హోటళ్లలో మోగుతున్న డేంజ‌‌‌‌‌‌‌‌ర్ బెల్స్!

బిర్యానీ,  హలీంతో పాటు  మొఘలాయి  వంటకాలకు  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ అంతర్జాతీయంగా ఖ్యాతిని ఆర్జించింది.  కానీ,  తాజా ప‌‌‌‌‌‌‌‌రిస్థితుల నేప‌‌‌‌‌‌‌‌థ్యంలో ఇటీవల ఆహారం విషయంలో భాగ్యనగరం ప్రతిష్ట మసకబారుతున్న ప‌‌‌‌‌‌‌‌రిస్థితులు నెలకొన్నాయి.  నేషనల్‌‌‌‌‌‌‌‌ క్రైమ్‌‌‌‌‌‌‌‌ రికార్డ్స్‌‌‌‌‌‌‌‌ బ్యూరో తాజా స‌‌‌‌‌‌‌‌ర్వే  ప్రకారం  ఫుడ్‌‌‌‌‌‌‌‌ క్వాలిటీ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ అట్టడుగు స్థానంలో నిల‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌డం నివ్వెర‌‌‌‌‌‌‌‌ప‌‌‌‌‌‌‌‌రుస్తోంది.  కల్తీ ఆహారానికి సంబంధించి భారత్‌‌‌‌‌‌‌‌లోని ప్రముఖ 19 నగరాల్లో క్రైమ్ రికార్డ్స్ బ్యూరో  ఈ సర్వే చేపట్టింది.  ఆహార నాణ్యతా ప్రమాణాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ సర్వే చేపట్టగా.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఆఖరి స్థానంలో నిలిచింది.  కల్తీ ఆహారంలో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలవగా.. నగరంలోని హోటల్స్‌‌‌‌‌‌‌‌,  రెస్టారెంట్స్‌‌‌‌‌‌‌‌ సైతం  కనీసం నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే విషయం సర్వేలో వెల్లడికావడంతో  సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.  

దాదాపు 62శాతం హోటల్స్‌‌‌‌‌‌‌‌లో గడువు తీరిన ఆహార పదార్థాలు వినియోగిస్తున్నట్లు తెలుస్తున్నది. వాస్తవానికి  ఫుడ్‌‌‌‌‌‌‌‌  విషయంలో  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు ఎంతో ఘన చరిత్ర ఉన్నది.  నాసిరకం, నిల్వ చేసిన ఆహారంతో  నగరంలో ఫుడ్ పాయిజనింగ్ కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల మోమోస్ తిని బంజారాహిల్స్​కు చెందిన ఓ మహిళ  ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల ఆహార కల్తీతో  ఇబ్బంది పడుతున్నవారి సంఖ్య  ఉస్మానియా, గాంధీ, ఫీవర్  ఆసుపత్రిలలో  పెరుగుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 8,624 సార్లు అధికారులు హోటళ్లలో తనిఖీలు చేశారు.  కుళ్లిన ఆహార పదార్థాలు  ఫ్రిజ్​ల్లో  నిల్వ చేసినట్టు తేలింది.  వంట గదిలో ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణమే కనిపించింది. 

ప్రభుత్వ ఆసుపత్రుల్లోని క్యాంటీన్లపై ఫిర్యాదులు

రోడ్డు పక్కన మిర్చీ బండి,  ఫాస్ట్‌‌‌‌‌‌‌‌ఫుడ్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌,  ఫైవ్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ హోటల్‌‌‌‌‌‌‌‌.. స్థాయి ఏదైనా వాటిలో లభించే ఆహార పదార్థాల్లో అక్కడక్కడా ఏదో ఒక రూపంలో కల్తీ జరుగుతోందని ఆహార పరిరక్షణ సంస్థ నిర్వహిస్తున్న తనిఖీల్లో వెల్లడవుతున్నది.   టీ పొడి,  పాలు,  పండ్లు,  పప్పులు,  సాస్‌‌‌‌‌‌‌‌లు,  చక్కెరతో చేసే  మిఠాయిలు, నూనె,  కారంపొడి,  బేకరీ ఉత్పత్తులు,  నిల్వ తీపి పదార్థాలు,  హోటళ్లలో తయారు చేసిన ఆహారాల వరకు కొన్ని స్టాల్స్‌‌‌‌‌‌‌‌లో నాణ్యత ప్రమాణాలు లోపించాయని తనిఖీలు స్పష్టం చేస్తున్నాయి.  కొన్ని నెల‌‌‌‌‌‌‌‌ల క్రితం నిమ్స్ ఆసుపత్రి వద్ద ఉన్న క్యాంటీన్లో ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి పలు లోపాలను గుర్తించారు. నిమ్స్ క్యాంటీన్​కు నిత్యం వేలసంఖ్యలో  రోగులు, వారి బంధువులు వస్తారు.  

నాణ్యతా ప్రమాణాలు సక్రమంగా పాటించక పోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్క నిమ్స్ మాత్రమే కాకుండా గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఎంఎన్ జే ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లోని క్యాంటీన్లు, వాటి సమీపంలోని హోటళ్లలోనూ ఆహార నాణ్యత దారుణంగా ఉన్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. వాటి యజమానులు నిత్యం రూ. లక్షల్లో వ్యాపారం చేస్తూ లాభాలు గడించడమే తప్ప నాణ్యతా  ప్రమాణాలను పట్టించుకోవడం లేదు. ఫుడ్ సేఫ్టీ  స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రకారం హోటళ్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. వంటశాల  పరిశుభ్రంగా  ఉంచడమే కాకుండా  పక్కాగా డ్రైనేజీ వ్యవస్థ ఉండాలి.  వంటపాత్రల నుంచి వంట చేసే వ్యక్తి,  వడ్డించే వారు పరిశుభ్రత పాటించాలి. అంటువ్యాధులు లేవని వారు వైద్యుల నుంచి ధ్రువీకరణ పొందాలి.  ప్రతి హోటల్‌‌‌‌‌‌‌‌కు  లైసెన్సు తప్పనిసరి. కానీ,  చాలా హోటళ్లు ఇవేవీ  పాటించడం లేదు.  ఒక రిజిస్ట్రేషన్​తోనే   ఆ చుట్టుపక్కల  రెండు, మూడు హోటళ్లు నడుపుతున్నారు.  నిలోఫర్,   గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు చుట్టూ ఇలాంటివి ఎక్కువే.  వీటిపై  జీహెచ్ఎంసీ ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు దృష్టి సారించాలి.

గంట నుంచి 36 గంటల్లోపు... 

ఎక్కడైనా హోటళ్లలో ఆహారం తిన్న తర్వాత గంట నుంచి 36 గంటల వరకు ఎప్పుడైనా ముప్పు ఎదురయ్యే ప్రమాదం ఉంది.  క్యాంపిలో బాక్టర్,  సాల్మోనెల్లా, లిస్టెరియా, ఇ. కోలి బ్యాక్టీరియాలు, నోరోవైరస్‌‌‌‌‌‌‌‌లు ఫుడ్ పాయిజన్​కు కారణమవుతాయి.  వివిధ రకాల  డ్రగ్స్,  టాక్సిక్స్  ఆహారం  కలుషితమయ్యే  అవకాశం  ఉందని  వైద్యులు  చెబుతున్నారు.  చిన్న పిల్లలు,  వృద్ధులపై కలుషిత ఆహార తీవ్ర ప్రభావం చూపుతుంది.  దీని వ‌‌‌‌‌‌‌‌ల్ల వికారం, వాంతులు, విరేచనాలు,  కడుపులో నొప్పి,  పొత్తికడుపు తిమ్మిరి,  ఆకలి లేకపోవడం,  యూరిన్  నిలిచిపోవడం,  అధిక జ్వరం,  చలి,  కండరాల నొప్పి వంటి  లక్షణాలు ప్రధానం ఉండ‌‌‌‌‌‌‌‌వచ్చని  వైద్య నిపుణులు చెబుతున్నారు.  నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల‌‌‌‌‌‌‌‌కే ముప్పుంటుంద‌‌‌‌‌‌‌‌ని హెచ్చరిస్తున్నారు.  

నూనెను  ఎక్కువసార్లు  మరిగించడం వల్ల  అందులోని  టోటల్  పోలార్  కాంపౌండ్స్ (టీపీసీ)  ఫ్రీరాడికల్స్ గా మారుతాయి.  సాధారణంగా వంట నూనెలో  పోలార్ కాంపౌండ్స్ 25 శాతానికి  మించితే దాన్ని మార్చాలని  ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.  దాదాపు అన్ని హోటళ్లలో మోతాదుకు మించి హానికరమైన  ఫుడ్ కలర్లు, టెస్టింగ్ సాల్ట్, సోయా సాస్లు ఉపయోగిస్తున్నారు.  కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల రక్తనాళాలు గట్టిపడటం,  అల్జీమర్స్,  కాలేయ,  గుండె సంబంధిత వ్యాధులు, హైపర్​టెన్షన్, కొవ్వు పెరగడం, స్థూలకాయం, ఉదరకోశ, అన్నవాహిక క్యాన్సర్ల బారినపడే  ప్రమాదం ఉంది. హోటళ్లలో కొన్ని పదార్థాలను ఎక్కువసార్లు  ఫ్రై  చేస్తుంటారు. ఇది ఆరోగ్యానికి హానికరమ‌‌‌‌‌‌‌‌ని  వైద్య నిపుణులు చెబుతున్నారు. కొరవడిన ప్రమాణాలు సగటు మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది . ప్రభుత్వం దీనిపై క‌‌‌‌‌‌‌‌ఠిన చర్యలు  తీసుకోవాలి.  ప్రజారోగ్యం కోసం  నిరంత‌‌‌‌‌‌‌‌రం ఆహార క‌‌‌‌‌‌‌‌ల్తీపై  నిఘాపెట్టాలి. 

రికార్డుస్థాయిలో ఫుడ్​ పాయిజనింగ్​ కేసులు

ఇటీవల కాలంలో  అధికారులు నిర్వహించిన  దాడుల్లో  దిగ్భ్రాంతిని  కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనిఖీల్లో కుళ్లిపోయిన పదార్థాలను వినియోగించడం, నాసిరకమైన పదార్థాలను వినియోగిస్తున్నట్లు తేలింది. అయితే, నగరంలోని పలు హోటల్స్‌‌‌‌‌‌‌‌ ఆహారం తిన్న పలువురికి ఫుడ్‌‌‌‌‌‌‌‌ పాయిజనింగ్‌‌‌‌‌‌‌‌ జరిగిన విషయం తెలిసిందే.  ఇటీవ‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌ ఫుడ్ పాయిజనింగ్‌‌‌‌‌‌‌‌ కేసులు రికార్డు స్థాయిలో న‌‌‌‌‌‌‌‌మోద‌‌‌‌‌‌‌‌వుతున్నాయి. దీంతో హోటల్స్‌‌‌‌‌‌‌‌, రెస్టారెంట్స్‌‌‌‌‌‌‌‌లో నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉంటున్నాయో అవగతమవుతున్నది.  ఇదిలా ఉండగా.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వేతో  జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ అప్రమత్తమైంది.  హోటల్స్‌‌‌‌‌‌‌‌, రెస్టారెంట్లలో మార్పులు వచ్చేవరకు దాడులు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీలోని బృందాలతో  ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో నగరంలోని పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లు,  సూపర్  మార్కెట్లలోని  డొల్లతనం  బయటపడున్న ప‌‌‌‌‌‌‌‌రిస్థితి న‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌వాసుల‌‌‌‌‌‌‌‌కు ఆందోళ‌‌‌‌‌‌‌‌న క‌‌‌‌‌‌‌‌లిగిస్తోంది.   హైదరాబాద్  బ్రాండ్  ఇమేజ్  బిర్యానీలో  కూడా  నాణ్యత రోజు రోజుకూ  తగ్గిపోతోంది.  నాసిరకమైన  పదార్థాలతోపాటు  రసాయనాలతో  కూడిన  రంగులు కలపడం వల్ల చాలా చోట్ల బిర్యానీ కల్తీ అవుతున్నట్లు గుర్తించారు.  తందూరి చికెన్,  చికెన్ 65 లాంటి  మాంసాహార  వంటకాలకు దూరంగా ఉంటేనే మంచిదని  ఆహార భద్రతా విభాగం సూచిస్తోంది.  వంట చేసే పరిసరాల్లో ఎలాంటి శుభ్రత పాటించడం లేదని, దుర్గంధంతో కూడిన వంట గది పరిసరాలు,  అపరిశుభ్రంగా వడ్డించే గిన్నెలు, వాటిపై కుప్పలు కుప్పలుగా బొద్దింకలు పారడం టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో బయటపడింది. అంతేకాకుండా ఆహార పదార్థాల నిల్వల్లోనూ కనీస నిబంధనలు పాటించడం లేదని నిర్ధారించారు.

-  సిద్ధగౌని
సుద‌‌‌‌‌‌‌‌ర్శన్, 
సీనియర్ జర్నలిస్ట్