రైతుల కష్టం జింకల పాలు...వందల ఎకరాల్లో పంట నష్టం

  • జింకల కోసం 75 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు
  • పట్టించుకోని ఫారెస్ట్  ఆఫీసర్లు

మాగనూర్, వెలుగు: నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో జింకలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. జింకల కోసం ప్రభుత్వం 75 ఎకరాల స్థలాన్ని కేటాయించినా, అటవీ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మాగనూర్, మక్తల్, కృష్ణ, ఉట్కూర్, నర్వ మండలాల్లో కృష్ణ జింకలు రైతుల పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. జింకలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రతి ఏటా వందలాది ఎకరాల పంటలు పాడైపోతున్నాయి. పెట్టుబడి సైతం రావడం లేదని, ఈ విషయాన్ని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.

దీంతో రైతులే రాత్రింబవళ్లు పొలాల దగ్గర కాపలా కాస్తున్నారు. ఉమ్మడి మాగనూర్  మండలం గుడెబల్లూర్, ముడుమాల్, మురహర్దొడ్డి, పెగడబండ, అడవిసత్యారం, పుంజానూర్, అచ్చంపేట్, మాగనూర్, కున్సీ, తంగిడి, ఐనాపూర్, లింగంపల్లి, సుకూర్ లింగంపల్లి, కృష్ణమూర్తి ఉట్కూరు మండలం కొల్లూర్, మల్లేపల్లి, సమస్త పూర్, పెద్దపోర్ల, నాగిరెడ్డిపల్లి, మల్లేపల్లి, ఎడవల్లి గ్రామాల్లో ఈ ఏడాది సాగు చేసిన కంది, పత్తి, ఆముదం, వేరుశనగ పంటతో పాటు వరి పంటను కూడా జింకలు ధ్వంసం చేశాయి. ఇలా వందలాది ఎకరాల్లో పంటలు కళ్ల ముందే నాశనం అవుతున్నా ఏమి చేయలేని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు.

నదీ తీరం జింకలకు అనుకూలం..

కృష్ణా నది తీర ప్రాంతమైన మాగనూర్, కృష్ణ, మక్తల్, నర్వ మండలాల్లో దట్టమైన పొదలు ఉన్నాయి. పక్కనే కృష్ణా నది ప్రవహిస్తుండడంతో జింకల ఆవాసానికి అనుకూలంగా ఉంది. జింకలకు ఏదైనా హాని తలపెడితే అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పడమే తప్ప, జింకలను అదుపు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

24 గంటలు గస్తీ కాయాల్సిందే..

మాగనూర్, కృష్ణ, ఉట్కూర్, మక్తల్ మండలం పరిధిలోని గ్రామాల్లో రైతులు పంటలు సాగు చేయాలంటే 24 గంటలు గస్తీ కాయాల్సిందే. అన్నం తినడానికి ఇంటికి వస్తే చాలు జింకలు పంటను నాశనం చేస్తున్నాయి. దీంతో పంటలు సాగు చేసిన రైతులు ఒక జట్టుగా ఏర్పడి పంటలను కాపాడుకునేందుకు రాత్రింబవళ్లు పొలాల దగ్గరే ఉంటున్నారు. జింకలను బెదిరించినా ఫలితం ఉండడం లేదని, ఒక్కసారిగా మందలుగా వచ్చి పంట పొలాలను నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు.

జింకల కోసం భూమి కేటాయింపు..

.రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రెండేండ్ల కింద కృష్ణ మండలం ముడుమాల్  గ్రామ శివారులోని సర్వే నంబర్ 192 లో 75 ఎకరాల ప్రభుత్వ భూమిని జింకల కోసం ప్రభుత్వం కేటాయించింది. కానీ, ఇప్పటివరకు అక్కడ ఎలాంటి పనులు మొదలు కాలేదు. దీంతో రైతుల తిప్పలు దూరం కావడం లేదు.

జింకలను తరలించాలి..

ఎంతోకాలంగా జింకల వల్ల పంటలు నష్టపోతున్నాం. ఈ ఏడాది ఆరెకరాల్లో పత్తి సాగు చేసిన. జింకలు చేతికి వచ్చిన పంటను నాశనం చేస్తున్నాయి. ఇక్కడి నుంచి జింకలను తరలించాలి. ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకుంటలేరు. ఏం చేయాలో అర్థం అయితలేదు. సర్కారు స్పందించి జింకల బెడద తీర్చాలి.– మారెప్ప, అచ్చంపేట్  గ్రామం

బడ్జెట్​రాగానే తరలిస్తాం..

జింకలను తరలించాలని ప్రభుత్వం జీవో ఇచ్చింది. బడ్జెట్  కూడా కేటాయించింది. కానీ, ఇప్పటివరకు రిలీజ్  కాలేదు. బడ్జెట్  వచ్చిన వెంటనే పనులు చేపట్టి రైతుల ఇబ్బందులు తీరుస్తాం.- నవీన్ రెడ్డి, డీఎఫ్ వో, నారాయణపేట్