సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్లు.. ఒకరు అరెస్ట్

  •     పార్ట్​ టైమ్​జాబ్​పేరుతో రూ.31.60 లక్షలు మోసపోయిన మహిళ
  •     హైదరాబాద్​కు చెందిన నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు

గోదావరిఖని/ మంచిర్యాల వెలుగు : సైబర్​నేరగాళ్లకు బ్యాంక్​ అకౌంట్లను ఇచ్చిన ఒకరిని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సైబర్​క్రైమ్​పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆన్​లైన్​లో పార్ట్​ టైమ్​జాబ్​పేరుతో సైబర్​నేరగాళ్లు మంచిర్యాల జిల్లాకు చెందిన మహిళ నుంచి రూ.31.60 లక్షలు దోచేశారు. 

బాధిత మహిళ గత అక్టోబర్10న రామగుండం కమిషనరేట్​సైబర్ క్రైమ్​స్టేషన్​లో కంప్లయింట్ చేసింది. సైబర్​ క్రైమ్​ఏసీపీ ఎం.వెంకటరమణ, ఇన్ స్పెక్టర్​ జె.కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ చేశారు. హైదరాబాద్​ డబీర్​పురాకు చెందిన ఏసీ టెక్నీషియన్, జొమాటో డెలీవరీ బాయ్​ ఎండీ ఆవాద్​ బ్యాంకు అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ ఫర్ అయినట్టు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. 

మూడు బ్యాంక్​ అకౌంట్లను ఓపెన్​చేసి ఇలియాస్​అనే వ్యక్తికి అప్పగించినట్టు, అతను సైబర్​నేరగాళ్లకు అందజేసినట్టు తెలిపాడు. లక్షకు రూ.300 కమీషన్​ఇస్తున్నట్టు ఆవాద్​ఒప్పుకున్నాడని, మిగతా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ వెంకటరమణ తెలిపారు.