ఆ ఊరి పేరే దీపావళి.. ఎక్కడో కాదు ఏపీలోనే..

ఊర్ల పేర్లు ఎలా వస్తాయి.. అక్కడి పాలకుడి పేరు.. చరిత్రకెక్కిన రాజుల పేర్లతోనే.. ప్రసిద్ధి గాంచిన పంటలతోనే.. అక్కడి ప్రత్యేకతలతోనే సాధారణంగా ఊర్ల పేర్లు ఉంటాయి. కానీ ఈ ఊళ్ల పేరు దీపావళి. పండుగ పేరునే ఊరిపేరుగా చేసుకున్న ఆ ఊళ్ల గురించి తెలుసుకుందాం..

శ్రీకాకుళం జిల్లా గార మండలంలో..
దీపావళి పండుగని తెలుసు. కానీ శ్రీకాకుళం జిల్లా గార మండలంలో దీపావళి అనే గ్రామముంది. అక్కడ ప్రజలు 5 రోజులు ఈ పండుగ జరుపుకుంటారు. ఎక్కడాలేని విధంగా పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తారు. ఈ పేరు రావడానికి పురాణగాథ ఉంది. సిక్కోలును పాలించే రాజు శ్రీకూర్మనాథుని దర్శనార్థం వెళ్తూ ఆ ఊరిలో స్పృహ కోల్పోతాడు. అక్కడి ప్రజలు అతనికి దీపాల వెలుగులో సపర్యలు చేస్తారు. కోలుకున్న తర్వాత రాజు ఆ ప్రాంతానికి దీపావళి అని పేరు పెట్టారు.

సుమారు1,000 జనాభా ఉన్న ఈ ఊరిలో గ్రామ ప్రజలు దీపాలు వెలిగించి, మిఠాయిలతో ఈ పండుగను జరుపుకుంటారు. అంతేకాదు కొత్త అల్లుడికి ప్రత్యేకంగా బట్టలు పెట్టి సకల మర్యాదలు చేస్తారు. అయితే చాలా కాలంగా ఈ గ్రామానికి ఉన్న ప్రత్యేక పేరు కారణంగా వార్తల్లో నిలుస్తోంది. దీపావళి పండగ వచ్చినప్పుడల్లా ఈ గ్రామాన్ని గుర్తుచేసుకోవడం అనేది పరిపాటిగా మారింది. ఊర్లకు పేర్లు ఎలా వస్తాయి.

ALSO READ : తెలుగు నేలపైనే నరకాసుర వధ

జలంధర్ జిల్లాలో దివాళి..
పంజాబ్లోని జలంధర్ జిల్లాలో దివాళి అనే గ్రామం ఉంది. ఈ ఊరు జలంధర్కు 14 కిలోమీటర్ల దూరంలో, రాజధాని చంఢీగఢ్కు 149 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. 257 కుటుంబాలు నివసించే ఈ గ్రామ జనాభా 1244 మంది. దీపావళి పండుగను హిందువులతో పాటు సిక్కులు, బౌద్ధులు, జైనులు కూడా జరుపుకొంటారు. అమృత్ సర్లోని స్వర్ణ దేవాలయంలో దివాళి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.

 పంజాబ్ రాష్ట్రంలో దివాళి పండుగను జరుపుకోని గ్రామాలు కూడా ఉన్నాయి. పంజాబ్ బటిండా జిల్లాలోని మూడు గ్రామాలు మాత్రం పండగకు దూరంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఆర్మీ కంటోన్మెంట్, మందుగుండు సామాగ్రి డిపో ఉండటంతో దాదాపు 50 ఏళ్లకు పైగా ఈ గ్రామాలు దీపావళి పండగకు దూరంగా ఉండిపోతున్నాయి. పంజాబ్లోని పూస్ మండి, భగు, గులాబ్ గఢ్ గ్రామాల్లో బాణసంచా పేల్చడం, పంట వ్యర్థాలను కాల్చడంపై నిషేధం పెట్టారు.