ఏఐఏడీఎంకే ఎన్నికల గుర్తుకు సంబంధించి లంచం తీసుకున్న కేసులో నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్‌కు ఢిల్లీ కోర్టు శుక్రవారం(ఆగష్టు 30) బెయిల్ మంజూరు చేసింది. 5 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై అతనికి ఉపశమనం కల్పించింది. చంద్రశేఖర్ ఏడేళ్లకు మించి నిర్బంధంలో ఉన్నందున అతడిని తప్పనిసరిగా విడుదల చేయాల్సి ఉంటుందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అతనిపై మోపిన నేరానికి కంటే ఎక్కువ కాలం జైలు నిర్బంధంలో ఉన్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే విచారణ సంధర్బంగా తెలిపారు. అయితే అతనిపై నమోదైన ఇతర కేసులు పెండింగ్‌లో ఉన్నందున జైల్లోనే ఉన్నాడు.
ఏంటి ఈ కేసు..?
రెండు ఆకుల ఎన్నికల గుర్తు కోసం ఎలక్షన్ కమిషన్ అధికారులకు లంచం ఇచ్చేందుకు అన్నాడీఎంకే నేత టీటీవీ దినకరన్ నుంచి డబ్బు తీసుకున్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఏప్రిల్ 2017లో చంద్రశేఖర్‌ను అరెస్టు చేశారు. నిందితుడు అన్నాడీఎంకే నేత దినకరన్‌కు మధ్యవర్తిగా వ్యవహరించారని, వీకే శశికళ నేతృత్వంలోని వర్గానికి పార్టీ రెండాకుల గుర్తు దక్కడానికి ఎలక్షన్ కమిషన్ అధికారులకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. ఇది 2017లో జరగ్గా.. ఇప్పటికీ ఏడేళ్లు గడిపిచిపోయాయి. అప్పటినుంచి సుఖేష్ చంద్రశేఖర్ జైళ్ళోనే ఉన్నాడు.