దిగుమతులే దిక్కు..చుక్కల్లో రేట్లు

  • భగ్గుమంటున్న కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు
  • రాష్ట్రంలో కోటిన్నర ఎకరాల సాగు భూములున్నా పండేది పత్తి, వరే
  • 60%  కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునుడే
  • పప్పులు, మిల్లెట్స్​కు డిమాండ్​ ఉన్నా మన దగ్గర సాగు చేస్తలే 
  • మార్కెట్లను గుప్పిట్లో పెట్టుకొని శాసిస్తున్న దళారులు
  • పదేండ్లలో కూరగాయలు, పప్పు ధాన్యాల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువు

హైదరాబాద్​, వెలుగు : ఆంధ్రప్రదేశ్​ నుంచి టమాట, పచ్చిమిర్చి.. కర్నాటక నుంచి క్యాప్సికం..  మహారాష్ట్ర నుంచి ఉల్లి..  ఉత్తరప్రదేశ్​ నుంచి ఆలుగడ్డ..  మహారాష్ట్ర, కేరళ నుంచి అల్లం, ఎల్లిగడ్డలు..  గుజరాత్​, మధ్యప్రదేశ్​ నుంచి కందులు..ఇట్ల ఆయా రాష్ట్రాల నుంచి ట్రక్కుల ద్వారా వచ్చే సరుకు దింపితే గానీ రోజూ మన నోట్లో ముద్ద దిగని పరిస్థితి. రాష్ట్రంలో దాదాపు కోటిన్నర ఎకరాల సాగు భూములు ఉన్నప్పటికీ ఇక్కడ వరి, పత్తి తప్ప వేరే పంటలు పండిస్తలేరు. ఫలితంగా కూరగాయలు మొదలుకొని పప్పులు, నూనెల దాకా అన్నింటికీ ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తున్నది. అటు రవాణా చార్జీలు, ఇటు దళారుల కమీషన్లతో రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల రేట్లు భగ్గుమంటున్నాయి. కూరగాయలు మస్తు పిరం అయ్యాయి. 

ఏటా రూ. వెయ్యి కోట్ల కూరగాయల దిగుమతి 

రాష్ట్రంలో మనం తింటున్న కూరగాయల్లో 40 శాతమే మనదగ్గర పండుతున్నాయి. మిగిలిన 60% బయట రాష్ట్రాల నుంచి వస్తున్నవే.  పదేండ్లు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామని నాటి బీఆర్ఎస్​ సర్కారు గొప్పలు చెప్పుకున్నా.. కనీసం కూరగాయల సాగులోనూ స్వయం సమృద్ధి సాధించలేదు. కూరగాయలు, పండ్ల సాగు, మార్కెటింగ్​ కోసం హార్టికల్చర్ శాఖ తరపున రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందించలేదు.

నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ న్యూట్రిషియన్​ రీసెర్చ్ ప్రకారం ప్రతి వ్యక్తి 325 గ్రాముల కూరగాయలు తీసుకోవాలి. ఆ లెక్కన 4 కోట్లదాకా ఉన్న మన రాష్ట్ర జనాభాకు ఏటా 41 లక్షల 75 వేల టన్నుల కూరగాయలు కావాలి. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో ఏడాదికి 23 లక్షల 46 వేల 700 టన్నుల కూరగాయలు మాత్రమే పండుతున్నాయి. దీంతో డిమాండ్​ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడి వ్యాపారులు ఏపీ, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్​, మధ్యప్రదేశ్​ తదితర నుంచి రాష్టానికి కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నారు. ఒక అంచనా ప్రకారం.. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ఏటా రూ. వెయ్యి కోట్ల విలువైన కూరగాయలు వస్తున్నాయి. 

వీటికి రవాణా చార్జీలు, వ్యాపారులు, దళారుల కమీషన్లు కలిసి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. రాష్ట్రంలో కూరగాయలు, ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుకు అనుకూలమైన నేలలు ఉన్నప్పటికీ రైతులను ఆ దిశగా  ప్రోత్సాహం ఉండటం లేదు. ఉమ్మడి ఏపీలో సబ్సిడీపై కూరగాయల విత్తనాలు, డ్రిప్‌‌ ఇరిగేషన్‌‌ పరికరాలు అందజేసినా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత బీఆర్ఎస్​ సర్కారు అన్నింటినీ పక్కనపెట్టింది. దీనికితోడు కోతుల బెడద, కూలీల కొరత, అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల కూరగాయలు, పండ్ల తోటల సాగుకు రైతులు వెనుకాడుతున్నారు. 

అల్లం, ఎల్లిగడ్డ కిలో రూ. 350

రాష్ట్రంలో వివిధ పంటల సగటు విస్తీర్ణంతో పోలిస్తే వరి, పత్తి సాగు మాత్రమే పెరుగుతుండగా.. మిగిలిన పంటల సాగు ఏటా తగ్గుతున్నది.  కరోనా తర్వాత రాష్ట్ర ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగి.. కూరగాయలు, పండ్లు, మిల్లెట్స్ తినడం పెరిగింది. ఈ లెక్కన పెరిగిన డిమాండ్​కు తగ్గట్టు రాష్ట్రంలో వాటి సాగు పెరగాలి. కానీ మన రాష్ట్రంలో రాగులు, సజ్జలు, కొర్రలు కలిసి ఈ ఏడాది కేవలం వెయ్యి ఎకరాల్లోనే సాగయ్యాయి. ఇది సగటు కన్నా తక్కువ. దీంతో మనకు కావాల్సిన చిరుధాన్యాలను కూడా  ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. 

ఇక  కందులు, పెసర లాంటి పప్పు దినుసులు కూడా సగటు కన్నా తక్కువ విస్తీర్ణంలోనే సాగవుతున్నాయి. నూనె గింజల పరిస్థితి మరీ దారుణం. రాష్ట్రంలో పల్లి కేవలం 20 వేల ఎకరాల్లో, పొద్దుతిరుగుడు కేవలం 71 ఎకరాల్లో సాగవుతుండడంతో పప్పులు, నూనెలను కూడా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోక తప్పడం లేదు. ఇక నెల కింది వరకు కిలో రూ.100, రూ.150 పలికిన అల్లం, ఎల్లిగడ్డ రేట్లు ఇప్పుడు రూ.350 దాకా పలుకుతున్నాయి.  కేరళ, మహారాష్ట్ర, కర్నాటకల్లో వరదల కారణంగానే రేట్లు ఈ స్థాయిలో పెరిగినట్లు వ్యాపారులు చెప్తున్నారు. అంటే బయట రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు కూడా మన రాష్ట్రంలో నిత్యావసరాల రేట్లపై ప్రభావం చూపుతున్నాయి.

మార్కెట్​లో దళారుల రాజ్యం

రాష్ట్రంలోని మార్కెట్లను దళారులు శాసిస్తున్నారు. ముఖ్యంగా అగ్రికల్చర్​, కూరగాయల మార్కెట్లపై వ్యాపారుల పెత్తనం నడుస్తున్నది. రైతుబజార్లలోనూ రైతుల పేరుతో దళారులే తిష్టవేస్తున్నారు. దీంతో అసలైన రైతులు తమ ఉత్పత్తులను నేరుగా అమ్ముకునే పరిస్థితి లేదు. ఆదిలాబాద్​ నుంచి హైదరాబాద్​ వరకు, కరీంనగర్​ నుంచి ఖమ్మం వరకు ఎక్కడ చూసినా బోర్డులపైన ఉన్న రేట్లు అమలుకావడం లేదు. రేట్లను కంట్రోల్​ చేయాల్సిన మార్కెటింగ్ ఆఫీసర్లు వ్యాపారులకు, దళారులకే వంతపాడుతున్నారని, ఫలితంగా రేట్లు పెరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. 

ఉదాహరణకు రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం 57 లక్షలు కాగా, కొన్నేండ్లుగా 60 లక్షల ఎకరాలకు పైగా సాగవుతున్నది. వీటి మిల్లింగ్​కూడా రాష్ట్రంలోనే జరుగుతున్నది. ఈ లెక్కన మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర బియ్యం రేట్లు తగ్గాలి. కానీ మిల్లర్లపై నియంత్రణ లేకపోవడంతో రాష్ట్రంలో బియ్యం రేట్లను ఇష్టారాజ్యంగా పెంచుతున్నారు. జైశ్రీరాం, హెచ్​ఎంటీ లాంటి సన్నరకాలు ఢిల్లీలో క్వింటాల్​కు రూ.6,000 నుంచి 7 వేల దాకా ఉండగా, మన రాష్ట్రంలోనూ ఇంచుమించు ఆ రేట్లే పలుకుతున్నాయి. 

రేషన్​షాపుల్లో బియ్యమే దిక్కు!

పెరుగుతున్న రేట్ల నుంచి సామాన్యులను కాపాడేందుకు  ప్రభుత్వం రేషన్​షాపుల ద్వారా గతంలో బియ్యంతో పాటు చక్కెర,  కందిపప్పు, పామాయిల్​లాంటి నిత్యావసర సరుకులను తక్కువ రేట్లకు పంపిణీ చేసేది. ఉమ్మడి ఏపీలో ‘అమ్మ హస్తం’ పేరుతో 9 రకాల నిత్యావసర సరుకులను రేషన్‌‌షాపుల ద్వారా అందించారు. అప్పట్లో కందిపప్పు కిలోకు రూ.50, పామాయిల్ రూ. 40‌‌‌‌కి ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత బీఆర్​ఎస్​ సర్కారు  బియ్యం తప్ప ఇతర సరుకుల పంపిణీని పక్కనపెట్టింది. ఇస్తున్న బియ్యం కూడా తినేందుకు అనుకూలంగా లేకపోవడంతో అవి కాస్తా బ్లాక్​ మార్కెట్​కు తరలుతున్నాయి. దీంతో బియ్యం రేట్లు తగ్గాల్సింది పోయి ఉల్టా పెరుగుతున్నాయి. 

డీజిల్  రేట్లూ కారణమే..!

మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోల్​, డీజిల్​ రేట్లు మన రాష్ట్రంలో ఎక్కువ. ఉదాహరణకు పొరుగున ఉన్న మహారాష్ట్రలో లీటర్​ డీజిల్​ ధర రూ. 89.97 ఉండగా.. తెలంగాణలో రూ.95.65గా ఉంది. అంటే లీటర్​పై రూ.5.68 ఎక్కువ. ఆ మేరకు మన దగ్గర రవాణా చార్జీలు కూడా తడిసి మోపెడవుతున్నాయి. అన్ని రకాల సరుకులకు దిగుమతులపైనే ఆధారపడుతున్నందున ఆ ఎఫెక్ట్​నిత్యావసర వస్తువులపై పడి రేట్లు పెరుగుతున్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వ సలహాతో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు వ్యాట్​ తగ్గించినా అప్పటి బీఆర్ఎస్​ ప్రభుత్వం మాత్రం తగ్గించలేదు. ఇది కూడా రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల రేట్ల పెరుగుదలకు ఓ కారణంగా మార్కెట్​ వర్గాలు చెప్తున్నాయి. 

వినియోదారుల ధరల సూచికలో తెలంగాణే టాప్​ 

ఇటీవల కేంద్రం విడుదల చేసిన సాధారణ వినియోగదారుల ధరల సూచిక(సీపీఐ)లో పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణే టాప్​గా నిలిచింది. 2012లో  సీపీఐ 100 పాయింట్లు ఉండగా.. 2012-24 మధ్య కాలంలో జాతీయ సగటు 100 నుంచి 193 పాయింట్లకు పెరిగింది. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర 215, మణిపూర్​ 213.4  పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా..  201.6 పాయింట్లతో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. 

పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణదే ఫస్ట్​ ప్లేస్​. త్రిపుర, మణిపూర్​  ఈశాన్య ప్రాం తంలోని కొండకోనల్లో ఉన్నందువల్ల రవాణా చార్జీలు అధికమై నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువ గా ఉండడం సహజం. కానీ, సారవంతమైన నేలలు, కృష్ణా, గోదావరిలాంటి నదులు, ఇరిగేషన్​ప్రాజెక్టులు, అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్న తెలంగాణ రాష్ట్రం సీపీఐలో అగ్రస్థానంలో ఉండడాన్ని బట్టి ఇక్కడ నిత్యావసరాల పెరుగుదల ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.