మా భూములకు పట్టాలు ఇవ్వాలి : దళిత రైతులు

హుజూర్ నగర్ , వెలుగు : దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమకు పట్టాలు ఇవ్వాలని దళిత రైతులు అధికారులను కోరారు. ఈ మేరకు మేళ్లచెరువు మండలం వేపలమాదారం గ్రామానికి చెందిన దళిత రైతులు మంగళవారం ఆర్డీవో శ్రీనివాసులును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు, రైతులు మాట్లాడుతూ వేపలమాదారం గ్రామంలోని సర్వే నంబర్ 141లో  ఉన్న 40 ఎకరాల ప్రభుత్వ భూమిలో 60  మంది దళిత  కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు.

ఇటీవల అదే గ్రామానికి చెందిన కొందరు ఆ భూమిని ఆక్రమించుకునేందుకు దళితులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దళిత రైతులకు పట్టాలు ఇవ్వాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో రైతులు బచ్చలకూరి ప్రసాద్, చింత్రియాల బాలచంద్రుడు, రామారావు, శ్రీనివాసులు, చింత్రీయాల నాగరాజు, బండ్ల రాణి,  ఒగ్గు విశాఖ, ఎం.నాగరాజు తదితరులు ఉన్నారు.