పాకిస్తాన్​లో ముగ్గురికి మంకీపాక్స్

  • ​ ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి

ఇస్లామాబాద్​ : పొరుగు దేశం పాకిస్తాన్​లో  మంకీపాక్స్​ కలకలం రేపింది. స్వీడన్​ తర్వాత ఈ దేశంలో ఈ వైరస్​ కేసులు వెలుగుచూశాయి. దేశంలో ముగ్గురికి మంకీపాక్స్​ వైరస్​ సోకినట్టు పాకిస్తాన్​ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇంటర్నేషనల్​ మీడియా ప్రకారం.. పాకిస్తాన్​కు చెందిన ఈ ముగ్గురు వ్యక్తులు ఈ నెల 3న యూఏఈనుంచి వచ్చారు. వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా మంకీ పాక్స్‌‌‌‌ ఉన్నట్టు తేలింది. దేశంలో 3 మంకీ పాక్స్‌‌‌‌ కేసులు నమోదైనట్టు పెషావర్‌‌‌‌లోని ఖైబర్ మెడికల్ వర్సిటీ వెల్లడించింది.

వారి సహప్రయాణికులతోపాటు సన్నిహితులను గుర్తించి, పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొంది. కాగా, మంకీపాక్స్​ మహమ్మారి ఆఫ్రికా దేశాల్లో కలకలం సృష్టించడంతో ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో)  హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. నిరుడు కూడా పాకిస్తాన్​లో మంకీపాక్స్​ కేసులు వెలుగు చూశాయి. అయితే, ఈ సారి వైరస్​ బయటపడ్డ ముగ్గురికి ఏ వేరియంట్​ సోకిందో స్పష్టత లేదు.

ఎలా వ్యాప్తి చెందుతుందంటే? 

  •     మంకీపాక్స్​ వైరస్ తాకడం వల్ల​ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది
  •     వ్యాధి సోకిన వారి చర్మం లేదా నోరు లేదా జననేంద్రియాల గాయాలతో ప్రత్యక్ష సంబంధం  ద్వారా వ్యక్తి నుండి వ్యక్తికి సోకుతుంది.
  •     రోగులు వాడిన దుస్తులు, ఇతర వస్తువుల వినియోగం, టాటూల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వచ్చే చాన్స్​ ఉంది. 
  •     ఈ వ్యాధి సోకిన జంతువులను తాకడం, కొరకడం, కళేబరాలను ముట్టుకోవడం వల్ల మనుషుల్లోకి వైరస్‌‌‌‌ ప్రవేశిస్తుంది.

లక్షణాలివే..

  •     మంకీపాక్స్​ వైరస్‌‌‌‌ మనిషి శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత 1 నుంచి 21 రోజుల్లో ఎప్పుడైనా లక్షణాలు బయటపడవచ్చు. 
  •     చర్మంపై పొక్కులు, జ్వరం, గొంతు తడారడం, గొంతు, వెన్ను నొప్పి, తల, కండరాల నొప్పులు, లింఫ్​ గ్రంథుల వాపు, సత్తువ కోల్పోవడంలాంటివి ఉంటాయి. 
  •     ఇవి దాదాపు 2 నుంచి 4 వారాలపాటు కొనసాగవచ్చు. ఇవి వ్యక్తి రోగ నిరోధక శక్తిపై ఆధారపడి ఉంటుంది.