న్యూఢిల్లీ: ఢిల్లీలో మంగళవారం కుండపోత వర్షం కురిసింది. మింటో బ్రిడ్జ్ అండర్ పాస్, ఫిరోజ్ షా రోడ్, పటేల్ చౌక్ మెట్రో స్టేషన్, మహారాజ్ రంజిత్ సింగ్ మార్గ్ ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో సిటీలోని పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ రద్దీ గురించి ఎప్పటికప్పుడు అధికారులు అడ్వైజరీ జారీ చేశారు. ప్రత్యామ్నాయ రోడ్లను ఉపయోగించుకోవాలని సూచించారు. శాస్త్రీనగర్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ముండ్కాలో భారీగా నీళ్లు నిలిచిపోవడంతో రోహ్తక్ రోడ్డులో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
చిక్కుకుపోయిన స్కూల్ బస్సు
ఢిల్లీలో భారీ వర్షం కారణంగా మింటో బ్రిడ్జ్ అండర్ పాస్ నీట మునిగింది. ఈ ప్రాంతం లో స్కూల్ బస్సుతో పాటు ఆటో రిక్షా చిక్కుకుపోయింది. అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి ముగ్గురు చిన్నారులను రక్షించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. అధికారులు దాదాపు రెండు, మూడు గంటల పాటు శ్రమించి అండర్ పాస్ లో నీటిని తొలగించారు. రాకపోకలను పునరుద్ధరించారు.