మళ్లొక్క సారి పోరుబాట.. కరీంనగర్లో మాజీ మంత్రి కేటీఆర్

కరీంనగర్: దీక్షా దివస్ స్ఫూర్తితో మరోసారి పోరుబాట పట్టాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఇవాళ అల్గునూర్ చౌరస్తాలో నిర్వహించిన దీక్షా దివస్ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ కు జన్మనిచ్చింది కరీంనగర్ గడ్డ అన్నారు. 1971లో 11 ఎంపీ సీట్లు ఇచ్చి తెలంగాణ ప్రజలు తమ ఆకాంక్షను తెలియబర్చినా స్వరాష్ట్రం రాలేదన్నారు.

2006లో 2 లక్షల ఓట్లతో గెలిపించి పునర్జన్మను ఇచ్చిందని చెప్పారు. ‘నా శవయాత్రనో.. తెలంగాణ జైత్రయాత్రనో ’అని కేసీఆర్ బైలెల్లితే అండగా నిలిచింది కరీంనగర్.  మనం ఎటుపోతున్నమో తెలుసుకోవాలంటే.. ఎక్కడ మొదలైనమో తెలుసుకోవాలి’అని కేటీఆర్ అన్నారు. ఆ నాడు తెలంగాణ కల సాకారం కావడానికి అండగా నిలిచిన కరీంనగర్ గడ్డ పై నుంచి చెబుతున్నానని, మళ్లొక్క సారి పోరుబాట పట్టాల్సిన సమయం ఆసన్నమైందని కేటీఆర్ అన్నారు. కర్కశ కాంగ్రెస్ ప్రబుత్వంపై కొట్లాడుదామని అన్నారు. 420 హామీలతో మోసం చేసిందని విమర్శించారు.

ALSO READ | రాష్ట్రంలో హాట్ టాపిక్‎గా దీక్షా దివస్.. సెంటి ‘మంట’ ఫలించేనా..?

దీక్షా దివస్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని కేటీఆర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. అలుగునూరు తమకు పవిత్ర స్థలమని అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లను ఎవరూ తుడిపేయలేరని చెప్పారు. కేసీఆర్ అంటే పేరు కాదు తెలంగాణ పోరు అని అన్నారు. కార్యక్రమంలో  మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే  పాడి కౌశిక్ రెడ్డి, మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్యే లు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.