- ఎఐపీకేఎస్ ఆధ్వర్యంలో ఆర్డీవోకు మెమోరండం అందజేత
ఆర్మూర్, వెలుగు : 2024 సంవత్సరానికి పచ్చి రొట్ట, విత్తనాలతో పాటు అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు,, వ్యవసాయ పరికరాలకు 60 శాతం సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఎఐపీకేఎస్) ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్మూర్ ఆర్డీవో ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం ఆర్డీవో రాజాగౌడ్ ను కలిసి మెమోరాండం అందజేశారు.
ఈ సందర్భంగా ఎఐపీకేఎస్ జిల్లా అధ్యక్షులు సారా సురేశ్, ఆర్మూర్ ఏరియా అధ్యక్షులు ఏపీ గంగారాములు, ప్రధాన కార్యదర్శి యు.రాజన్న మాట్లాడారు. 2014 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు జరిపి రైతులకు రెండింతల ఆదాయం తెచ్చి పెడతానని ఎన్నికల ప్రణాళికలో చెప్పి మోడీ సర్కారు మోసం చేసిందని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అన్ని పంటలకు రూ.500 బోనస్ ను ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏరియా నాయకులు ఇస్తారి రమేశ్, టి. గంగాధర్, బి . మల్లన్న, అశోక్, లింబాద్రి, శోభన్ తదితరులు పాల్గొన్నారు.