రైతు భరోసాకు ఆన్​లైన్​ అప్లికేషన్లు!

  • ప్రత్యేక వెబ్​సైట్​ లేదా యాప్​ తెచ్చే యోచనలో ప్రభుత్వం
  • సాగు భూముల గుర్తింపు కోసం శాటిలైట్, ఫీల్డ్ ​సర్వే.. చర్చించిన కేబినెట్​ సబ్​ కమిటీ
  • సంక్రాంతి తర్వాత పెట్టుబడి సాయం పంపిణీ
  • పక్కదారి పట్టకుండాపకడ్బందీగా ఏర్పాట్లు
  • గుట్టలు, రోడ్లకు కాకుండాసాగు భూములకే అందేలా చర్యలు
  • అసెంబ్లీలో సభ్యుల నుంచి వచ్చినసలహాలూ పరిగణనలోకి
  • సీలింగ్​పై సీఎంతో చర్చించి నిర్ణయం

హైదరాబాద్​, వెలుగు: రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీకి టెక్నాలజీ సాయాన్ని వాడాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలనే ప్రతిపాదనపై ఆలోచిస్తున్నది. ఇందుకోసం ప్రత్యేక వెబ్ సైట్​ లేదా యాప్​ను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నది. రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆదివారం సెక్రటేరియెట్​లో కేబినెట్​ సబ్​ కమిటీ సమావేశమైంది. మంత్రులు తుమ్మల నాగేశ్వర్​రావు, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, శ్రీధర్​బాబు పాల్గొన్నారు.

 సంక్రాంతి తర్వాత రైతు భరోసా పంపిణీ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించినందున  విధివిధానాలను ఫైనల్​ చేసేందుకు కమిటీ భేటీ అయింది. ఇప్పటికే కొన్ని సిఫార్సులను ప్రభుత్వం దృష్టికి కేబినెట్​ సబ్​ కమిటీ తీసుకెళ్లింది. ఆ తర్వాత అసెంబ్లీలోనూ పెట్టుబడి సాయంపై చర్చించారు. అందులో వచ్చిన సలహాలు, సూచనలకు తగ్గట్టు ఇంకొంత సమగ్రంగా ఆదివారం కేబినెట్ సబ్​ కమిటీ సమావేశంలో చర్చించారు.  ఇందులో రైతు భరోసా పొందాలనుకునేవారి నుంచి అప్లికేషన్లు​ తీసుకోవాలనే ప్రతిపాదన వచ్చింది. 

అప్లికేషన్లు తీసుకొని, సీసీఎల్​ఏ డేటాతో పోల్చి!

ఎలాంటి చిక్కుముడులు లేకుండా.. కేవలం రైతు పేరు, గ్రామం, మండలం, జిల్లా, పట్టాదారు పాసు పుస్తకం నంబర్,  ఫోన్​ నంబర్​ వివరాలతో ఆన్​లైన్​లో సింపుల్​ అప్లికేషన్​ పెడితే ఎలా ఉంటుందనే దానిపై కేబినెట్​ సబ్​ కమిటీ సమావేశంలో చర్చించారు. ఒక వెబ్ సైట్ తో పాటు ప్రత్యేక యాప్​ను తీసుకురావాలని  ప్రభుత్వానికి రికమెండ్ చేయనున్నట్లు తెలిసింది.  దీని వల్ల  ప్రజాప్రతినిధులు, ఆలిండియా సర్వీస్​ ఆఫీసర్లు, ఇతర బిజినెస్​మెన్​లు రైతు భరోసాకు అప్లై చేసుకుంటారా లేదా అన్నది తేలనుంది.

 గతంలో రైతు బంధు కోసం పెట్టిన ‘గివ్​ ఇట్​ అప్​’తో పెద్దగా ఉపయోగం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. అదే సమయంలో అప్లై చేసుకున్న భూముల్లో కొండలు, గుట్టలు, హైవేలు, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులతోపాటు ఇతర ప్రభుత్వ అవసరాలకు తీసుకున్న భూములకు రైతు భరోసా కోసం ఎవరైనా అప్లై చేసుకుంటున్నారా ? కూడా తేలిపోతుందని.. ఆ భూములను కూడా అగ్రికల్చర్​ నుంచి తీసేసి నోషనల్​ ఖాతాలోకి మార్చేందుకు చాన్స్​ ఉంటుందని భావిస్తున్నారు. రైతుల నుంచి దరఖాస్తులు తీసుకున్న తర్వాత ఆ వివరాలను సీసీఎల్​ఏలోని డేటాతో సరిపోల్చి ఇస్తే ఎలాంటి అక్రమాలకు తావుండదని.. సాగు భూములకు, అర్హులైన వారికే అందుతుందని కేబినెట్ సబ్​ కమిటీలో చర్చించారు. 

రెండు విధాలా సర్వే

సాగు చేసిన , పంటలు సాగయ్యే భూములకే పెట్టుబడి సాయం అందించేందుకు రెండు దశల్లో వెరిఫికేషన్​ నిర్ధారించాలని కేబినెట్​ సబ్​ కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది. ఒకటి శాటిలైట్​ సర్వేతో, రెండోది ఫీల్డ్​ వెరిఫికేషన్ ద్వారా చేపట్టాలని భావిస్తున్నారు. పంటలు వేస్తున్న భూములా ? లేక కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలున్న భూములా..? అని గుర్తించేందుకు శాటిలైట్​ టెక్నాలజీని వాడుకోనున్నారు. సీజన్​ ప్రారంభమైన తర్వాత పెట్టుబడి సాయం చేస్తున్నందున.. అంతకు ముందు సీజన్లలో ఉన్న శాటిలైట్​ ఇమేజ్​లను తొలుత పరిగణనలోకి తీసుకుంటారు.

 ఆ తర్వాత వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవోలు), కొత్తగా గ్రామాల్లో నియమించనున్న గ్రామ పాలనాధికారులు సంయుక్తంగా కలిసి ఫీల్డ్​ సర్వే చేపట్టి.. పంటలు వేశారో లేదో చెక్​ చేయడం, ఏదైనా పంట వేసే అవకాశం ఉంటుందా లేదా అన్నది నిర్ధారించడం వంటివి చేపట్టాలని కేబినెట్​ సబ్​ కమిటీ సిఫార్సు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే గత ప్రభుత్వం 2018–19  నుంచి 2022–2023 వరకు రూ. 22,600 కోట్ల రైతుబంధు నిధులను సాగులోలేని భూములకు చెల్లించిందని ప్రస్తుత ప్రభుత్వం వెల్లడించింది. పెట్టుబడి సాయం పక్కదారి పట్టకుండా.. సాగు భూములకే రైతు భరోసా ఇవ్వాలని తాము భావిస్తున్నట్లు స్పష్టం చేసింది. 

ఎన్ని ఇబ్బందులున్నా ముందుకెళ్తాం: డిప్యూటీ సీఎం భట్టి

ప్రజా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉందని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట మేరకు ముందుకు వెళ్తామని రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్​లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ. 72,659 కోట్లు కేటాయించామని తెలిపారు.  రైతులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న కమిట్​మెంట్ ను ఇది తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు. రూ. 2 లక్షల రైతు రుణమాఫీ కింద రెండు నెలల వ్యవధిలోనే రూ.21 వేల కోట్ల నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని చెప్పారు.

ALSO READ : జనవరి విడుదల..వచ్చే నెలలోనే కులగణన సర్వే రిపోర్ట్​ బయటకు 

 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్​ను అనుసంధానం చేసి రైతు సమస్యలను పరిష్కరించేందుకు రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. పంటల బీమా పథకం కింద ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రైతుల పక్షాన చెల్లిస్తుందని తెలిపారు. రైతు బీమా పథకం కింద రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందన్నారు. 2024–25లో రాష్ట్రంలో లక్ష ఎకరాల ఆయిల్ ఫామ్ సాగును చేపట్టాలని  ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. సన్న వడ్లకు ప్రతి క్వింటాకు రూ. 500 బోనస్ గా చెల్లిస్తున్నామన్నారు. కేబినెట్​ సబ్​ కమిటీ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్​ రావు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.  

సీఎంతో చర్చించాక సీలింగ్​పై నిర్ణయం!

ఒక్క రైతుకు ఎంత భూమి ఉన్నా ఆ మొత్తం భూమికి రైతు భరోసా ఇవ్వాలా లేక కొన్ని ఎకరాలకు సీలింగ్​ పెట్టాలా అనే దానిపై రకరకాల అభిప్రాయాలు కేబినెట్​  సబ్​ కమిటీ దృష్టికి వచ్చాయి. అసెంబ్లీలో చర్చ సందర్భంగా కూడా  కొందరు ఎమ్మెల్యేలు 10 ఎకరాలకు సీలింగ్​ పెట్టాలని.. కొందరు అవసరం లేదని.. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 15 ఎకరాల వరకు లిమిట్​ ఉండాలని సూచనలు చేశారు.

జిల్లాల్లో కేబినెట్​ సబ్​ కమిటీ చేపట్టిన అభిప్రాయ సేకరణలో ఏడున్నర ఎకరాలు లేదా పది ఎకరాలకు సీలింగ్​  పెట్టాలనే సూచనలు వచ్చాయి. ఆదివారం కేబినెట్​ సబ్​ కమిటీలోనూ దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలిసింది. దీంతో సీఎం రేవంత్​రెడ్డితో చర్చించాకే ఎన్ని ఎకరాలకు సీలింగ్​ పెట్టాలనేది ఫైనల్​ చేయనున్నారు. అదేవిధంగా.. ఎకరాకు ఎంత మొత్తం ఇవ్వాలనే దానిపైనా చర్చించారు.