కామారెడ్డి జిల్లాలో భారీ సైబర్ మోసం జరిగింది. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి ఓ వ్యక్తి భారీగా డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి పట్టణ కేంద్రానికి చెందిన భాను ప్రకాష్ అనే వ్యక్తికి.. సైబర్ కేటుగాడు ఫోన్ చేసి ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుకు సంబంధించిన లావాదేవీలు ఆన్ లో ఉన్నాయంటూ నమ్మించాడు. లావాదేవీలను ఆఫ్ చేయాలంటూ చెప్పి.. బాధితుడికి ఓ లింకును పంపాడు.
ఆ లింకును ఓపెన్ చేయగానే ఓటీపీ ద్వారా 1 లక్ష యాభై వేల రూపాయాలు డెబిట్ అయినట్లుగా అతని మొబైల్ ఫోన్ కు మెస్సేజ్ వచ్చింది. దీంతో షాక్ కు గురైన బాధితుడు భాను ప్రకాష్.. వెంటనే కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కామారెడ్డి పోలీసులు తెలిపారు.