మార్చి 26న డీసీసీబీ చైర్మన్ ​ఎన్నిక..రమేశ్​రెడ్డి కే చాన్స్

  • వైస్​ చైర్మన్​ పదవికి తీవ్ర పోటీ
  • ఏకాభిప్రాయం తర్వాతే ఎన్నిక

నిజామాబాద్, వెలుగు : ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్​ఎన్నిక మంగళవారం జరుగనుంది. ఇదివరకు బ్యాంకు చైర్మన్​గా ఉన్న పోచారం భాస్కరరెడ్డి మీద డైరెక్టర్లు అవిశ్వాసాన్ని ప్రకటించగా.. ఈనెల 21న మీటింగ్​ నిర్వహించారు. మెజారిటీ డైరెక్టర్లు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేయడంతో ఆయన పదవిని కోల్పోయారు. వైస్​ చైర్మన్​ కుంట రమేశ్​​రెడ్డికి అదే రోజు ఇన్​చార్జ్​ చైర్మన్​గా బాధ్యతలు అప్పగించారు.

పూర్తిస్థాయి చైర్మన్​ ను ఎన్నుకునేందుకు మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. చైర్మన్​ ఎన్నిక లాంఛనమే కాగా.. వైస్​ చైర్మన్​ పదవికి డైరెక్టర్ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. దీంతో ఏకాభిప్రాయాన్ని సాధించిన తర్వాత వైస్​ చైర్మన్​ ఎన్నిక నిర్వహించాలని డైరెక్టర్లు భావిస్తున్నారు. 

నోకాన్ఫిడెన్స్​ సక్సెస్​

పోచారం భాస్కర్​రెడ్డి ఆధిపత్యాన్ని సహించలేక బీఆర్ఎస్ కే చెందిన డైరెక్టర్లు అవిశ్వాసానికి సిద్ధపడ్డారు. భాస్కరరెడ్డిని వ్యతిరేకిస్తున్న మెంబర్లకు వైస్​ చైర్మన్​ కుంట రమేశ్​రెడ్డి నాయకత్వం వహించారు. డైరెక్టర్లను సమీకరించడంతో పాటు వారిని ఒక్కతాటిపైకి తెచ్చి నో కాన్ఫిడెన్స్​ ప్రతిపాదించారు. బీఆర్ఎస్​ ప్రభుత్వం పోయి కాంగ్రెస్​ అధికారంలోకి రావడంతో వారికి కాంగ్రెస్​ సపోర్ట్​ లభించింది.

రమేశ్​ రెడ్డికి సమీప బంధువైన మాజీ మంత్రి, బోధన్​ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి వారికి అండగా ఉండి.. అవిశ్వాసం నెగ్గేలా వ్యూహరచన చేశారు. భాస్కర్​రెడ్డి ప్లేస్​లో ఇన్​చార్జిగా రమేశ్​రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. రమేశ్​రెడ్డికే మెజారిటీ డైరెక్టర్ల మద్దతున్నందువల్ల ఆయనే చైర్మన్​గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. 

వైస్ చైర్మన్​పదవికి పోటీ

వైస్​ చైర్మన్​ పదవి కోసం ముగ్గురు డైరెక్టర్లు పోటీ పడుతున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డైరెక్టర్​ పి.సాయికుమార్(గాంధారి) ​, సిద్ధి రాములు (జంగంపల్లి), కమ్మ సామాజిక వర్గానికి చెందిన శరత్​(బోధన్) ఈ పదవిని ఆశిస్తున్నారు. ముగ్గురు కూడా ఎవరికి వారే తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరూ తగ్గకపోవడంతో ఏకాభిప్రాయం కోసం కాంగ్రెస్​ ముఖ్య నేతలు సంప్రదింపులు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చిన తర్వాతే వైస్​ చైర్మన్​ ఎన్నిక జరగనుంది. 

 ఎన్నిక ఏకగ్రీవమే

డీసీసీబ్యాంకులో 20 మంది డైరెక్టర్లకు ఓటు హక్కు ఉంది. అందులో 11 మంది అటెండ్​ అయితే కోరం ఉన్నట్టే. 11 మంది హాజరైతే చైర్మన్​ ఎన్నిక నిర్వహిస్తారు. మంగళవారం జరిగే ఎన్నికలో ఒక్కరే నామినేషన్​ వేస్తారని, ఎన్నిక ఏకగ్రీవమవుతుందని భావిస్తున్నారు. ఒకవేళ సమీకరణాలేమైనా మారి ఎక్కువ మంది పోటీలో ఉంటే ఎన్నిక జరుగుతుంది. ఎన్నికల ప్రక్రియ జిల్లా కోఆపరేటివ్​ ఆఫీసర్(డీసీఓ) శ్రీనివాస్​రావు ఆధ్వర్యంలో జరుగుతుంది.