెంట్లు ఇవ్వాలని పేర్కొన్నారు. నాగర్​ కర్నూల్​ డివిజన్​ ట్రాన్స్​పోర్ట్  కోసం టెండర్​ వేసిన నీరజ కలెక్టరేట్​కు రాగా.. ఆమెను కొందరు కారు దిగకుండా అడ్డుకున్నారు. కలెక్టరేట్​లోకి వెళ్లిన తరువాత ఆమె బ్యాగ్​ గుంజుకున్నారు. సివిల్​ సప్లై డీఎం పోలీసులకు సమాచారం ఇచ్చిన తరువాత అక్కడికి చేరుకున్న పోలీసులు దౌర్జన్యానికి పాల్పడిన వారిని అడ్డుకోకపోవడంతో నీరజ సివిల్​ సప్లై ఆఫీసులోకి వెళ్లలేకపోయింది.

టెండర్​ డాక్యుమెంట్లు ఆఫీస్​లో ఇవ్వకపోతే, టెండర్​ వేయకపోయినా తమకే దక్కుతుందని అడ్డుకున్నవారు భావించారు. తనను అడ్డుకున్న వారికి పోలీసులు, అధికారులు  సపోర్ట్​గా నిలిచారని ఆరోపించారు. అనంతరం ఆమె హైకోర్ట్​లో పిటీషన్​ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు​టెండర్​ ప్రక్రియపై స్టే విధించింది. ఈ నెల 24న హియరింగ్​ అనంతరం తుది ఆదేశాలు జారీ అవుతాయని సమాచారం. ఇదిలాఉంటే జిల్లాలోని నాలుగు డివిజన్ల టెండర్లను తిరిగి నిర్వహిస్తామని సివిల్​ సప్లై డీఎం తెలిపారు.

లారీలు పంపించక రైతులకు తిప్పలు.. 

గతంలో ట్రాన్స్​పోర్ట్​ టెండర్లు దక్కించుకున్నవారు కొనుగోలు కేంద్రాలకు సకాలంలో లారీలు పంపించకపోవడం, మధ్యలోనే కాంట్రాక్ట్​ నుంచి తప్పుకోవడం, వేరే వారికి సబ్​ కాంట్రాక్ట్​ అప్పగించడం వంటివి చోటు చేసుకున్నాయి. సివిల్​ సప్లై అధికారులు, ట్రాన్స్​పోర్ట్​ కాంట్రాక్టర్ల మధ్య రైతులు నష్టపోయారు. కొన్ని సందర్భాల్లో రైతులే తమ వడ్లను రైస్​ మిల్లులకు తీసుకెళ్లారు. ఈ సారి గతంలో మాదిరిగా ఇబ్బంది పెట్టవద్దని రైతులు కోరుతున్నారు.