ఐఫోన్ ఆశచూపించి అకౌంట్‌లో డబ్బులు మాయం!

  • ఇంటర్నేషనల్​ కాల్స్​తో సైబర్​ దోపిడీ
  • ‘బడే భాయ్ గిఫ్ట్’ అంటూ ఐఫోన్​తో గాలం
  • డబ్బులు ట్రాన్స్​ఫర్ చేసుకున్నాక ఫోన్ డిస్ కనెక్ట్
  • కొత్త తరహా దోపిడీకి తెరలేపిన సైబర్ నేరగాళ్లు
  • దేశవ్యాప్తంగా వందలాది కేసులు నమోదు
  • ఇంటర్నేషనల్ వర్చువల్ నంబర్లతో ఫోన్లు

హైదరాబాద్, వెలుగు : సైబర్ కేటుగాళ్లు ఇంటర్నేషనల్ వర్చువల్ నంబర్లతో కాల్ చేసి బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. ‘బడే భాయ్.. ఛోటే భాయ్ గిఫ్ట్’’పేరుతో ఐ ఫోన్​లను ఆశ చూపి డబ్బులు కొట్టేస్తున్నారు. పాకిస్తాన్ (+92), ఇరాక్ (+96), ఆఫ్గనిస్థాన్ (+97) కోడ్ ఉండే ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి ఫోన్ చేసి.. గిఫ్ట్ ల పేరుతో అకౌంట్లలో ఎంతుంటే అంత దోచేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు వందలకొద్దీ నమోదవుతున్నాయి.

కొన్ని రోజుల కింద అహ్మదాబాద్​కు చెందిన ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించి రూ.7లక్షలు కొట్టేశారు. మన రాష్ట్రంలో ప్రజలు ఈ తరహా సైబర్ మోసాల బారినపడకుండా ఉండేందుకు ఇటీవల సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్​బీ) ఆఫీసర్లతో డీజీపీ జితేందర్ రెడ్డి రివ్యూ చేశారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని, గుడ్డిగా నమ్మి ఎవరికీ డబ్బులు ఫార్వర్డ్ చేయొద్దని సైబర్ సెక్యూరిటీ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

ఐ ఫోన్లను ఆశ చూపి..

వర్చువల్ నంబర్లతోనే కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇతర దేశాలకు చెందిన ఏదో ఒక వర్చువల్ నంబర్​ను డౌన్​లోడ్ చేసుకుని వాట్సాప్​లో ఫోన్ చేస్తారు. ‘బడే భాయ్.. ఛోటే భాయ్’ పేరిట ఐఫోన్లను గిఫ్ట్ రూపంలో ఫ్రీగా ఇస్తున్నామని నమ్మబలుకుతారు. ముందుగా ఫీజు రూపంలో రూ.3వేలు లేదంటే రూ.5వేలు కడితే.. లక్ష రూపాయలు విలువ చేసే ఐఫోన్ మీ సొంతం అంటూ నమ్మిస్తారు. యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలంటారు. తర్వాత వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు. ఆధార్, అకౌంట్ డీటెయిల్స్ తీసుకుంటారు. కొద్ది రోజుల్లో ఫోన్ వచ్చేస్తుందని చెప్తారు.

తర్వాత.. ఎయిర్​పోర్టులో కస్టమ్స్ ఆఫీసర్ల దగ్గర ఫోన్ ఆగిపోయిందని నమ్మిస్తారు. రూ.10వేలు కడితే ఫోన్ ఇంటికి వచ్చేస్తదని చెప్తారు. ఓ లింక్ పంపి డబ్బులు సెండ్ చేయాలంటారు. దాన్ని క్లిక్ చేయగానే.. విడతలవారీగా అకౌంట్​లో ఉన్న డబ్బులన్నీ గుంజేస్కుంటరు. తర్వాత మోసపోయామని తెలిసి ఫోన్ చేస్తే ఆ నంబర్ పని చేయదు. అహ్మదాబాద్​కు చెందిన ఓ వ్యక్తి ఇలాగే మోసపోయి రూ.7లక్షలు పోగొట్టుకున్నాడు. +92, +96, +97 కోడ్ ఉన్న నంబర్ల నుంచి ఫోన్ వస్తే లిఫ్ట్ చేయొద్దని సైబర్ సెక్యూరిటీ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

లింక్​లతో ఖాతాలు కొల్లగొడ్తున్న కేటుగాళ్లు

సైబర్ కేటుగాళ్లు ఎప్పటికప్పుడు టెక్నికల్​గా అప్డేడ్ అవుతున్నరు. ఏదైనా ఒక దారి క్లోజ్ అయితే.. వెంటనే మరో దారి వెతుక్కుంటున్నారు. సైబర్ పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటున్నరు. బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందని, ఓటీపీ చెప్తే రీ స్టార్ట్ చేస్తామని నమ్మించి ఓటీపీతో డబ్బులు కొట్టేసేవాళ్లు. ఇప్పుడు కేవలం ఒక లింక్ క్లిక్ చేస్తే చాలు క్షణాల్లో ఖాతా మొత్తం ఖాళీ అవుతున్నది. కొన్నాళ్లు ఫెడెక్స్ పేరుతో ఫోన్ చేసి.. భయపెట్టి డబ్బులు వసూలు చేశారు. తాము కస్టమ్స్ ఆఫీసర్లమని, మీ పేరుతో డ్రగ్స్, గంజాయి రవాణ అవుతున్నాయంటూ భయపెట్టి అకౌంట్లు ఖాళీ చేశారు. డీజీపీ, కలెక్టర్ ఫొటోలను వాట్సాప్ డీపీలుగా పెట్టుకుని కూడా డబ్బులు గుంజారు.

స్పెషల్ యాప్స్​తో ఫ్రాడ్ కాల్స్​కు చెక్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ డు నాట్ కాల్ వెబ్​సైట్​లో మన ఫోన్ నంబర్​ను రిజిస్టర్ చేసుకుంటే ఇలాంటి ఫ్రాడ్, స్పామ్ కాల్స్ రావు. NDNC.NET వెబ్​సైట్​లోకి వెళ్లి మన నంబర్​ను రిజిస్టర్​ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే కొన్ని యాప్​ల ద్వారా కూడా ఫ్రాడ్ కాల్స్​ను గుర్తించే అవకాశం ఉంది. ఎవరు అడిగినా వ్యక్తిగత వివరాలు చెప్పొద్దు. ఏ వస్తువు అయినా ఫ్రీగా ఇస్తున్నామంటే నమ్మొద్దు. కాగా, సైబర్ మోసాల వెనుక పెద్ద నెట్​వర్కే ఉంది. రోజూ కొన్ని కోట్ల మందికి ఇలాంటి స్పామ్​/ఫ్రాడ్ కాల్స్ వెళ్తున్నాయి. కొన్ని వెబ్​సైట్లు, కంపెనీలు ప్రజల డేటాను అమ్ముకుని డబ్బులు సంపాదించుకుంటున్నాయి. సోషల్ మీడియా, డిజిటల్ పేమెంట్స్ వంటి వాటితోనూ మన డేటా ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతున్నది.

వర్చువల్ నంబర్లను ట్రాక్ చేయలేం

టెలికాం సంస్థలు, పెద్ద కంపెనీలు తమ వ్యాపార విస్తరణ, ప్రమోషన్ల కోసమే టెలీ కాలర్లను పెట్టుకుని ప్రమోట్ చేసుకు నేందుకు వర్చువల్ నంబర్లను తీసుకొచ్చాయి. ఆ నంబర్లకు కాల్ బ్యాక్ చేస్తే కలవదు. దీన్ని ఆసరా చేసుకుని సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ నంబర్లను ట్రాక్ కూడా చేయలేం. ఈ వర్చువల్ నంబర్లను ఒకసారి ఒకరు వాడిన తర్వాత.. మరొకరు కూడా డౌన్​లోడ్ చేసుకుని వాడొచ్చు. దీంతో ఎవరు ఆ నంబర్ యూజ్ చేస్తున్నారో తేల్చడం సవాల్ గా మారుతున్నది. ప్రజలే అప్రమత్తంగా ఉంటే ఇలాంటి నేరాలు అరికట్టొచ్చని అధికారులు అంటున్నారు.