సాగుభూమికే రైతుబంధు ఇవ్వాలి : డీసీవో శ్రీనివాసరావు

బోధన్​,వెలుగు: సాగుభూమికి మాత్రమే రైతు బంధు పథకాన్ని అమలు చేయాలని రైతులు నుంచి అభిప్రాయాలు అందుతున్నట్లు డీసీవో శ్రీనివాసరావు తెలిపారు.  గురువారం బోధన్​ మండలం అమ్దాపూర్​ సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక  మహాజన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా డీసీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్​ 29 నుంచి జూలై 4 వరకు జిల్లాలోని 89 సహకార సంఘాలలో నలుగురు జిల్లా స్థాయి అధికారుల ఆధ్వర్యంలో  మహాజన సభలు ఏర్పాటు చేశామన్నారు.  రైతుబంధుపై రైతుల అభిప్రాయాలు సేకరించినట్లు తెలిపారు.

ALSO Read :  కాగజ్ నగర్ ఆర్డీవో ఆఫీస్ చరాస్తుల జప్తు వాయిదా

రైతుల నుంచి ఏడు రకాల అభిప్రాయాల వచ్చినట్లు తెలిపారు. రైతులు సాగుభూమికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలని, కొంతమంది రైతులు 10 ఎకరాలోపు, మరికొంతమంది రైతులు 15ఎకరాలలోపు ఇవ్వాలని, మరికొంతమంది రైతులు కౌలు రైతులకు రైతుబందు ఇవ్వాలని, ఎకరానికి యేడాదికి రూ.15వేలు ఇవ్వాలని వంటి అభిప్రాయాలు వచ్చినట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మెన్​, డీసీసీబీ డైరెక్టర్ గిర్దవార్​ గంగారెడ్డి, సొసైటీ డైరెక్టర్లు, రైతులు  పాల్గొన్నారు. 

రైతుల అభిప్రాయం మేరకే రైతు భరోసా 

ఎడపల్లి, వెలుగు : రైతన్నల అభిప్రాయం మేరకే ప్రభుత్వం రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందజేస్తుందని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కో–ఆపరేటివ్​అధికారి శ్రీనివాస్​రావు తెలిపారు. గురువారం ఎడపల్లి మండలంలోని జైతాపూర్, ఎడపల్లి సింగిల్​విండో కార్యాలయంలో నిర్వహించిన రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని 89 పీఏసీఎస్ లు ఉన్నాయని, గత నెల 29 నుంచి రైతుల అభిప్రాయాలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతుల అభిప్రాయాలను తాము ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు.

ప్రభుత్వం రైతుల మెజార్టీ సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని రైతు భరోసా విధివిధానాలను రూపొందించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎడపల్లి సింగిల్​విండో చైర్మన్ మల్కారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్, ఉపాధ్యక్షులు అనిల్​రెడ్డి, జైతాపూర్​సింగిల్​విండో చైర్మన్​సత్యనారాయణ, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్​మండల వ్యవసాయ అధికారి సిద్ధిరామేశ్వర్, విండో కార్యదర్శులు, పాలకవర్గం సభ్యులు, రైతులు పాల్గొన్నారు.