ఇందూరుపై డీఎస్​ చెరగని ముద్ర

  •     దశాబ్దాల కాలం ఆయన కనుసన్నల్లో కాంగ్రెస్ రాజకీయాలు 
  •     జిల్లాకు తెలంగాణ వర్సిటీ, మెడికల్​ కాలేజీ తెచ్చిన ఘనుడు
  •     మున్నూరు కాపు సంఘానికి జీవితకాల గౌరవ అధ్యక్షుడిగా..
  •     ఆయన పట్టుబడితే.. ఏ పనైనా అవ్వాల్సిందే

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో డి.శ్రీనివాస్​ రాజకీయ శకం ఒక సువర్ణ అధ్యాయం. సుమారు 40 ఏండ్లు పాలిటిక్స్​లో తనదైన ముద్ర వేసిన ఆయన  పర్మనెంట్​ డెవలప్​మెంట్ ​పనులతో అన్ని తరాల నేతలకు ఆదర్శంగా నిలిచారు. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు అనే సూత్రాన్ని డీఎస్​ బలంగా విశ్వసించేవారు. ఎదగడం, ఒదగడం తెలిసిన ఆయన జిల్లా కాంగ్రెస్ ​రాజకీయాలను కొన్నేండ్లపాటు శాసించారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన డీఎస్​ను జిల్లా కాపు సంఘాలు జీవితకాలపు అధ్యక్షుడిగా కొనసాగించాయి. ఇతర అన్ని వర్గాలు ఆయనను ప్రత్యేకంగా అభిమానించి గౌరవించేవారు. మొత్తంగా చెప్పాలంటే ఇందూరులో డీఎస్​ పెద్దమనిషిగా పేరొందారు.

నిజామాబాద్​, వెలుగు: రాష్ట్రంలో తనను లీడర్​గా నిలబెట్టిన నిజామాబాద్​అసెంబ్లీ సెగ్మెంట్​పై డీఎస్​కు ప్రత్యేక అభిమానం ఉంది. యాక్టివ్ ​పాలిటిక్స్​లో ఎంత బిజీగా ఉన్నా పబ్లిక్ ​రిలేషన్ మరిచేవారు కాదు. రెగ్యులర్​ పనులతో సంతృప్తి చెందని ఆయన పర్మనెంట్ ​ప్రాజెక్టులను ప్రజల కోసం ఏర్పాటు చేయించారు. సిటీ విస్తరణను ముందుగానే గ్రహించి 2008లో ఇందూర్​ మున్సిపాలిటీ పరిధిలో అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ (యూజీడీ) నిర్మించారు. రూ.290 కోట్లు ఇందుకు ఖర్చయ్యాయి. నగరానికి లింక్​ లేకుండా కంఠేశ్వర్​ మీదుగా డిచ్​పల్లికి వెళ్లే బైపాస్​ రోడ్డుకు ఆద్యుడు డీఎస్సే. నగరంలోని ఒక భాగం ప్రజలు ఏండ్ల తరబడి ఎదురుచూసిన రైల్వే ఓవర్​ బ్రిడ్జి నిర్మాణం ఆయనే వేయించారు. 

టీయూ ఆయన చలువే

సీఎంగా వైఎస్​ రాజశేఖర్​రెడ్డి ఉన్నప్పుడు జిల్లాకు యూనివర్సిటీ సాంక్షన్​ చేయించడమే కాకుండా దానికి తెలంగాణ (టీయూ) పేరు పెట్టించారు. వేలాది మంది ఉన్నత చదువులకు ఇప్పుడు వర్సిటీ సెంటర్ పాయింట్​అయింది. రాజకీయపరమైన పలు అడ్డంకులు వచ్చినా మెడికల్​ కాలేజీని తాను అనుకున్నట్లు పట్టుబట్టి నగరం నడిబొడ్డున ఏర్పాటు చేయించారు. గవర్నమెంట్​ బీఈడీ కాలేజీతో పాటు ప్రస్తుత మున్సిపల్​ కార్పొరేషన్​ కొత్త ఆఫీస్​ బిల్డింగ్​కు డీఎస్​ ఫండ్స్​ఇచ్చి శంకుస్థాపన వేశారు. 2004–-09లో రాష్ట్ర మంత్రిగా ఉన్న టైంలో నిజామాబాద్​ సెలక్షన్ ​గ్రేడ్​ మున్సిపాలిటీకి కార్పొరేషన్​ హోదా ఇప్పించారు. అనంతరం మున్సిపల్​ కార్పొరేషన్​ ఫస్ట్​ మేయర్​గా పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్​కు బాధ్యత కట్టబెట్టారు. ఆయన చిన్న కుమారుడు అర్వింద్​ బీజేపీలో చేరి 2019, 2024 ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీగా గెలిచారు. డీఎస్​ సహధర్మచారిని విజయలక్ష్మీ గృహిణి.

అందరి గౌరవం పొందిన నేత

అర్గుల్​ రాజారాం తర్వాత జిల్లా కాంగ్రెస్​లో డి.శ్రీనివాస్ హవా నడిచింది. ఆయనను పార్టీ క్యాడర్​ మొత్తం పెద్దమనిషిగా కీర్తించేవారు. ఇక మున్నూరు కాపు సామాజిక వర్గం ఆయనకు ఇచ్చిన గుర్తింపు, గౌరవం అసాధారణం. డీఎస్​ను జీవితకాలపు గౌరవ అధ్యక్షుడిగా కొనసాగించారు. ఆయన చెప్పింది వేదంగా పరిగణించేవారు. బతికిఉన్నంత కాలం డీఎస్​ అన్ని వర్గాలకు వెన్నుదన్నుగా నిలిచారు.

ప్రగతీనగర్​ ఇంటికి పార్థివదేహం 

హైదరాబాద్​లో నుంచి డీఎస్​ డెడ్​బాడీని శనివారం సాయంత్రం నిజామాబాద్​లోని ప్రగతీనగర్​ ఇంటికి తెచ్చారు. భార్య విజయలక్ష్మీ, కొడుకులు ఎంపీ అర్వింద్​, మాజీ మేయర్​ సంజయ్,​ తమ్ముళ్లు సురేందర్, ప్రకాశ్​​ బంధువులు వెంట ఉన్నారు. తమ అభిమాన నేతను కడసారి చూడడానికి ప్రజలు తరలివస్తున్నారు. బైపాస్​ రోడ్​లోని డీఎస్​ కుటుంబీకుల ల్యాండ్​లో ఆదివారం అంతిమ సంస్కారాలు జరుగనున్నాయి. సీఎం రేవంత్​రెడ్డితో పాటు ఆయా పార్టీలకు చెందిన రాష్ట్ర నేతలు హాజరవనున్నారు.