- గత నెల 20న ఘటన
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
మిర్యాలగూడ, వెలుగు : వీల్‌చైర్‌లో నిస్సహాయస్థితిలో ఉన్న మామపై కోడలు చెప్పుతో దాడి చేసింది. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెంలో గత నెల 20న జరిగిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన గగ్గినేపల్లి బుచ్చిరెడ్డి, అనసూర్య దంపతులకు శ్రీనివాస్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి ఇద్దరు కొడుకులు. బుచ్చిరెడ్డికి 2016లో యాక్సిడెంట్ కావడంతో అప్పటి నుంచి వీల్‌చైర్‌కే పరిమితం అయ్యాడు.
అతడి భార్య అనసూర్యకు కూడా 2022లో హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఈ క్రమంలో బుచ్చిరెడ్డి, అనసూర్య దంపతులను పోషించే విషయమై పంచాయితీ తలెత్తడంతో ఇద్దరు కొడుకులు చెరో నెల పోషించాలని పెద్దమనుషులు తీర్మానించారు. కానీ ఆ నిర్ణయం సరిగా అమలుకాకపోవడంతో బుచ్చిరెడ్డి, అనసూర్య దంపతులు చిన్నకొడుకు శేఖర్‌రెడ్డి వద్దే ఉంటున్నారు. పెద్ద కోడలు మణిమాల గత నెల 20న శేఖర్‌రెడ్డి ఇంట్లోకి వచ్చి వీల్‌చైర్‌లో ఉన్న బుచ్చిరెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేసి, చెప్పులతో కొట్టింది. ఈ విషయంపై అదే నెల 22న బుచ్చిరెడ్డి వేములపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.