సీఎంఆర్ గడువు ముగిసినా బియ్యం ఇయ్యలే

  • ఇంకా లక్షా 40 వేల ఎంటీఎస్​ల బియ్యం బకాయి
  • మొండికేస్తున్న రైస్ మిల్లర్లు.. చర్యలపై ఉత్కంఠ
  • మరో 15 రోజుల్లో కొత్త ధాన్యం కొనుగోళ్లు

నిర్మల్, వెలుగు: సీఎంఆర్ కు సంబంధించి రైస్ మిల్లర్లకు ప్రభుత్వం విధించిన గడువు సోమవారంతో ముగిసింది. 2023–24 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని అందించేందుకు గతంలోనే గడువు విధించినప్పటికీ ఆ టైమ్​లోపు మిల్లర్లు బియ్యాన్ని అప్పజెప్పకపోవడంతో ఈ నెల 30 వరకు మరోసారి డెడ్​లైన్ విధించింది. అయినప్పటికీ నిర్మల్​జిల్లాలోని చాలామంది రైస్ మిల్లర్లు ఈ గడువును సైతం లెక్కచేయకుండా బియ్యాన్ని అప్పజెప్పకపోవడం చర్చకు తావిస్తోంది. అధికారులు కొన్ని మిల్లులపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ రాజకీయంగా పలుకుబడి ఉన్న మిల్లర్ల విషయంలో మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలున్నాయి.

ఖరీఫ్, రబీ సీఎంఆర్​పై నిర్లక్ష్యం

2023, 24 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ప్రభుత్వం జిల్లాలోని రైతుల నుంచి 1 లక్షా 42 వేల 759.680 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి రైస్ మిల్లర్లకు సీఎంఆర్ కోసం అప్పజెప్పింది. ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ కింద 95 వేల 664 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తిరిగి అప్పజెప్పాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కేవలం 49 వేల 115 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే రైస్​మిల్లర్లు అప్పజెప్పారు. ఇంకా 46 వేల 549 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అప్పజెప్పాల్సి ఉంది. అలాగే 2023- 24 రబీ సీజన్ కు సంబంధించి 1,56,847 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కోసం కేటాయించగా.. మిల్లర్లు లక్షా 5 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తిరిగి అప్పజెప్పాల్సి ఉన్నప్పటికీ కేవలం 10 వేల 413 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే అందించారు. ఇంకా 94 వేల 674 మెట్రిక్ టన్నులు అప్పజెప్పాల్సి ఉంది. ఈ రెండు సీజన్లకు సంబంధించి మొత్తం 1 లక్షా 41 వేల 223 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ కింద రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది.

మళ్లీ కొనుగోళ్లు షురూ...

ఇదిలాఉండగా 2024, 25 ఖరీఫ్ సీజన్​కు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు షురూ చేసింది. మొత్తం 220 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 1 లక్షా 46 వేల 895 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో సన్నాలు 62 వేల 370 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం ధాన్యం 84 వేల 525 మెట్రిక్ టన్నులు సేకరించాలని టార్గెట్​ పెట్టుకున్నారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరో 15 రోజుల్లోగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న అధికారులు.. ఆ దిశగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కొనుగోళ్లకు 36.72 లక్షల గన్నీ బ్యాగుల అవసరం కాగా ప్రస్తుతం 14 లక్షల బ్యాగులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో వాటి కొనుగోలు కోసం అధికారులు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు.

టెండర్ ధాన్యాన్ని లిఫ్ట్ చేయని మిల్లర్లు

2022 - 23 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించిన 1 లక్షా 41 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం మిల్లర్లు, ట్రేడర్లకు టెండర్ ప్రక్రియ ద్వారా విక్రయించింది. అయితే టెండర్లు దక్కించుకున్న వారు ఆ డబ్బులు చెల్లించకపోవడమే కాకుండా టెండర్ ప్రక్రియ ద్వారా దక్కించుకున్న ధాన్యాన్ని సైతం లిఫ్టింగ్ చేయడం లేదు. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు అందడంలేదు.