దాసరి మోహన్ రాసిన నవల ‘వెంకటయ్య బావి’. వెంకటయ్య ఓ షావుకారు దగ్గర గుమాస్తా. వెంకటయ్యకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్ళు. షావుకారు సాయంతో కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేసిండు. కొడుకు రమేష్ కోసం, కడుపు మాడ్చుకొని పైసలు కూడబెట్టి వావిలాల పల్లెలో జాగ కొన్నడు. ఇల్లు కట్టిండు. బావి తవ్విండు. ఆ ఊరందరికీ మొదటి మంచినీళ్ళ బావి అదే. వెంకటయ్య ఇల్లు ‘వెంకటయ్య బావి’గా పేరు పొందింది. ల్యాండ్‌మార్క్ అయింది.
నీళ్ళతోపాటు అతడు నాటిన చెట్ల పండ్లు ఊరందరికీ ఉపయోగపడ్డాయి. రమేష్ కు ఉమతో పెళ్ళి చేసిండు. కొన్నాళ్ళకు వెంకటయ్య దంపతులు కన్నుమూసిండ్రు. రమేష్ ప్రైవేటు స్కూల్లో తెలుగు మాస్టారు. అతనికి ఒక కొడుకు (దినేష్), ఒక కూతురు (బుజ్జి), ఇల్లును విస్తరించిండు. కాంపౌండ్ వాల్ కట్టి, ఆవరణలో మరిన్ని పూలు, పండ్లు, కూరగాయల మొక్కలు నాటిండు. సుందరమైన తోటగా తీర్చిదిద్దిండు.
భార్య, ఇద్దరు పిల్లలు, అందమైన ఇల్లు, సంతోషకరమైన కుటుంబం. ఒకనాడు ఒక బిల్డర్ వచ్చి, ఆ ఇల్లు (జాగ) ఇస్తే, అపార్ట్మెంట్ కడతనన్నడు. బదులుగా 20 లక్షల రూపాయలు, 3 ఫ్లాట్లు ఇస్తనన్నడు. ఈ ప్రతిపాదన ఉమకు బాగా నచ్చింది. రమేష్ కు ఇష్టం లేదు. వద్దన్నాడు. ఉమ అలక పూనింది. నిరసన చేపట్టింది. సహాయ నిరాకరణ చేసింది. మాట్లాడ్డమే మానేసింది. పిల్లలు ఆమెకే వంత పాడుతున్నారు. తనింట్ల తనే పరాయివాడయ్యాడు. ఆమె తినడం మానేసింది. హాస్పిటల్లో చేరింది. తెగేదాకా లాగడమెందుకని రమేష్ బిల్డర్‌తో అగ్రిమెంటుకు సిద్ధమయ్యాడు. ఉమ ఇంటికి వచ్చింది.
సంపద వస్తుంది, పోతుంది. కానీ ఇంత చక్కని గాలి, ఇంత మంచి పూల వాసన దొరుకుతుందా? కొన్ని ఆనందాలు కొంటే దొరికేవి కావు. తోటతో అనుబంధాలు అన్నీ రేపటి అగ్రిమెంటుతో దహనమైపోతాయి. ఈ గాలి రేపటి డబ్బు సంచులతో కట్టివేయబడుతుంది. నీళ్ళున్న బావిని రాళ్ళతో, మట్టితో నింపేస్తారు. దానిపై రాతి భవనం వెలుస్తుంది.
అగ్రిమెంట్ అయింది. ఉమకు డబ్బు వచ్చింది. డాబు పెరిగింది.
ఎమ్మెల్యేతో సన్మానం చేయిస్తే గాల్లో తేలిపోయింది. ఆమెను ‘మేడమ్’ అని పిలుస్తున్నారు. ఎటు వెళ్ళాలన్నా కారు పంపిస్తున్నారు. రమేష్‌ను ఎవరూ సంప్రదించడం లేదు. జె.సి.బి. బావిని కూల్చేస్తుంటే తన తండ్రిని ఎవరో బలవంతంగా తొలుస్తున్నట్లు అనిపించింది. అయ్యో అంటూ గుండె మీద చేయి వేసుకొని కూలిపోయాడు. హాస్పిటల్లో చేర్పిస్తే, రెండు స్టంట్లు వేసి, నాలుగు లక్షల బిల్లు వేసి పంపించారు.
బిల్డర్- అపార్ట్మెంట్ రెండేళ్ళలో పూర్తి చేశాడు. అప్పటిదాకా వేరే ఇంట్లో ఉన్నందుకు రమేష్ కట్టిన అద్దె రెండు లక్షలు. రమేష్ సోదరీమణులు వచ్చి తమకూ చెరో పది లక్షలు ఇవ్వాలన్నారు. ఉమ.. వాళ్ళను ఖాతరు చేయలేదు. ఉమ తనకు వచ్చిన మూడు ఫ్లాట్లలో ఒకటి అమ్మేసింది. ఒకటి తన పేరుమీద, మరొకటి తన కూతురి పేరుమీద రిజిస్టర్ చేసింది. రమేష్ పేరు మీద ఏమీ లేదు. ఉమ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయింది.
గృహప్రవేశం రోజున అందరికీ సందడి. తాను మాత్రం ఒంటరి, రాజ్యం కోల్పోయిన రాజులాగా అయ్యింది తన పరిస్థితి. ఇక పని మనుషులతోనే సేవలు. తను స్వయంగా టీ ఇచ్చి ఎన్నాళ్ళయిందో. ఉమ తనకు దూరం అవుతూనే ఉంది. ఉమ కారు కొన్నది. బుజ్జికి అమెరికాలో ఉన్న అబ్బాయి సంబంధం చూసింది.పెళ్ళి కుదిరి షాపింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళారు. తిరిగి బయల్దేరేటప్పుడు ‘‘షాపింగ్ కవర్లు ఎక్కువయ్యాయి.
మీరు బస్ లో రండి” అని ఉమ కారులో వెళ్ళిపోయింది. కవర్లకున్న విలువ తనకు లేదా? అనుకున్నాడు. బస్ ఎక్కాడు. విలువలేని చోట నిలువగలడా? ‘‘నాన్నా క్షమించు’’ అని రమేష్ గుండెను పట్టుకున్నాడు. కానీ ఈసారి గుండెను ఆపలేకపోయాడు. శాశ్వతంగా తన తండ్రి దగ్గరకు వెళ్లిపోయాడు. రమేష్ చనిపోయాక, బుజ్జి పెళ్ళి వాయిదా పడింది. ఉమకు తన విలువ తెలిసివచ్చింది. ఉమలో మార్పు వచ్చింది.
రచయితకు ఇది మొదటి నవలే అయినా, రచనలో పరిణతి ఉంది.103 పేజీల ఈ నవల పాఠకులను ఆగకుండా చదివిస్తుంది. ఇంటిలో అనుబంధమే శ్వాసగా గడిపిన రమేష్ జీవితాన్ని, సంఘర్షణలను, సంవేదనలను ఆర్ద్రంగా చిత్రించింది. స్నేహానికీ గుర్తింపునిచ్చింది. ఎంత గొప్ప భావాలనైనా సహజమైన సంభాషణలతో అందించారు. ఈ నవల రాసిన దాసరి మోహన్ కు అభినందనలు.
-
ఎ. గజేందర్ రెడ్డి