ట్రావెల్: చుగ్​ లోయలో  ఏకైక రెస్టారెంట్

అది అరుణాచల్​ ప్రదేశ్​లోని చుగ్ వ్యాలీ. అక్కడ ఉంటున్న ఒక కమ్యూనిటీకి చెందిన ఎనిమిదిమంది ఆడవాళ్లు కలిసి ఒక రెస్టారెంట్​ నడిపిస్తున్నారు. ఆ రెస్టారెంట్​లో ట్రెడిషనల్ ఫుడ్​ మాత్రమే దొరుకుతుంది. వాళ్లే కాయగూరలు, వంటదినుసులు పండిస్తారు. పండించడం దగ్గర నుంచి వంట చేసి వడ్డించేవరకు అంతా స్వయంగా వాళ్లే చేస్తారు. మరి అంత తాజాగా, రుచికరంగా ఉండే ట్రెడిషనల్​ వంటల్ని రుచి చూడాలంటే... చుగ్ వ్యాలీని విజిట్ చేయాల్సిందే.

అరుణాచల్ ప్రదేశ్‌‌లోని చుగ్ వ్యాలీలో మోన్పా కమ్యూనిటీ వాళ్లు ఉంటారు. ఆ కమ్యూనిటీకి చెందిన ఎనిమిది మంది మహిళలు ‘డామూ హెరిటేజ్ డైన్’ అనే చిన్న రెస్టారెంట్​ నడిపిస్తున్నారు. ఇది అరుణాచల్ ప్రదేశ్‌‌లోని పాపులర్ టూరిస్ట్ సర్క్యూట్‌‌లో ఉన్న ఏకైక రెస్టారెంట్. ఈ టూరిస్ట్​ సర్క్యూట్​ భాలుక్‌‌ పాంగ్ టౌన్‌‌షిప్ నుంచి మంచుతో కప్పుకుపోయి ఉండే తవాంగ్ వరకు విస్తరించి ఉంది.

వందేళ్ల నాటి పాడుబడిన మోన్పా హోమ్‌‌లో ఉన్న డామూ రెస్టారెంట్​లో ఒకేసారి11 మంది కూర్చుని తినొచ్చు. అయితే అక్కడ తినాలంటే మాత్రం ఒక రోజు ముందుగా బుక్ చేసుకోవాలి. ఒకవేళ ఆ వంటలు నేర్చుకోవాలి అనిపిస్తే అక్కడ ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఎంచక్కా నేర్పిస్తారు.  అందమైన ఆ గ్రామం అంతా చుట్టి రావాలి అనిపిస్తే ఒక గైడ్​ని వెంట తీసుకుని వెళ్లొచ్చు. వాటర్ మిల్లుల నుంచి పురాతన పద్ధతిలో చెట్టు బెరడుతో కాగితం తయారుచేయడం వరకు అన్నీ చూడొచ్చు.

మోన్పా కమ్యూనిటీ..

‘‘టిబెట్‌‌కు దక్షిణాన నివసిస్తున్న ప్రజల’’ని మోన్పాలు అంటారు. ఈ కమ్యూనిటీ ప్రజలు పశ్చిమ అరుణాచల్ ప్రదేశ్‌‌లో ప్రధానంగా పశ్చిమ కమెంగ్, తవాంగ్ జిల్లాల్లో ఉంటూ వ్యవసాయం చేసుకుంటుంటారు. మూడు ప్రధాన ఉప-సమూహాలను కలిగి ఉన్న ఈ తెగ -ట్రెడిషనల్​గా మిల్లెట్, మొక్కజొన్న, బార్లీ వంటి పంటలు వేస్తాయి. వీటితో పాటు తినే మొక్కలను పెంచుతారు.

పాలు, మాంసం కోసం పెద్ద జడల బర్రెలు (యాక్స్)ను పెంచుతారు. -పులియబెట్టి, నిప్పుల మీద కాల్చి లేదా ఉడకబెట్టి వంటలు చేస్తారు. అయితే ఈ హిమాలయన్ కమ్యూనిటీ ఆహారపు అలవాట్లలో ఈమధ్య కాలంలో ఎక్కువ మార్పులు చోటుచేసుకున్నాయని పరిశోధనలు చెప్తున్నాయి. వారసత్వ పంటలు మోడర్న్​ పద్ధతులకు మారాయి. ‘‘మేము ‘జంగిల్ కా చీజ్’ అంటే అడవిలో పండే ఆహారాల మీద పెరిగాం. కానీ ఇప్పుడు మేం కూడా ప్రాసెస్ అయిన ఆహారం పై ఆధారపడి మా ట్రెడిషనల్​ ఫుడ్​ తినడం మానేశామని తెలుసుకున్నాం” అని రెస్టారెంట్ నడుపుతున్న ఎనిమిది మందిలో ఒకరైన చోయ్​ జోమ్ ​చెప్పింది.

ఫుడ్​ ఒక్కటే కాదు అక్కడ గత పదేండ్లలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. వాటిలో మోన్పా కమ్యూనిటీ ఇళ్లలో ప్రధాన మార్పు కనిపిస్తోంది. ఇదివరకు రాతి, మట్టితో కట్టిన ఇళ్లలో ఉండేవాళ్లు. అవి కాస్తా ఇప్పుడు కాంక్రీట్ ఇళ్లుగా మారాయి. లోయలో ఉన్న కట్టడాల్లో ఆ మార్పు స్పష్టంగా చూడొచ్చు. రాతి ఇళ్లు కొన్ని పాడుబడిపోయాయి. దాంతో కొన్నింటిని కూల్చేశారు కూడా. 

సంప్రదాయాన్ని మర్చిపోవద్దని..

‘కమ్యూనిటీ బేస్డ్ టూరిజం ఫర్ ది కన్జర్వేషన్’ అనే​ ఎన్జీవో కో– ఆర్డినేటర్ నిశాంత్ సిన్హా 2023వ సంవత్సరంలో చుగ్ ​లోయకి దగ్గరలో ఉన్న దిరంగ్​కు వెళ్లాడు. అక్కడ అతనికి కాంక్రీట్ బిల్డింగులు కనిపించాయి. అప్పుడాయన ఈ ప్రాంతం మునుపటిలా లేదే అనుకున్నాడు. అలాగే మోన్పా ట్రెడిషనల్ ఫుడ్ జాడలు కూడా కనిపించలేదు. ‘లైన్​ హోటల్స్’ అని పిలిచే దాబాలు రోడ్డు పక్కన కనిపించాయి.

అక్కడ పూరీ, రోటీ, రైస్ థాలీ వంటివి మాత్రమే ఉన్నాయి. వాటన్నింటితో పాటు అక్కడి ప్రకృతిలో కూడా మార్పు వస్తుందనే విషయాన్ని గమనించాడు నిశాంత్​. దాంతో ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయంలో భాగమే క్షీణిస్తున్న మోన్పా సంప్రదాయ కట్టడాలను కాపాడడం. వారి వారసత్వ వంటకాలు కనుమరుగు కాకుండా తిరిగి వాటిని వండించడం. దానివల్ల ఆర్థికంగా వాళ్లకు లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి తన ఆలోచనలకు వాళ్లు ‘నో’ అనరు అనే నమ్మకంతో ఒక రోజు గ్రామ సభలో ఆ విషయాలను ప్రస్తావించాడు. అనుకున్నట్టే చాలామంది ఆ నిర్ణయాలకు ఓకే అన్నారు.

కానీ రిమోట్​ రెస్టారెంట్​ విషయంలో మాత్రం కొందరు మగవాళ్లు సంశయించారు.  ‘‘ఆడవాళ్లు ఏం చేయగలరని మగవాళ్లు అనుకున్నారు. కానీ వాళ్లు అనుకున్నది కరెక్ట్​ కాదని మా చేతలతో నిరూపించాం. ఈ ఏడాది మార్చి నుంచి మా రెస్టారెంట్‌‌కి వచ్చిన అతిథులకు భోజనం పెడుతున్నాం. దీని నిర్వహణలో బయటినుంచి మాకు ఎవరి మద్దతు లేదు. ఎనిమిది మందిమే సొంతంగా అన్ని పనులు చేసుకుంటున్నాం. కాయగూరలు పండించుకుంటున్నాం. సరుకులు తెచ్చుకుంటున్నాం” అని ఉత్సాహంగా చెప్పింది 40 ఏళ్ల రించిన్​ జోంబా.

అంతా మేమే చేస్తాం

ఉదయం, మధ్యాహ్నం వంటల కోసం మొక్కలు, అడవి పుట్టగొడుగులు తెచ్చేందుకు ఉదయం 4 గంటలకు మేల్కొంటుంది రించిన్. ‘‘ఉప్పు, నూనె తప్ప వంటకు కావాల్సిన మిగతా వస్తువులేవీ మార్కెట్​లో కొనం. తక్టో ఖాజీ వంటకం అంటే.. స్థానిక మొక్కలతో తయారుచేసే బక్వీట్ నూడుల్స్, పులియబెట్టిన సోయాబీన్, చిల్లీ సాస్ అన్నీ మేమే తయారుచేసుకుంటాం.

మధ్యాహ్నం అయ్యేలోపు, గెస్ట్​లకు సర్వ్​ చేసేందుకు మెరూన్​ రంగులో ఉండే మా ట్రెడిషనల్​ డ్రెస్​ షింకస్ వేసుకుని రెడీ అయిపోతాం” అని చెప్పారు ఆ ఎనిమిది మంది టీం. ‘‘ఈ పనులన్నింటికీ వాళ్లకి ప్రత్యేకంగా ఎటువంటి స్కిల్స్​ అవసరం లేదు.  ఎలా సర్వ్​ చేయాలనేది మాత్రమే మేం నేర్పించాం” అన్నాడు నిశాంత్​. ఆ రెస్టారెంట్​లో కిటికీలు, టేబుల్, స్థానిక నేత బట్టలు, గోడపై మోన్పా గిరిజనుల ఫొటోలు కనిపిస్తాయి. కుర్చీలు ఉండవు. అందుకని గెస్ట్​లు ఇంటి లోపల వేసిన పొడవాటి టేబుల్‌‌ మీద, ఇంటి పక్కన ఉన్న చిన్న బాల్కనీలో లేదా  బయట కూర్చొని తినొచ్చు.

లోకల్ టు మోడర్న్

చుంగ్​ వ్యాలీలో మొక్కజొన్న, బియ్యం, మిల్లెట్స్​, చుర్ర (పులియబెట్టిన యాక్ చీజ్) వంటివి ఉంటాయి. అందుకని వాటితోనే వెరైటీ వంటలు చేస్తారు. వ్యాలీ రెస్టారెంట్​లో స్టార్టర్స్‌‌...  బట్టరీ చుర్రా గొంబు, మిల్లెట్ మోమోస్, మాంసం ఉంటాయి. సీజన్​కి తగ్గట్టు అక్కడ దొరికే ఆకుకూరలు వండుతారు. మెయిన్​ కోర్సులో తక్టో ఖాజీ.. రైస్, నాన్ వెజ్ ఉంటుంది. ఫ్యూజన్ ఫుడ్​లో మార్మాలాడేతో ఉన్న మెత్తటి బక్వీట్ పాన్‌‌కేక్స్, నారింజ, తాజా మొక్కజొన్నలతో సీజనల్ వింటర్ సలాడ్, అక్కడ దొరికే ఆకుకూరలు, చుర్రాతో నింపిన మిల్లెట్ టాకోస్ ఉంటాయి.

ప్రత్యేక వంటకం గోంబు ఫర్సింగ్ కూడా ఉంటుంది. ఇది ఒలియోరెజిన్‌‌లతో చేసే మొక్కజొన్న టార్ట్. దీన్ని కాలుతున్న బొగ్గుల మీద  నెయ్యితో స్లోగా కాల్చి తయారుచేస్తారు. చైనీస్ లక్క చెట్టు నుంచి రెజిన్ తెస్తారు. ఈ రెజిన్​ తీయడం తెలిసిన వ్యక్తి ఆ తెగలో ఒకే ఒకడు ఉన్నాడు. అతను తన తండ్రి దగ్గర నుంచి రెజిన్​ తీయడం నేర్చుకున్నాడు. ఆ రోజుకి రెస్టారెంట్​ పనులు మధ్యాహ్న భోజనంతో పూర్తవుతాయి. మరుసటి రోజు సూర్యోదయం అప్పుడు పొలాల్లోకి వెళ్లి ఆ రోజు వంటకు కావాల్సినవన్నీ తెచ్చుకుంటారు. ఇదే వాళ్ల డైలీ రొటీన్. 

వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) సంస్థ... ‘‘కమ్యూనిటీ కన్జర్వ్​డ్ ఏరియా (సీసీఏ)’’ను డెవలప్ చేయడానికి తగ్గట్టుగా డామూ​ని ఏర్పాటు చేసింది. ఇంతకీ డామూ​ అనే పదానికి చుగ్ స్థానిక భాష దుహుంబిలో ‘కుమార్తె’ అని అర్థం. 

రేట్లు ఇవి


దామూస్​ హెరిటేజ్​ డైన్​లో ఇద్దరు మనుషులు భోజనం చేయాలంటే 1500 రూపాయల నుంచి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ధర గెస్ట్​ల సంఖ్య బట్టి మారే అవకాశం ఉంది.

ఇలా వెళ్లాలి


గౌహతి లేదా అస్సాంలోని తేజ్​ పూర్​ నుంచి ఫ్లయిట్​లో వెళ్లొచ్చు. లేదా గౌహతి నుంచి చుగ్​కి రోడ్డు మార్గం ద్వారా అయితే 9 గంటల జర్నీ. 381 కిలోమీటర్ల దూరం. అదే తేజ్​పూర్​ నుంచి అయితే 198 కిలోమీటర్ల దూరం. 5 గంటల జర్నీ. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే ఎస్​యువి వెహికల్​ బెటర్​.