తీవ్ర విషాదం.. దుబాయ్ లో కామారెడ్డి జిల్లావాసి ఆత్మహత్య

కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పొట్ట చేతపట్టుకుని విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు ఆ ఎడారి దేశంలోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బంజేపల్లి గ్రామానికి చెందిన నరేష్ (29) అనే యువకుడు కొన్నాళ్ల క్రితం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలోని దుబాయ్ కి వెళ్లాడు. ఉన్న ఊర్లో అప్పులు ఎక్కువ కావడంతో అవి తీర్చే మార్గం లేక ఎడారి దేశానికి పయనమయ్యాడు. 

దుబాయ్ వెళ్లి ప్రైవేట్ ఉద్యోగంలో చేరాడు. వస్తున్న జీతం సరిపోకపోవడంతో పెరుగుతున్న అప్పులు తీర్చే దారి కనబడక నరేష్ తీవ్రంగా కుంగిపోయాడు. ఆర్థిక ఇబ్బందులతో పాటు అప్పుల బాధలు భరించలేక నరేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన నరేష్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని త్వరగా ఇండియాకు రప్పించాలని వేడుకుంటున్నారు.