మహబూబ్​నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కాని సాగు

  • వర్షాలు లేక ముందుకు రాని రైతులు
  • నాట్లకు పంద్రాగస్టు వరకే టైం ఉండడంతో ఆందోళన
  • లక్ష్యం మేరకు సాగులోకి వస్తున్న పత్తి పంట 

వనపర్తి/మహబూబ్​నగర్, వెలుగు : వానాకాలం వరి సాగుపై ఆనిశ్చితి నెలకొంది. జూన్​ ముగిసినా ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. అదే నెల నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా రికార్డు స్థాయి వర్షపాతం నమోదు కాకపోగా, 11 శాతం లోటు వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ లెక్కలు చెబుతున్నాయి. దీంతో వరి సాగుపై రైతుల్లో ఆందోళన నెలకొంది. అటు వర్షాలు లేక, ఇటు ప్రాజెక్టులు నిండక.. వరి సాగు చేయాలా? వద్దా? అనే సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.

ఆలస్యం కానున్న వరి సాగు..

ఏటా వానాకాలం సీజన్​లో ఉమ్మడి జిల్లాలోని వనపర్తి, గద్వాల, నాగర్​కర్నూల్, నారాయణపేట, మహబూబ్​నగర్​ జిల్లాల రైతులు ప్రధాన పంటగా వరి సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సాగు విస్తీర్ణం 18.20 లక్షల ఎకరాలు ఉండగా, అందులో 9 లక్షల ఎకరాలకు పైగానే రైతులు వరి సాగు చేస్తారు. అయితే ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనడంతో మేలో రోహిణి కార్తె నుంచే రైతులు వరి సాగు కోసం పొలాల్లో దుక్కులు సిద్ధం చేసుకున్నారు. దీనికితోడు ఈ ఏడాది నుంచి వడ్లకు రాష్ట్ర సర్కారు క్వింటాలుకు రూ.500 బోసన్​ ప్రకటించడంతో పెద్ద మొత్తంలో వరి సాగు చేసేందుకు రెడీ అయ్యారు.

కానీ జులై వచ్చిన వర్షాల జాడ కనిపించడం లేదు. జూన్​ మొదటి వారంలో నైరుతి రావడంతో, అదే నెల రెండో వారంలో వచ్చిన మృగశిర కార్తె నుంచి భారీ వర్షాలు పడతాయని అందరూ ఆశగా ఎదురుచూశారు. కార్తె పోయి నెల కావస్తున్నా ఇప్పటి వరకు భారీ వర్షాలు పడటం లేదు. అడపాదడపా వాన పడుతున్నా, అవి వరి సాగుకు అనుకూలించడం లేదు. రానున్న రెండు వారాల్లో భారీ వర్షాలు పడకుంటే వరి సాగు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి రానుంది. అలాగే ఈ పంట సాగుకు జులై 15 కటాఫ్​ డేట్​ అయినా, ఆగస్టు 15 వరకు నాట్లు వేసుకునే చాన్స్​ ఉంది.

కానీ, ఉన్న సమయం కూడా మించిపోతే సాగుకు వాతావరణం అనుకూలించదని వ్యవసాయ శాఖ పేర్కొంటోంది. వనపర్తి జిల్లాలో లక్ష ఎకరాలకు పైగానే వరి సాగు కావాల్సి ఉన్నా.. ఇంత వరకు 5,159 ఎకరాల్లో మాత్రమే నాట్లు ఉన్నాయి. మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో ఇప్పుడిప్పుడే రైతులు వరి నార్లు పోసుకుంటున్నారు. నాగర్​కర్నూల్, గద్వాల జిల్లాల్లోనూ వరి నాట్లు మొదలు కాలేదు.

వరదలు రాకుంటే ప్రాజెక్టుల కింద సాగు కష్టమే..

నిరుడు మాదిరిగానే ఈసారి కూడా వర్షాలు ముఖం చాటేస్తే ఉమ్మడి జిల్లాలో వరి సాగు కష్టతరం కానుంది. అయితే ఎగువ ప్రాంతాల నుంచి జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరదలు వస్తే కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుల కింద ఉన్న మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్​ ఇరిగేషన్ (ఎంజీకేఎల్ఐ), నెట్టెంపాడు, కోయిల్​సాగర్, భీమా ఫేజ్–-1, ఫేజ్–-2 కింద ఉన్న వరి పైర్లకు కెనాల్స్​ ద్వారా నీటిని అందించుకునే పరిస్థితి ఉంటుంది. కానీ, ప్రస్తుతం ఈ ప్రాజెక్టులు కూడా డెడ్​ స్టోరేజీలో ఉన్నాయి. భారీ వర్షాలు పడితేనో, లేక ఎగువ నుంచి ప్రాజెక్టులకు భారీగా ఇన్​ఫ్లో వస్తేనే వరి నాట్లు ఊపందుకునే పరిస్థితి ఉంది.

ఊపందుకున్న పత్తి..

నాగర్​కర్నూల్, గద్వాల, నారాయణపేట, నాగర్​కర్నూల్​ జిల్లాల్లో మే చివరి వారం నుంచే పత్తి సాగుకు రైతులు సిద్ధం అయ్యారు. రోహిణి కార్తె ముగియగానే దుక్కులు పూర్తి చేసుకున్నారు. మృగశిర కార్తె ప్రారంభం కాగానే పత్తి విత్తనాలు విత్తుకున్నారు. అయితే, చాలా చోట్ల వర్షాలు లేక పత్తి విత్తనాలు మొలకెత్తలేదు. గత వారం నుంచి కురిసిన సాధారణ వర్షాలతో చేలల్లో పత్తి మొలకలు వచ్చాయి. ఇప్పటి వరకు మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో దాదాపు 1.50 ఎకారల్లో, నాగర్​కర్నూల్​లో 2 లక్షల ఎకరాల్లో, గద్వాలలో 40 వేల ఎకరాల్లో సీడ్​ కాటన్​ సాగు కాగా, 70 వేల ఎకరాల్లో వేయాల్సిన కమర్షియల్​ పత్తి సాగు ఇంకా ప్రారంభం కాలేదు.

నెలాఖరు వరకు మెట్ట పంటలు వేసుకోవాలి..

ఈ నెలాఖరు వరకు రైతులు మెట్ట పంటలు వేసుకునేందుకు టైం ఉంది. కంది, మినుములు నెలాఖరు వరకు వేసుకోవచ్చు. జొన్న పంట సాగు చేయాలనుకుంటే ఈ నెల 15వ తేదీలోపు వేసుకోవాలి. ప్రాజెక్టుల కింద ఆయకట్టు ఉన్న రైతులు వరి నాట్లను ఆగస్టు 15 కల్లా ముగించుకోవాలి.

రాజేంద్ర, కేవీకే శాస్త్రవేత్త, మదనాపురం