తెలంగాణ కిచెన్..శ్రీకృష్ణజన్మాష్టమి పర్వదినాన..వెరైటీ వంటకాలు

పండుగలకి ఆయా ప్రాంతాల్లో ఉన్న సంప్రదాయ వంటకాలు చేయడం సహజం. అయితే అదే పండుగకి పక్క రాష్ట్రాల్లో చేసే సంప్రదాయ వంటకాలను కూడా ట్రై చేస్తే బాగుంటుంది.అలాంటివే ఇవి కూడా.. రేపు అంటే ఆగస్టు 26న శ్రీకృష్ణజన్మాష్టమి పర్వదినాన ఈ వెరైటీ వంటకాలు వండి రుచి చూడండి.

వెన్న ఉండలు

కావాల్సినవి :

బియ్యప్పిండి - ఒక కప్పు
మినప్పిండి - ఒక టేబుల్ స్పూన్
వెన్న - రెండు టేబుల్ స్పూన్లు
పచ్చి కొబ్బరి - ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర - ఒక టీస్పూన్
ఇంగువ - పావు టీస్పూన్
నీళ్లు - సరిపడా
నూనె - వేగించడానికి సరిపడా
నువ్వులు - ఒక టీస్పూన్  (ఇష్టపడితే)

తయారీ : ఒక పాన్​లో బియ్యప్పిండి వేసి రెండు నిమిషాలు వేగించి పిండిని ఒక ప్లేట్​లోకి తీయాలి. అదే పాన్​లో మినప్పిండి వేగించాలి. ఒక గిన్నెలో బియ్యప్పిండి, మినప్పిండి వేసి కలపాలి. పచ్చి కొబ్బరి ముక్కలను మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్​ చేసిన కొబ్బరిని పాన్​లో వేసి తేమపోయేవరకు వేగించాలి. తరువాత దాన్ని కూడా బియ్యప్పిండి మిశ్రమంలో వేసి కలపాలి. అందులో వెన్న, ఉప్పు, జీలకర్ర, ఇంగువ వేసి కలిపి ముద్ద చేసి, ఉండలు చేయాలి. ఆ ఉండల్ని పొడి బట్ట​ మీద అరగంట ఆరబెట్టాలి. పాన్​లో నూనె వేడి చేయాలి. అందులో రెడీ చేసిన ఉండల్ని బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. ఒక పళ్లెం​లో టిష్యూ పేపర్ వేసి, వేగించిన ఉండలు దానిమీద వేసి చల్లారబెట్టాలి. 

గోపాలక​లా 

కావాల్సినవి :

పోహా (అటుకులు) - రెండు కప్పులు
పెరుగు - అర కప్పు
పాలు - ఒక కప్పు
ఉప్పు - సరిపడా
నెయ్యి - ఒక టీస్పూన్
ఆవాలు - పావు టీస్పూన్
మినప్పప్పు - అర టీస్పూన్
జీలకర్ర - పావు టీస్పూన్
ఇంగువ - చిటికెడు
కరివేపాకు, కొత్తిమీర - కొంచెం
పచ్చిమిర్చి - ఒకటి
కొత్తిమీర - రెండు టేబుల్ స్పూన్లు

తయారీ : ఒక గిన్నెలో పోహా వేసి అందులో పాలు, నీళ్లు పోయాలి. పెరుగు కూడా వేసి బాగా కలపాలి. తరువాత ఉప్పు వేసి మరోసారి కలపాలి. ఒక పాన్​లో నెయ్యి వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేగించాలి. ఆ తాలింపును పోహా మిశ్రమంలో వేసి కలపాలి. ఈ వంటకాన్ని చల్లారాక తింటేనే టేస్టీగా ఉంటుంది. 

పోహా స్వీట్ పొంగల్​ 

కావాల్సినవి :

పోహా (అటుకులు) - ఒక కప్పు
పెసరపప్పు - పావు కప్పు
నెయ్యి - మూడు టేబుల్ స్పూన్లు
నీళ్లు - ఒకటిన్నర కప్పు
జీడిపప్పులు - మూడు టేబుల్ స్పూన్లు
జీలకర్ర, మిరియాలు -  ఒక్కో టీస్పూన్
కరివేపాకు - కొంచెం
పచ్చిమిర్చి - రెండు

తయారీ : పాన్​లో ఒక టేబుల్ స్పూన్​ నెయ్యి వేడి చేయాలి. అందులో పెసరపప్పు వేసి ఒక నిమిషం వేగించాలి. అందులో నీళ్లు పోసి తెర్లాక తీసేయాలి. మరో పాన్​లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి పోహా వేగించాలి. తర్వాత నీళ్లు పోసి ఉడికించాలి. అవి ఉడికాక, పెసరపప్పు వేసి కలపాలి. మరో పాన్​లో నెయ్యి వేడి చేయాలి. అందులో జీడిపప్పులు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేగించాలి. వాటిని పొంగల్​ మిశ్రమం పై పోసి, బాగా కలపాలి. పొంగల్​ బాగా ఉడికాక స్టవ్​ ఆపేయాలి.

మిక్స్​డ్​ఫ్రూట్ కేసరి

కావాల్సినవి :

బొంబాయి రవ్వ, నీళ్లు, పాలు - ఒక్కో కప్పు చొప్పున
చక్కెర - ఒకటిన్నర కప్పు
నెయ్యి - మూడు టేబుల్ స్పూన్లు
యాపిల్, ఆరెంజ్, అరటి పండ్ల ముక్కలు - ఒక్కోటి పావు కప్పు
దానిమ్మ గింజలు, ద్రాక్షలు - ఒక్కోటి పావు కప్పు
బాదం, జీడిపప్పులు - ఒక్కోటి పది చొప్పున
ఎండుద్రాక్ష- రెండు టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - ఒక టీస్పూన్

తయారీ : ఒక పాన్​లో నెయ్యి వేడి చేసి బాదం, జీడిపప్పులు, కిస్​మిస్​ వేగించి ప్లేట్​లోకి తీయాలి. అదే నెయ్యిలో యాపిల్, ఆరెంజ్, అరటి పండ్ల ముక్కలు, దానిమ్మ గింజలు, ద్రాక్షలు వేసి రెండు నిమిషాలు వేగించాలి. ఒక పాలగిన్నెలో పాలు, నీళ్లు పోసి కాగబెట్టాలి. పాలు మరిగాక వేగించిన పండ్లన్నీ అందులో వేసి ఉడికించాలి. కావాలంటే ఫుడ్ కలర్​ కూడా వేసుకోవచ్చు. తర్వాత మరో పాన్​లో బొంబాయి రవ్వ, చక్కెర వేగించాలి. అందులో పాలు, పండ్ల మిశ్రమం వేసి కలుపుతూ ఉండాలి. మిశ్రమం గట్టి పడ్డాక యాలకుల పొడి వేసి బాగా కలపాలి. నెయ్యి, బాదం, జీడిపప్పులు, ఎండుద్రాక్ష వేసి కలపాలి. 

పెసర పాయసం

కావాల్సినవి :

పెసరపప్పు - ఒక కప్పు
బెల్లం - ఒక కప్పు
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
కొబ్బరి పాలు - మూడున్నర కప్పులు
జీడిపప్పు పలుకులు - మూడు టేబుల్ స్పూన్లు
ఎండుద్రాక్ష - రెండు టేబుల్ స్పూన్లు
యాలకులు - నాలుగు 

తయారీ : పాన్​లో నెయ్యి వేడి చేయాలి. అందులో జీడిపప్పులు, ఎండుద్రాక్షలు వేసి వేగించి పక్కనపెట్టాలి. అదే పాన్​లో పెసరపప్పును రెండు నిమిషాలు వేగించాలి. అందులోనే కొబ్బరి పాలు పోసి అవి మరిగాక, యాలకులు వేసి పావుగంట పెసరపప్పును ఉడికించాలి. ఆ తర్వాత బెల్లం వేసి ఐదు నిమిషాలు బాగా కలపాలి. అవసరం అనిపిస్తే మరికొన్ని కొబ్బరి పాలు పోసి కలపాలి. తరువాత పెసర పాయసాన్ని ఒక గిన్నెలోకి తీసి మిగిలిన నెయ్యితోపాటు జీడిపప్పులు, ఎండుద్రాక్షలు వేసి కలపాలి. వేడి వేడి పెసర పాయసం రెడీ.