ఎంపీ అర్వింద్​ పేపర్​ పులి : మానాల మోహన్​రెడ్డి

నిజామాబాద్, వెలుగు: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల ప్రజలు ఎంపీ అర్వింద్​కు కర్రుకాల్చి వాత పెట్టారని, లోక్​సభ ఎన్నికల్లోనూ మూడో స్థానానికి పరిమితమవుతారని డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్​రెడ్డి విమర్శించారు. మంగళవారం డీసీసీ ఆఫీస్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్వింద్​గర్వాన్ని గుర్తించిన సొంత పార్టీ లీడర్లు ఆయనకు టికెట్​ఇవ్వొద్దని ఆందోళనలు చేస్తుంటే, ఆ టాపిక్​ను డైవర్ట్​ చేయడానికి కాంగ్రెస్​ నేత, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డిపై బురదజుల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 

రాజకీయాల్లో మచ్చలేని మనిషిగా ఎమ్మెల్సీ జీవన్​రెడ్డికి పేరుందన్నారు. అర్వింద్ ​కల్లిబొల్లి మాటలు నమ్మి ఆయన్ను గతంలో ఎంపీగా గెలిపించారని, నిజామాబాద్ ​ప్రజలు మరోసారి ఆ తప్పు చేయబోరన్నారు. అర్వింద్​ పేపర్​ పులి అని ఆయన జిల్లా అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. పసుపు మద్ధతు ధర పెంచేలా చేస్తానని, నిజాం షుగర్స్​ రీఓపెన్​ బాధ్యత తీసుకుంటానని మోసగించారన్నారు. బీజేపీ కార్యకర్తలే ఎంపీగా అర్వింద్​ను ఓర్చుకోలేక ధర్నాలు చేస్తున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా లోక్​సభ ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్​ గెలుపు ఖాయమన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, తాహెర్, కేశావేణు పాల్గొన్నారు.