డీఎస్ ఇక లేరు..నిజామాబాద్​లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

  • హైదరాబాద్​లోని ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస
  • నేడు నిజామాబాద్​లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు.. 
  • హాజరుకానున్న సీఎం రేవంత్ 
  • ఉమ్మడి ఏపీలో రెండుసార్లు పీసీసీ చీఫ్, మంత్రిగా సేవలు 
  • కాంగ్రెస్​ను అధికారంలోకి తేవడంలో కీలకపాత్ర
  • వైఎస్, డీఎస్​ది హిట్ కాంబినేషన్​గా గుర్తింపు

నిజామాబాద్ / హైదరాబాద్, వెలుగు : సీనియర్ రాజకీయ నాయకుడు డి.శ్రీనివాస్ (75) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్​లోని ఓ ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ పొందుతూ శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. పార్లమెంట్​సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డీఎస్ చిన్న కొడుకు, ఎంపీ ధర్మపురి అర్వింద్​ విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్​కు చేరుకున్నారు. అలాగే నిజామాబాద్​లో ఉన్న డీఎస్​ పెద్ద కొడుకు, మాజీ మేయర్ ​ధర్మపురి సంజయ్ కూడా హైదరాబాద్​కు చేరుకున్నారు.

డీఎస్ భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన నివాసానికి తరలించి ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడ ఉంచారు. అనంతరం నిజామాబాద్​కు తరలించారు. ఆదివారం నిజామాబాద్​లో అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

దాదాపు 40 ఏండ్ల పాటు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన డి.శ్రీనివాస్.. డీఎస్ గా, శీనన్నగా సుపరిచితులు. బీసీ నేతగా, తెలంగాణవాదిగా, రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరొందారు. నిజామాబాద్​జిల్లా వేల్పూర్​మండల కేంద్రంలో రైతు కుటుంబంలో 1948 సెప్టెంబర్ 27న డీఎస్​జన్మించారు. హైదరాబాద్​నిజాం కాలేజీలో బీకాం డిగ్రీ, తర్వాత లా పూర్తి చేశారు. 1974 నుంచి 84 దాకా రిజర్వ్ బ్యాంకులో పని చేశారు. ఆ టైమ్​లో యువత రాజకీయాల్లోకి రావాలన్న ఇందిరాగాంధీ పిలుపు మేరకు జాబ్​కు ​రిజైన్ ​చేసి ఎన్ఎస్​యూఐలో చేరారు.

డీఎస్​లోని లీడర్​షిప్ ​క్వాలిటీస్ ​గ్రహించిన ఇందిరాగాంధీ.. ఆయనను ఉమ్మడి ఏపీకి మొదటి ఎన్ఎస్​యూఐ స్టేట్ ​ప్రెసిడెంట్ ​చేశారు. అక్కడి నుంచి ప్రస్థానం ప్రారంభించిన డీఎస్.. పార్టీలో​అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడిగా, జనరల్​సెక్రటరీగా, 2004, 2009లో పీసీసీ ప్రెసిడెంట్​గా పని చేశారు. 

డీఎస్​ సారథ్యంలో రెండుసార్లు అధికారం..  

ఉమ్మడి ఏపీలో 19-94 నుంచి పదేండ్ల పాటు కాంగ్రెస్​అధికారంలో లేదు. ఆ కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డారు డీఎస్. వైఎస్ తో కలిసి పార్టీని బలోపేతం చేశారు. ఇద్దరూ కలిసి 2004, 2009లో రెండుసార్లు కాంగ్రెస్​ను అధికారంలోకి తెచ్చారు. డీఎస్, వైఎస్​జోడీ హిట్​కాంబినేషన్​అని గుర్తింపు తెచ్చుకున్నారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​తో పొత్తు పెట్టుకోవడంలో డీఎస్​ది కీలకపాత్ర. ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ను ఒప్పించారు. ప్రత్యర్థులకు అంతుచిక్కని ఎత్తుగడలు, వ్యూహాలు రచించడంలో దిట్టగా హైకమాండ్ దృష్టిని ఆకర్షించారు. 

సీఎం అయ్యే చాన్స్ మిస్.. 

డీఎస్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో మొదటిసారి అసెంబ్లీకి వెళ్లారు. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జానార్దన్​రెడ్డి, కోట్ల విజయభాస్కర్​రెడ్డి, వైఎస్ హయాంలో మంత్రిగా సేవలందించారు. డీఎస్​ పొలిటికల్ ​లైఫ్​లో ఫెయిల్యూర్స్​ కూడా ఉన్నాయి. 1981లో ఎమ్మెల్సీగా మొదటిసారి పోటీ చేసి ఓడిపోయారు. 1983, 1994, 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాగా, 2009లో డీఎస్ సీఎం అయ్యే చాన్స్ మిస్ అయింది.

వైఎస్ హఠాన్మరణం తర్వాత డీఎస్​ను సీఎం చేస్తారనే టాక్​ స్టేట్​అంతా వినిపించింది. అయితే ఆయన అప్పుడు ఎమ్మెల్యే కాదు.2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో నిజామాబాద్​అర్బన్​సెగ్మెంట్​కు 2010లో జరిగిన ఉప ఎన్నికలోనూ ఓడిపోయారు. దీంతో కీలకమైన సీఎం పదవికి దూరమయ్యారు. 

సోనియాకు విధేయుడు.. 

సోనియాగాంధీకి అత్యంత విధేయుడు డీఎస్. సోనియా, రాహుల్ ను ఎప్పుడైనా కలిసేంత స్వేచ్ఛ ఆయనకు ఉండేది. 2010 ఉప ఎన్నికలో ఓడిపోయిన డీఎస్ ను.. 2013లో కాంగ్రెస్​ఎమ్మెల్సీని చేసింది. అయితే 2015లో ఎమ్మెల్సీ పదవిని మరోసారి పొడిగించాలని ఆయన పార్టీని కోరగా.. సమీకరణలు మారి సాధ్యపడలేదు. దీంతో అలక వహించి బీఆర్ఎస్​లో చేరారు. ఆ తర్వాత బీఆర్ఎస్ డీఎస్ ను 2016లో రాజ్యసభకు పంపింది. కానీ బీఆర్ఎస్ తీరు నచ్చక 2022లో ఆ పార్టీకి రిజైన్​చేశారు. అప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు వెంటాడడంతో యాక్టివ్ ​పాలిటిక్స్​కు దూరంగా ఉన్నారు. 

డీఎస్ పార్థివదేహంపై కాంగ్రెస్ కండువా.. 

డీఎస్ భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్.. డీఎస్ భౌతికకాయానికి నివాళులర్పించి కాంగ్రెస్ కండువా కప్పారు. దీంతో డీఎస్ చివరి కోరిక నెరవేరిందంటూ ఆయన సన్నిహితులు సంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ నేతలు హరీశ్​రావు, తలసాని శ్రీనివాస్​యాదవ్, జగదీశ్​రెడ్డి, ఏపీ కాంగ్రెస్​చీఫ్ షర్మిల

కాంగ్రెస్ నేతలు షబ్బీర్​అలీ, పోచారం శ్రీనివాస్​రెడ్డి, వి.హన్మంతరావు, దానం నాగేందర్, బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, హైదరాబాద్​మేయర్ ​గద్వాల విజయలక్ష్మీ, కె. కేశవరావు తదితరులు డీఎస్ భౌతికకాయానికి నివాళులర్పించారు. కాగా, గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ చీఫ్ జగన్ తదితరులు డీఎస్ మృతికి సంతాపం తెలిపారు. 

డీఎస్ అందరికీ ఆదర్శం..  

ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ లో డీఎస్ కీలక పాత్ర పోషించారు. సుదీర్ఘ కాలం విశిష్ట సేవలు అందించారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. సామాన్యుడి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారు. డీఎస్ రాజకీయ జీవితం నేతలందరికీ ఆదర్శం.  - సీఎం రేవంత్ రెడ్డి 

రాజకీయాల్లో తనదైన ముద్ర.. 

డీఎస్ ఎప్పుడూ హుందాగా రాజకీయం చేసేవారు. నమ్మిన సిద్ధాంతం కోసం పని చేశారు. సుదీర్ఘకాలం రాజకీయల్లో ఉండి తనదైన ముద్ర వేశారు. డీఎస్ మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. 

- ఏపీ సీఎం చంద్రబాబు

నాకు అన్నీ నాన్నే: అర్వింద్

డీఎస్ మృతిపై ఆయన కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘అన్నా.. అంటే నేనున్నా అని, ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇకలేరు. ఐ విల్ మిస్ యూ డాడీ! నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే. ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్నా! నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు. ఎప్పటికీ నాలోనే ఉంటావు” అంటూ ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’లో ఎమోషనల్ పోస్టు పెట్టారు.