David Warner: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఆరేళ్ళ తర్వాత కెప్టెన్‌గా వార్నర్

ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పై ఆ దేశ క్రికెట్ బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా(CA) విధించిన 'జీవితకాల కెప్టెన్సీ' నిషేధాన్ని ఇటీవలే ఎత్తివేసిన సంగతి తెలిసిందే. తనపై విధించిన నిషేధాన్ని తొలగించాలని వార్నర్.. సీఏని కోరగా..ఈ మాజీ ఓపెనర్ ఇప్పటికే శిక్ష అనుభవించాడని, చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతున్నాడని సమీక్ష ప్యానెల్ పేర్కొంది. దీంతో వార్నర్ కు మళ్ళీ కెప్టెన్సీ చేపట్టనున్నాడు. బిగ్ బాష్ లీగ్ లో వార్నర్ ను సిడ్నీ థండర్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. 

అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వార్నర్ స్వదేశంలో జరగనున్న టీ20 టోర్నీ బిగ్ బాష్ లీగ్ పై దృష్టి పెట్టాడు.  ఇప్పటికే థండర్స్‌కు నాయకత్వం వహించిన వార్నర్.. మరోసారి సారధ్య బాధ్యతలు స్వీకరించినదుకు ఆనందం వ్యక్తం చేశాడు. క్రిస్ గ్రీన్ స్థానంలో వార్నర్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. చివరి సీజన్ లో గ్రీన్ కెప్టెన్సీలో సిడ్నీ థండర్ చివరి స్థానంలో నిలవడంతో ఆ జట్టు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఆరేళ్ళ తర్వాత వార్నర్ కెప్టెన్ గా కనిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

ఎందుకీ నిషేధం..?

శాండ్‌పేపర్‌గేట్ అని పిలువబడే ఈ బాల్ ట్యాంపరింగ్ కుంభకోణం 2018లో ఆస్ట్రేలియా జట్టు.. దక్షిణాఫ్రికాలో పర్యటించిన సమయంలో చోటుచేసుకుంది. నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ లో ఇరు జట్లు చెరొకటి గెలవగా.. కీలకమైన మూడో టెస్టులో ఆసీస్ ఆటగాళ్లు బంతిని ట్యాంపరింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ముందుగా బాన్‌క్రాఫ్ట్ ఒక సాండ్‌పేపర్ ముక్కను జేబులో పెట్టుకురాగా.. ఆ పేపర్ సాయంతో మైదానంలో బంతి రూపురేఖలు మార్చే ప్రయత్నం చేశాడు. ఈ వ్యవహారంలో అతనికి అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ మద్దతు పలికారు.

ఈ బాల్ ట్యాంపరింగ్ వ్యవహారం కెమెరాలో బంధించబడటంతో వీరి బాగోతం బయటపడింది. ఆపై మ్యాచ్ ముగిశాక జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బాన్‌క్రాఫ్ట్ తప్పును(సాండ్‌పేపర్‌ ఉపయోగించడం) అంగీకరించాడు. ఈ ఘటన తరువాత క్రికెట్ ఆస్ట్రేలియా స్మిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో పాటు.. బాన్‌క్రాఫ్ట్‌, వార్నర్‌లపై జీవితకాల కెప్టెన్సీ నిషేధం విధించింది. 

Also Read : ఐపీఎల్ మెగా ఆక్షన్.. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌ భారత ఆటగాళ్లు వీళ్ళే

2011లో ఆస్ట్రేలియా తరుపున టెస్ట్ అరంగ్రేటం చేసిన వార్నర్‌.. తన కెరీర్ మొత్తంలో 112 టెస్టులు ఆడారు. 205 ఇన్నింగ్స్‌లో 8786 పరుగులు చేశారు. ఇందులో 3 డబుల్ సెంచరీలు, 26 సెంచరీలు, 36 అర్థ సెంచరీలు ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్.. 335 కాగా, సగటు 44.60. 161 వన్డేల్లో 6932 పరుగులు చేశాడు. వీటిలో 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ వార్నర్‌.. మున్ముందు ఫ్రాంచైజీ క్రికెట్ లో ఎక్కువగా కనిపించనున్నాడు. 110 టీ20ల్లో ఓ సెంచరీతో 3277 పరుగులు చేశాడు.